ఊగిసలాట మధ్య స్వల్ప లాభాలు

సూచీల రెండు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. ఆద్యంతం ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు, చివరకు లాభాలతో ముగిశాయి. ఐటీ, చమురు, ఫైనాన్స్‌ షేర్లు రాణించడం కలిసొచ్చింది.

Published : 31 Jan 2023 02:35 IST

సమీక్ష

సూచీల రెండు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. ఆద్యంతం ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు, చివరకు లాభాలతో ముగిశాయి. ఐటీ, చమురు, ఫైనాన్స్‌ షేర్లు రాణించడం కలిసొచ్చింది. మన సాధారణ బడ్జెట్‌, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశాలకు ముందు మదుపర్లు అప్రమత్తత పాటించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు రాణించి 81.52 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.25 శాతం తగ్గి 86.44 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సియోల్‌, హాంకాంగ్‌ నష్టపోగా, టోక్యో, షాంఘై లాభపడ్డాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 59,101.69 పాయింట్ల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. రోజంతా ఒడుదొడుకుల మధ్యే కదలాడిన సూచీ, ఇంట్రాడేలో 59,644.24 వద్ద గరిష్ఠాన్ని, 58,699.20 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 169.51 పాయింట్ల లాభంతో 59,500.41 వద్ద ముగిసింది. నిఫ్టీ 44.60 పాయింట్లు పెరిగి 17,648.95 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 17,405.55- 17,709.15 పాయింట్ల మధ్య కదలాడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 17 లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 4.61%, అల్ట్రాటెక్‌ 2.51%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 2.22%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.73%, ఎన్‌టీపీసీ 1.53%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.45%, ఇన్ఫోసిస్‌ 1.37%, విప్రో 1.11%, మారుతీ 0.96% చొప్పున లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌ 3.38%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.56%, ఎల్‌ అండ్‌ టీ 2.11%, టాటా స్టీల్‌ 1.62%, హెచ్‌యూఎల్‌ 1.55% నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో.. యుటిలిటీస్‌ 5.74%, విద్యుత్‌ 5.30%, చమురు-గ్యాస్‌ 4.06%, ఇంధన 3.12%, యంత్ర పరికరాలు 1.30%, లోహ 1.18% డీలాపడ్డాయి. ఐటీ, టెక్‌, మన్నికైన వినిమయ వస్తువులు, టెలికాం, వినియోగ, కమొడిటీస్‌ రాణించాయి. బీఎస్‌ఈలో 1449 షేర్లు లాభాల్లో ముగియగా, 2156 స్క్రిప్‌లు నష్టపోయాయి. 158 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

* వంట నూనెల ప్యాకెట్ల లేబుళ్లపై ‘ప్యాకింగ్‌ సమయంలో ఉన్న ఉష్ణోగ్రతకు బదులుగా నికర బరువు’ను ముద్రించేందుకు వంట నూనెల తయారీదార్లు, ప్యాకర్లు, దిగుమతిదార్లకు మరో 6 నెలల గడువును ప్రభుత్వం ఇచ్చింది. లేబుళ్లను సరిదిద్దేందుకు గతంలో ఇచ్చిన గడువు జనవరి 15తో ముగిసినందున, జులై 15 వరకు సమయం ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. అనైతిక వ్యాపార విధానాలకు అడ్డుకట్ట వేసేందుకే వంట నూనెల ప్యాకింగ్‌ లేబుళ్లలో మార్పులు చేయాలని ప్రభుత్వం సూచించింది.

* స్టాఫింగ్‌ సంస్థ ఫస్ట్‌మెరిడియన్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ ఐపీఓ కోసం తాజాగా ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూ పరిమాణాన్ని రూ.800 కోట్ల నుంచి రూ.740 కోట్లకు తగ్గించింది.

* చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియామీ గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, భారత విభాగం మాజీ అధిపతి మను కుమార్‌ జైన్‌ తన పదవికి రాజీనామా చేశారు. 2014 నుంచి 9 ఏళ్ల పాటు ఆయన కంపెనీని భారత్‌లో నడిపించారు.

* ముంబయికి చెందిన అక్సిజెన్‌ హాస్పిటల్‌ కేర్‌ నుంచి 3 యంటీ-ఇన్‌ఫ్లమేటరీ బ్రాండ్‌లను సన్‌ఫార్మా కొనుగోలు చేసింది. లావాదేవీలో డిస్‌పెర్‌జీమ్‌, డిస్‌పెర్‌జీమ్‌-సీడీ, ఫ్లోగమ్‌ వంటి బ్రాండ్‌లు ఉన్నాయి.


నేటి బోర్డు సమావేశాలు

కోల్‌ ఇండియా, ఐఓసీ, పవర్‌గ్రిడ్‌, సన్‌ ఫార్మా, యూపీఎల్‌, ఏసీసీ, రైల్‌టెల్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, పీజీహెచ్‌హెచ్‌, ఎమ్‌ఓఐఎల్‌, ఎన్‌ఐఐటీ, ధనలక్ష్మీ బ్యాంక్‌, కేపీఐటీ టెక్నాలజీస్‌, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌, జేఎస్‌డబ్ల్యూ హోల్డింగ్స్‌, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌, స్టార్‌ హెల్త్‌, సెంచురీ టెక్స్‌టైల్స్‌, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌, సిగ్నిటీ, ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, నెక్ట్స్‌డిజిటల్‌, ఓరియెంట్‌ సిమెంట్‌, ఎస్‌ఎంసీ గ్లోబల్‌ సెక్యూరిటీస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని