బలహీనతలు కొనసాగొచ్చు!

సాధారణ బడ్జెట్‌కు ముందు మదుపర్ల అమ్మకాలతో గత వారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలతో మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతింది.

Published : 30 Jan 2023 01:17 IST

సెన్సెక్స్‌ విశ్లేషణ
జనవరి 27తో ముగిసిన వారానికి

సమీక్ష: సాధారణ బడ్జెట్‌కు ముందు మదుపర్ల అమ్మకాలతో గత వారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలతో మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓపై భయాలు కూడా ప్రభావం చూపాయి. అదానీ గ్రూప్‌ షేర్ల పతనంతో ఒడుదొడుకులు అధికమయ్యాయి. ఈ కంపెనీలతో సంబంధం ఉన్న బ్యాంక్‌లు, ఇతర సంస్థలకు అమ్మకాలు తప్పలేదు. విదేశీ మదుపర్ల అమ్మకాలు, రూపాయి క్షీణత ఇందుకు తోడయ్యాయి. దేశీయంగా చూస్తే.. త్రైమాసిక ఫలితాల ప్రభావంతో షేరు ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించాయి. బ్యారెల్‌ ముడిచమురు 1.1 శాతం తగ్గి 86.7 డాలర్ల వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 81.12 నుంచి 81.52కు బలహీనపడింది. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా నాలుగో త్రైమాసిక జీడీపీ అంచనాలకు మించి 2.9 శాతంగా నమోదైంది. మూడో త్రైమాసికంలో నమోదైన 3.2 శాతంతో పోలిస్తే ఇది తక్కువే. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు భయాలు మాత్రం కొనసాగాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 2.1 శాతం నష్టంతో 59,331 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 2.3 శాతం కోల్పోయి 17,604 పాయింట్ల దగ్గర స్థిరపడింది. విద్యుత్‌, చమురు- గ్యాస్‌, బ్యాంకింగ్‌ రంగాలు నష్టపోగా.. వాహన, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఐటీ షేర్లు రాణించాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.9,352 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.7,211 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. జనవరిలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (ఎఫ్‌పీఐలు) మొత్తంగా రూ.17,023 కోట్లు వెనక్కి తీసుకున్నారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 2:7గా నమోదు కావడం..
మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని సూచిస్తోంది.

ఈ వారంపై అంచనా: కీలక మద్దతు స్థాయి 59,600 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్‌, గతవారం నష్టాల్లో ముగిసింది. ప్రస్తుతం 58,900 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించొచ్చు. అది కోల్పోతే 58,000 దగ్గర మరో మద్దతు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు రికవరీ వస్తే, 59,600- 61,000 పాయింట్ల శ్రేణిలో నిరోధం ఎదురుకావొచ్చు. స్వల్పకాలంలో ఒడుదొడుకులు మరింత పెరగొచ్చు.

ప్రభావిత అంశాలు: బుధవారం (ఫిబ్రవరి 1న) వెలువడనున్న సాధారణ బడ్జెట్‌ మార్కెట్లకు కీలకం కానుంది. స్వల్పకాలంలో మార్కెట్‌ సెంటిమెంట్‌ను ఇది నిర్ణయించనుంది. 2022-23 ఆర్థిక సర్వే నుంచి సూచీలు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. ఆర్థిక గణాంకాలు, నెలవారీ వాహన విక్రయాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు, అమెరికా ఫెడ్‌ సమావేశ నిర్ణయాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓ విఫలమైతే సెంటిమెంట్‌ మరింత బలహీనపడొచ్చు. అదానీ గ్రూప్‌, ఇతర సంస్థలకు రుణాలు ఇచ్చిన బ్యాంక్‌లపైనా దృష్టి పెట్టొచ్చు. ఈ వారం బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, దివీస్‌ ల్యాబ్స్‌, ఐటీసీ, మారికో, టాటా పవర్‌, ఐఓసీ, గోద్రేజ్‌ కన్జూమర్‌, కోల్‌ ఇండియా, ఏసీసీ, అశోక్‌ లేలాండ్‌, బ్రిటానియా, జుబిలెంట్‌ ఫుడ్‌, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, డాబర్‌, బెర్జర్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా ఫెడ్‌ వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. ఈసీబీ, బీఓఈ వడ్డీ రేట్ల నిర్ణయాలపై దృష్టిపెట్టొచ్చు. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలు, ఎఫ్‌ఐఐ కొనుగోళ్ల నుంచి సంకేతాలు తీసుకోవచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 58,744, 58,000, 57,050
తక్షణ నిరోధ స్థాయులు: 59,800, 60,167, 60,900
సెన్సెక్స్‌ బలహీనతలు కొనసాగే అవకాశం ఉంది.

సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని