చందాతో కారు షికారు

కారు సొంతం కావాలంటే  ఇకపై కొనాల్సిన పనిలేదు.. చందాదారుగా చేరి నచ్చిన కారులో షికారు చేయవచ్చు అంటున్నాయి ఆటోమొబైల్‌ కంపెనీలు.

Updated : 29 Jan 2023 03:21 IST

2023లో వాహన రంగంలో కొత్త ధోరణులు
ఈవీలకు కలిసిరావొచ్చంటున్న నిపుణులు
కారున్న కుటుంబాల జాతీయ సగటు 7.5 శాతమే
సబ్‌స్క్రిప్షన్‌తో మార్కెట్‌ను పెంచుకునే దిశగా సంస్థలు
ఈనాడు - హైదరాబాద్‌

కారు సొంతం కావాలంటే  ఇకపై కొనాల్సిన పనిలేదు.. చందాదారుగా చేరి నచ్చిన కారులో షికారు చేయవచ్చు అంటున్నాయి ఆటోమొబైల్‌ కంపెనీలు. నచ్చిన కొత్త కారు కొనేందుకు తగిన ఆర్థిక వెసులుబాటు లేక.. నిర్ణయాలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటారు. ఇలాంటివారు ఇకపై  చందాకట్టి కారును ఇంటికి నడపుకుంటూ వెళ్లవచ్చు అని చెబుతున్నారు.  కొవిడ్‌కు ముందు సర్వీస్‌ ప్రొవైడర్లు మొదలెట్టిన సబ్‌స్క్రిప్షన్‌ విధానం.. కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి బాగా విస్తరించే అవకాశం ఉందని ఆటోమొబైల్‌ నిపుణులు అంటున్నారు.

కారు ఉండడం ఇదివరకు విలాసమైతే... ఇప్పుడు చాలామందికి అవసరంగా మారింది. హైదరాబాద్‌లో 20 నుంచి 50 కి.మీ.దూరంలోని పని ప్రదేశాలకు అధికాదాయ వర్గాలు కారులోనే వెళుతున్నారు. మధ్యతరగతి వర్గాలు వారాంతంలో మాత్రమే కారును బయటికి తీస్తున్నాయి. ఇప్పటికీ ప్రతి వందలో ఏడు కుటుంబాలే కారును కల్గి ఉన్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(2019-21) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో ఆరు కుటుంబాలకే కారు యోగ్యం ఉంది. హైదరాబాద్‌లో దీనికి రెట్టింపు కుటుంబాలు కార్లను కల్గి ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా 80 శాతం కుటుంబాలు కార్లకు దూరంగా  ఉన్నాయి. ఆర్థికంగా కారు కొనేంత వెసులుబాటు లేకపోవడంతో వీరంతా కారుకు దూరంగా ఉన్నారు. ఆటోమొబైల్‌ కంపెనీలు వీరిని లక్ష్యంగా పథకాలతో ముందుకొస్తున్నాయి. ఇన్వెంటరీని వదిలించుకునేందుకు కూడా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిందే సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌.  కార్ల విక్రయాల్లో అత్యధిక వాటా కలిన మారుతీ సుజుకీనే సబ్‌స్క్రిప్షన్‌  మోడల్‌ను ప్రోత్సహిస్తోంది. దీంతో కారు యోగం మరింత మందికి పట్టనుందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.  విద్యుత్తు వాహనాలు కొనాలని చూస్తున్నా.. ఖరీదు కావడంతో వెనకడుగు వేస్తున్నారు. చందా విధానంలో వీటి విక్రయాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

నెలవారీ రుసుముతో..

ప్రస్తుతం మనవాళ్లు ఎక్కువగా ఎస్‌యూవీలు కొంటున్నారు. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లను ఇష్టపడేవారు ఉన్నారు. వీటిలో దేనికైనా నెలవారీ చందా చెల్లించి ఇంటికి తీసుకెళ్లవచ్చు. కొత్తకారు కొనాలంటే సాధారణంగా డౌన్‌పేమెంట్‌ కొంత చెల్లించి.. మిగతా మొత్తం రుణం తీసుకుంటుంటారు. ఆ తర్వాత బీమా, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు తడిసి మోపెడవుతుంది. రూ.10 లక్షల విలువైన కారు కొంటే ఏడాది పూర్తి బీమా, మూడేళ్లు థర్డ్‌పార్టీ బీమాతో పాటూ రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు కలిపి రెండు లక్షలు అవుతున్నాయి.  కారు ధర కంటే పన్నులే ఎక్కువ అ‘ధర’గొడుతున్నాయి.  అంత వెచ్చించే స్థోమత లేక కొంతమంది వెనక్కి తగ్గుతున్నారు. సబ్‌స్క్రిప్షన్‌ విధానంలో నచ్చిన కారును ఎంపిక చేసుకుని.. నెలవారీ చందా మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.  ఎంపిక చేసుకున్న కాలవ్యవధి వరకు కారు మీ వద్దే ఉంటుంది. దానికి యాజమాని కూడా మీరే అంటున్నాయి ఆటోమొబైల్‌ కంపెనీలు.  డౌన్‌పేమెంట్‌ కోసం వెతుక్కుకోవాల్సిన పనిలేదు. బ్యాంకు రుణం తీసుకుని నెలవారీ ఈఎంఐ చెల్లించాల్సిన అవసరమే కాదు. నేరుగా ఆయా కంపెనీలకే చందా చెల్లిస్తే సరిపోతుంది.

ఎప్పటికప్పుడు కొత్త కారు..

ఆటోమొబైల్‌ రంగంలో పోటీ పెరగడంతో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ మార్కెట్లోకి వస్తున్నాయి. రెండు మూడేళ్లలో అప్‌గ్రేడ్‌ చేస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులు మూడు నాలుగేళ్లకే మోడల్‌ను మారుస్తున్నారు. చాలామంది స్థోమత లేక పాత మోడల్‌ కారునే నడిపిస్తున్నారు. చందా విధానంలో 12 నెలల నుంచి 48 నెలల కాలంలో అనువైన దాన్ని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి 24 నెలలకు చందాదారుడిగా చేరి.. గడువు తర్వాత నచ్చిన మరో కారును ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే పాతగడువును పొడిగించుకోవచ్చు. మీ దగ్గర ఉన్నంత కాలమే చందా చెల్లిస్తారు. రూ.13,000 నుంచి చందాలు మొదలవుతాయి. ఆటోమొబైల్‌ సంస్థలే కాదు ఏఎల్‌డీ, ఆటోమోటివ్‌, మైల్స్‌, ఓరిక్స్‌ వంటి సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తున్న సంస్థల్లో చేరి చందాదారుగా మారవచ్చు.

* కొత్త కారు కొంటే ఏడాదిలో రూ.లక్ష దాకా వాహన విలువ తగ్గుతుంది. బీమా, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు కలుపుకుంటే ఇంకా ఎక్కువ. అదే చందా విధానంలో నెలకు రూ.14,000.. అంటే ఏడాదికి రూ.1.60 లక్షలతో కారును ఏడాది పాటూ నడుపుకోవచ్చు.

* డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటూ బ్యాంకు రుణం తీసుకునే సమయంలో ఎలాంటి పత్రాలు అడుగుతారో వాటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు