భారత్‌ వృద్ధిపై అక్కసుతోనే ఆరోపణలు

భారత్‌, భారతీయ సంస్థలు, అవి సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ తమపై ఆరోపణలు చేసిందని గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని, అసత్యాలంటూ 413 పేజీల్లో తన స్పందనను తెలియజేసింది.

Updated : 30 Jan 2023 08:12 IST

భారతీయ కంపెనీలపై ఉద్దేశపూర్వక దాడి ఇది
తప్పుడు సమాచారం ప్రచారం చేసి లాభాలు ఆర్జించే యత్నం
హిండెన్‌బర్గ్‌ నివేదికపై అదానీ 413 పేజీల స్పందన

దిల్లీ: భారత్‌, భారతీయ సంస్థలు, అవి సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ తమపై ఆరోపణలు చేసిందని గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని, అసత్యాలంటూ 413 పేజీల్లో తన స్పందనను తెలియజేసింది. మార్కెట్‌లో తప్పుడు ఆరోపణలు ప్రచారం చేసి తద్వారా ఆర్థిక లాభాలు పొందాలనే దురుద్దేశంతోనే అమెరికాకు చెందిన ఈ షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ తమపై నివేదిక విడుదల చేసిందని అందులో పేర్కొంది. తనకు నచ్చినవిధంగా తప్పుడు సమాచారాన్ని చేర్చి దీనిని రూపొందించిందని తెలిపింది. ‘ఇది ఏదో ఒక కంపెనీపై చేసిన దాడి కాదు. భారత్‌, భారత స్వతంత్రత, సమైఖ్యత, భారతీయ సంస్థలు, వృద్ధి గాధ, ఆశయాలపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడి’ అని అదానీ గ్రూపు తెలిపింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీఓకు ముందు ఈ నివేదికను విడుదల చేయడం వెనక హిండెన్‌బర్గ్‌ ఉద్దేశమేమిటో మనం అర్థం చేసుకోవచ్చని పేర్కొంది. ఈ పరిణామం ఆ అమెరికా సంస్థ విశ్వసనీయత, నైతికతపై సందేహాలు ఏర్పడేందుకు ఈ దారితీస్తుందని అందులో వెల్లడించింది. ఎలాంటి కారణాలు లేకుండా.. ఎటువంటి పరిశోధన చేయకుండా ఈ నివేదికను హిండెన్‌బర్గ్‌ విడుదల చేసిందని అదానీ గ్రూపు వివరించింది. హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన 88 ప్రశ్నల్లో 65 ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని అదానీ గ్రూపు కంపెనీలు ఇప్పటికే వెల్లడించాయని అదానీ గ్రూపు పేర్కొంది. మరో 23 ప్రశ్నల్లో 18 ప్రశ్నలు.. వాటాదార్లు, థర్డ్‌ పార్టీలకు సంబంధించినవని వెల్లడించింది. మిగిలిన 5 ప్రశ్నలు.. నిరాధార ఆరోపణలు అని వివరించింది. వీటిని తమ నమోదిత కంపెనీలు ఖండించాయని అదానీ గ్రూపు తెలిపింది. తమకు వర్తించే చట్టాలు, నిబంధనలను ఎల్లప్పుడూ పాటిస్తున్నామని పునరుద్ఘాటించింది. వాటాదార్ల ప్రయోజనాలను కాపాడేందుకు అత్యున్నత స్థాయి పాలనా ప్రమాణాలను పాటించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడమే అదానీ గ్రూపు సంస్థల ప్రాధాన్యమని అన్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (ఏఈఎల్‌) రూ.20,000 కోట్ల మలివిడత పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) విజయవంతం అవుతుందని అదానీ గ్రూపు సీఎఫ్‌ఓ జుగ్షిందర్‌ సింగ్‌ తెలిపారు. వేగంగా వృద్ధి చెందుతున్న విమానాశ్రయాలు, గనులు, రహదారులు, కొత్త ఇంధనం, డేటా కేంద్రాల వ్యాపారాలను నిర్వహిస్తున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో వాటాను సొంతం చేసుకునేందుకు సంస్థాగత మదుపర్లకు ఎఫ్‌పీఓ ఓ అద్భుత మార్గమని తెలిపారు.

నికరంగా లాభాల్లోనే ఎల్‌ఐసీ: హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రభావంతో అదానీ గ్రూపు షేర్లు భారీగా పతనమైనప్పటికీ.. గత కొన్నేళ్లలో ఈ షేర్లలో పెట్టిన పెట్టబడులపై లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఇప్పటికీ నికరంగా లాభాల్లోనే ఉంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీల వద్ద లభ్యమవుతున్న సమాచారం ప్రకారం.. గత కొన్నేళ్లలో అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో ఎల్‌ఐసీ రూ.28,400 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. హిండెన్‌బర్గ్‌ నివేదికకు ముందు ఈ పెట్టుబడుల విలువ రూ.72,200 కోట్లుగా ఉండేది. అయితే రెండో రోజులుగా అదానీ షేర్లు పతనం కావడంతో.. ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ రూ.55,700 కోట్లకు దిగివచ్చింది. దీని ప్రకారం ఎల్‌ఐసీ తొలుత పెట్టిన రూ.28,400 కోట్ల పెట్టుబడితో పోలిస్తే ఇప్పటికీ నికరంగా రూ.27,300 కోట్ల లాభంలోనే ఉందన్నమాట. మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల ఎఫ్‌పీఓలోనూ యాంకర్‌ ఇన్వెస్టర్‌గా ఎల్‌ఐసీ రూ.300 కోట్లను పెట్టుబడులుగా పెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు