పెద్ద సినిమాలా.. ఆచితూచి కొందాం!

టీవీల్లో సినిమాలు చూసేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని మింట్‌ నివేదిక వెల్లడించింది. థియేటర్లలో సరిగా ఆడని సినిమాలను టీవీ బ్రాడ్‌కాస్టర్లు కొనుగోలు చేసి ప్రదర్శించినా కూడా, చూస్తున్న వారి సంఖ్య పెద్దగా ఉండటం లేదని తెలిపింది.

Updated : 29 Jan 2023 09:17 IST

టీవీ బ్రాడ్‌కాస్టర్ల తీరుపై మింట్‌ నివేదిక

టీవీల్లో సినిమాలు చూసేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని మింట్‌ నివేదిక వెల్లడించింది. థియేటర్లలో సరిగా ఆడని సినిమాలను టీవీ బ్రాడ్‌కాస్టర్లు కొనుగోలు చేసి ప్రదర్శించినా కూడా, చూస్తున్న వారి సంఖ్య పెద్దగా ఉండటం లేదని తెలిపింది. దేశీయంగా థియేటర్లలో కోట్ల రూపాయల వర్షం కురిపించిన కేజీఎఫ్‌2, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలను కూడా టీవీల్లో చూసిన ప్రేక్షకుల సంఖ్య ఆ స్థాయిలో లేదని పేర్కొంది. అందువల్ల భారీ బడ్జెట్‌లతో కూడిన పెద్ద సినిమాలను కొనుగోలు చేసేందుకు టీవీ బ్రాడ్‌కాస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని మింట్‌ నివేదిక తెలిపింది.

కారణమిదీ

స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లకు అధికశాతం మంది ప్రేక్షకులు మారుతున్నారు. తమకు అనువైన సమయంలో, ప్రకటనలు లేకుండా, సినిమాలు చూసే అవకాశం ఉండటంతో ప్రజలు వాటివైపు అధికంగా మొగ్గు చూపుతున్నారని గోల్డ్‌మైన్స్‌ టెలీఫిల్మ్స్‌ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌ మనీశ్‌ షా వెల్లడించారు. కంటెంట్‌ బాగుంటే, ఏ భాషా చిత్రాన్ని అయినా, సబ్‌టైటిల్స్‌ సాయంతో చూస్తున్న యువత సంఖ్యా అధికంగా ఉంటోంది. పెద్ద స్టార్లు లేని, తక్కువ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిన్న సినిమాలను, మరింత తక్కువ ధరలకే బ్రాడ్‌కాస్టర్లకు నిర్మాతలు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో, భారీ బడ్జెట్‌తో నిర్మించి, థియేటర్లలో ఆదరణ పొందని పెద్ద సినిమాలను, తక్కువ ధరలకే టీవీ బ్రాడ్‌కాస్టర్లకు అమ్ముకోవాల్సి వస్తోందని నిర్మాతలు చెబుతున్నారని ఆ నివేదిక విశ్లేషించింది.

ప్రకటనల ఆదాయమూ తగ్గుతోంది  

ఈ సంక్షోభం కొవిడ్‌-19 మహమ్మారికి ముందే వచ్చింది. తర్వాత పరిస్థితులు మరింత దయనీయంగా మారిపోయాయి. ‘83’, ‘ధాకడ్‌’ వంటి పెద్ద సినిమాలు బాక్సాఫీసును మెప్పించలేకపోయాయి. దీంతో టీవీ బ్రాడ్‌కాస్టర్లు సైతం వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. గత కొన్నేళ్లుగా టీవీ ఛానెళ్లలో సినిమాలు చూసే వారి సంఖ్య (వ్యూయర్‌షిప్‌) తగ్గుతున్నందున, ప్రకటనల ఆదాయం కూడా 40 శాతం మేర తగ్గిందని మింట్‌ నివేదిక వివరించింది.

* కొవిడ్‌ ముందుతో పోలిస్తే, టీవీ బ్రాడ్‌కాస్టర్లు కొనుగోలు చేస్తున్న సినిమాల రేట్లు సగానికి తగ్గినట్లు ఆ నివేదిక పేర్కొంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, ఈ ఏడాదిలో చాలా సినిమాలను టీవీ బ్రాడ్‌కాస్టర్లు కొనే అవకాశం కూడా ఉండదని తెలుస్తోంది.

* పెద్ద సినిమాల శాటిలైట్‌ హక్కులు గతంలో రూ.50 కోట్ల వరకు ఉండేవి. కేజీఎఫ్‌2, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి బాక్సాఫీస్‌ హిట్‌ సినిమాలను సైతం టీవీల్లో ప్రదర్శించినపుడు వ్యూయర్‌షిప్‌ ఆశించిన మేర నమోదు కాకపోవడంతో, ఇప్పుడు పెద్ద సినిమాల శాటిలైట్‌ హక్కులు రూ.25-30 కోట్లకు పరిమితమయ్యాయని మింట్‌ వివరించింది.

* చిన్ని సిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై నేరుగా విడుదల చేస్తుండటంతో, వాటిని కొనుగోలు చేసేందుకు టీవీ బ్రాడ్‌కాస్టర్లు చాలా తక్కువ మంది ముందుకొస్తున్నారు. శాటిలైట్‌ విభాగ ఆదాయం అనేది భవిష్యత్‌లో నిర్మాతలకు గొప్ప ఆదాయ వనరుగా కనిపించడం లేదని ట్రేడ్‌ అనలిస్ట్‌ శ్రీధర్‌ పిళ్లై వెల్లడించారు. స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు కనీసం నెల వరకూ టీవీల్లో సినిమాలు రాకూడదని డిమాండ్‌ చేస్తుండటంతో, ఆ తర్వాత టీవీల్లో వచ్చినా చూసే వారి సంఖ్య బాగా తగ్గిపోతోంది. దీంతో ప్రకటనల ఆదాయం కూడా గణనీయంగా పడిపోతోందని ఆయన వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని