బడ్జెట్‌, ఫెడ్‌ ముందు అప్రమత్తత

గత శుక్రవారం కనిపించిన నష్టాల నేపథ్యంలో మదుపర్లు ఈ వారం అప్రమత్తతతో వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Published : 30 Jan 2023 01:15 IST

అంచనాలకు తగ్గట్లుగా అవి ఉంటే దూకుడే

18,000 స్థాయికి ఎగువన నిఫ్టీకి లాభాలు

వాహన షేర్లలో సానుకూలతలు కొనసాగొచ్చు

ఎఫ్‌ఎమ్‌సీజీ, సిమెంటు షేర్లకు ఒత్తిడి

విశ్లేషకుల అంచనాలు

స్టాక్‌ మార్కెట్‌

ఈ వారం

త శుక్రవారం కనిపించిన నష్టాల నేపథ్యంలో మదుపర్లు ఈ వారం అప్రమత్తతతో వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై అదానీ గ్రూపు ఇచ్చిన 413 పేజీల వివరణను మదుపర్లు పరిగణనలోకి తీసుకోవచ్చు. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పరపతి సమావేశం, కేంద్ర బడ్జెట్‌లు ఈ వారమే చోటు చేసుకుంటుడడం కూడా మదుపర్లలో జాగ్రత్తను పెంచొచ్చని భావిస్తున్నారు. బడ్జెట్‌లో సానుకూల ప్రకటనలు ఉంటే అవి కీలక సూచీల్లో నష్టాలను పరిమితం చేసే అవకాశం ఉందని అంచనా కడుతున్నారు. నిఫ్టీకి తక్షణ మద్దతు 17300 వద్ద కనిపిస్తోంది. నిరోధం 17,900 వద్ద ఎదురుకావొచ్చని సాంకేతిక నిపుణులు అంటున్నారు. నిఫ్టీ తన కీలక 18,000 స్థాయిపైకి వెళ్లినా.. లాభాలు జోరందుకోవచ్చంటున్నారు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

బ్యాంకు షేర్లు ప్రతికూలంగా చలించొచ్చు. అదానీ గ్రూప్‌ సంస్థల షేర్ల పతనం ఇందుకు నేపథ్యం. అయితే అదానీ అప్పుల్లో 40 శాతం కంటే తక్కువగానే భారత బ్యాంకులు రుణాలిచ్చాయి. ప్రైవేటు బ్యాంకులైతే మొత్తం అప్పుల్లో 10% కంటే తక్కువే ఇచ్చాయి. బ్యాంక్‌ సూచీకి 39,900 వద్ద మద్దతు; 41,500 వద్ద నిరోధం కనిపించొచ్చు.

వాహన కంపెనీలు సానుకూల ధోరణిని కొనసాగించొచ్చు. డిసెంబరు త్రైమాసికంలో వాహన కంపెనీల ఫలితాలు బలంగా నమోదు కావడంతో మదుపర్లు ఈ రంగ భవిష్యత్‌ అంచనాలపై ఆశావహంగా ఉన్నారు.

కేంద్ర బడ్జెట్‌కు ముందు లోహ కంపెనీలు లాభపడే అవకాశం ఉంది. వాహన కంపెనీల నుంచి బలమైన గిరాకీ కనిపిస్తుండడం ఇందుకు నేపథ్యం. విదేశీ సంస్థాగత మదుపర్ల నుంచి లోహ కంపెనీల్లోకి పెట్టుబడులు వస్తుండడం కూడా కలిసొచ్చే అంశం.

టెలికాం కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి చలించొచ్చు. జియో మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.2,400-2,450 స్థాయులకు చేరితే లాభాలు రావొచ్చు. ఎయిర్‌టెల్‌ రూ.750-790 మధ్య కదలాడొచ్చు.

ఫిబ్రవరి 1న జరగనున్న పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్‌) సమావేశ ఫలితాల నుంచి అప్‌స్ట్రీమ్‌ కంపెనీల షేర్లు సంకేతాలు అందుకోవచ్చు. ఉత్పత్తిలో కోతను ప్రకటిస్తే అప్‌స్ట్రీమ్‌ కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది. ఐఓసీ ఫలితాలనూ మదుపర్లు గమనించొచ్చు.

ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ సమావేశం వంటి ప్రధాన అంశాలపై ఆధారపడి ఐటీ షేర్ల ట్రేడింగ్‌ జరగొచ్చు. ప్రభుత్వ డిజిటైజేషన్‌ కార్యక్రమాలపై బడ్జెట్‌లో తీసుకునే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించొచ్చు.

ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు ఒత్తిడికి లోనుకావొచ్చు. బడ్జెట్‌లో సానుకూల ప్రకటనలు ఉంటేనే ఈ షేర్లు రాణించే అవకాశం ఉంది.

ఫార్మా కంపెనీల షేర్లు స్తబ్దుగా కదలాడవచ్చు. మార్కెట్లో నష్టాలు కనిపిస్తున్నా.. రక్షణాత్మక రంగమైన ఫార్మాలో కొనుగోళ్లు కనిపించకపోవడం గమనార్హం. రాబోయే కేంద్ర బడ్జెట్‌, ఆర్థిక ఫలితాలకు మాత్రమే ఇవి స్పందించవచ్చు.

సిమెంటు కంపెనీల షేర్లలో ఒత్తిడి కొనసాగొచ్చు. కొన్ని కంపెనీల ఫలితాలు అంచనాల కంటే తక్కువగా నమోదు కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.


నేటి బోర్డు సమావేశాలు

ఎల్‌అండ్‌టీ, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, లారస్‌ ల్యాబ్స్‌, పీఎన్‌బీ, ఆర్‌ఈసీఎల్‌, బజాజ్‌ హోల్డింగ్‌, సీఎస్‌బీ బ్యాంక్‌, ఎల్‌టీ ఫుడ్స్‌, ధంపుర్‌ షుగర్‌, ద్వారికేశ్‌ షుగర్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, ఐఐఎఫ్‌ఎల్‌, ఎంఆర్‌పీఎల్‌, నామ్‌ ఇండియా, ఓరియెంట్‌ ఎలక్ట్రిక్‌, ట్రైడెంట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని