జాతీయవాదం పేరిట మీ మోసాన్ని కప్పిపుచ్చలేరు

తాము చేసిన కీలక ఆరోపణలకు నిర్దిష్టంగా బదులివ్వకుండా, జాతీయవాదం లేదా మరేదో వాదనను తెరపైకి తీసుకొచ్చి, ‘చేసిన మోసాన్ని’ కప్పిపుచ్చలేరని అదానీ గ్రూప్‌పై అమెరికా పరిశోధనా సంస్థ, షార్ట్‌ సెల్లర్‌ ‘హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌’ విరుచుకుపడింది.

Updated : 31 Jan 2023 07:51 IST

అదానీ వాదనను తిప్పికొట్టిన హిండెన్‌బర్గ్‌

దిల్లీ: తాము చేసిన కీలక ఆరోపణలకు నిర్దిష్టంగా బదులివ్వకుండా, జాతీయవాదం లేదా మరేదో వాదనను తెరపైకి తీసుకొచ్చి, ‘చేసిన మోసాన్ని’ కప్పిపుచ్చలేరని అదానీ గ్రూప్‌పై అమెరికా పరిశోధనా సంస్థ, షార్ట్‌ సెల్లర్‌ ‘హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌’ విరుచుకుపడింది. భారత్‌తో పాటు దేశీయ సంస్థలు సాధిస్తున్న విజయాలపై అక్కసుతోనే హిండెన్‌బర్గ్‌ తమపై ఆరోపణలు చేసిందని గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ తన 413 పేజీల స్పందనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘పన్నుల విషయంలో సరళంగా ఉండే దేశాల్లో, డొల్ల (షెల్‌) కంపెనీలను ఏర్పాటు చేసి, ఖాతాల్లో మోసాలకు..  రుణాల్లో అవకతవకలకు అదానీ గ్రూప్‌ పాల్పడిందంటూ’ న్యూయార్క్‌కు చెందిన హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు చేసిన సంగతి విదితమే. ఫలితంగా అదానీ గ్రూప్‌ కంపెనీలతో పాటు, ఆ సంస్థకు భారీగా రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థల షేర్ల విలువలూ పతనమవుతున్నాయి.

* హిండెన్‌బర్గ్‌ నివేదికకు స్పందనగా ఆదివారం రాత్రి 413 పేజీల ప్రకటనను అదానీ గ్రూప్‌ విడుదల చేసింది. తాము లేవనెత్తిన 88 ప్రశ్నల్లో 62 అంశాలకు సరైన సమాధానం ఇవ్వడంలో అదానీ గ్రూప్‌ విఫలమైందని హిండెన్‌బర్గ్‌ సోమవారం పేర్కొంది. ‘కేవలం 30 పేజీల్లోనే నివేదికకు సంబంధించిన అంశాలున్నాయి. 330 పేజీల్లో కోర్టు పత్రాలున్నాయి. సాధారణ, సంబంధంలేని అంశాలతో 53 పేజీలను నింపేశారు. అదానీ గ్రూప్‌ ఒక్కసారిగా పొందిన లబ్ధిని, భారత విజయంతో కలగలిపి చెప్పడం సరికాదని హిండెన్‌బర్గ్‌ తెలిపింది.

పథకం ప్రకారం దేశాన్ని కొల్లగొడుతున్నారు

‘భారత్‌, భారత స్వతంత్రత, సమగ్రత, భారతీయ సంస్థలు, వాటి వృద్ధి గాధ, ఆశయాలపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడి ఇద’ని ఆదివారం ఇచ్చిన ప్రకటనలో అదానీ గ్రూప్‌ పేర్కొంది. ‘ప్రపంచ కుబేరుడిగా మారిన గౌతమ్‌ అదానీ గ్రూప్‌ మాపై చేసిన ఆరోపణలన్నిటినీ కొట్టిపారేస్తున్నాం.  మాకు భారత ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంది. భవిష్యత్‌లో ఒక సూపర్‌ పవర్‌గా భారత్‌ మారుతుంది. అయితే అదానీ గ్రూప్‌ మాత్రం ఒక పథకం ప్రకారం.. దేశాన్ని కొల్లగొడుతోంది. అగ్రగామి ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అదానీ చేసినా ‘మోసం.. మోసమే అవుతుంద’’ని హిండెన్‌బర్గ్‌ తేల్చి చెప్పింది. ‘సంబంధిత సెక్యూరిటీలు, విదేశీ మారకపు చట్టాలను మేం ఉల్లంఘించామని అదానీ గ్రూప్‌ అంటోంది. అయితే ఆ చట్టాలేమిటో చెప్పలేదు. ఈ తీవ్ర ఆరోపణననూ మేం ఖండిస్తున్నామ’ని హిండెన్‌బర్గ్‌ పేర్కొంది.

ఎఫ్‌పీఓలో ఐహెచ్‌సీ రూ.3260 కోట్ల పెట్టుబడి  

ఈనెల 27న ప్రారంభమై, మంగళవారం (ఈనెల 31) ముగియనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల మలివిడత పబ్లిక్‌ ఇష్యూ (ఎఫ్‌పీఓ)కు ఇప్పటిదాకా 3% స్పందనే వచ్చింది. అయిత అబుధాబి కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ కంపెనీ (ఐహెచ్‌సీ) తాము 400 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.3260 కోట్ల) మేర ఈ ఎఫ్‌పీఓలో పెట్టుబడి పెడతామని సోమవారం ప్రకటించింది. ఈ సంస్థ గతేడాది అదానీ గ్రీన్‌ ఎనర్జీ, ట్రాన్స్‌మిషన్‌, ఎంటర్‌ప్రైజెస్‌లో 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.16,300 కోట్ల) పెట్టుబడులు పెట్టింది.

ప్రశ్నించే హక్కు మాకుంది: ఎల్‌ఐసీ

అదానీ గ్రూప్‌ రుణాలు, ఈక్విటీల్లో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ)కు రూ.36,474 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇవి తమ మొత్తం పెట్టుబడుల్లో 1 శాతం కంటే తక్కువేనని ఎల్‌ఐసీ సోమవారం వెల్లడించింది. 2022  సెప్టెంబరు నాటికి ఎల్‌ఐసీ నిర్వహణలోని మొత్తం ఆస్తులు రూ.41.66 లక్షల కోట్లుగా ఉన్నాయి. ‘అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ఇప్పటిదాకా మా మొత్తం హోల్డింగ్స్‌ రూ.36,474.78 కోట్లుగానే ఉన్నాయి. 2022 డిసెంబరు 31న ఇవి రూ.35,917.31 కోట్లుగా ఉన్నాయి. చాలా ఏళ్లుగా ఈ పెట్టుబడులు పెడుతూ వచ్చాం. వీటి కొనుగోలు విలువ రూ.30,127 కోట్లుగా ఉండగా.. 2023 జనవరి 27 నాటికి వీటి మార్కెట్‌ విలువ రూ.56,142 కోట్లుగా ఉంద’ని ఎల్‌ఐసీ ట్వీట్‌ చేసింది. అంటే ఇంకా రూ.16,000 కోట్లకు పైగా లాభాల్లోనే ఎల్‌ఐసీ ఉంది. ‘హిండెన్‌బర్గ్‌ నివేదికపై అదానీ స్పందనను విశ్లేషిస్తున్నాం. కంపెనీతో సమావేశమై పూర్తి వివరాలు తెలుసుకుంటాం. భారీ పెట్టుబడులు పెట్టిన సంస్థగా ఈ వ్యహారానికి సంబంధించిన ప్రశ్నలు అడిగే హక్కు మాకుంద’ని ఎల్‌ఐసీ ఎండీ రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు.

పరిణామాలు గమనిస్తున్నాం: పీఎన్‌బీ ఎండీ

తాజా పరిణామాలను దగ్గరి నుంచి గమనిస్తున్నామని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) అంటోంది. అదానీ గ్రూప్‌ సంస్థలకు ఈ బ్యాంకు రూ.7,000 కోట్ల వరకు రుణాలిచ్చింది. అందులో రూ.2,500 కోట్లు విమానాశ్రయాల వ్యాపారానికి సంబంధించినవే. ‘మేం ఇచ్చిన వాటిల్లో రూ.42 కోట్లు మాత్రమే పెట్టుబడులు కాగా.. మిగతా మొత్తం రుణాల రూపంలో ఉన్నాయ’ని పీఎన్‌బీ ఎండీ అతుల్‌ కుమార్‌ గోయెల్‌ వివరించారు.


ఇజ్రాయెల్‌లో అదానీ అడుగు

హైఫా(ఇజ్రాయెల్‌):  1.18 బిలియన్‌ డాలర్లతో పోర్ట్‌ ఆఫ్‌ హైఫాను ప్రైవేటీకరించే కాంట్రాక్టును అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌, ఇజ్రాయెల్‌కు చెందిన గడాట్‌ గ్రూప్‌ దక్కించుకున్నాయి. దీన్ని పురస్కరించుకుని చేపడుతున్న సంబరాలకు ఆ దేశ ప్రధాన మంత్రి బెంజిమిన్‌ నెతన్యాహు హాజరు కానున్నారు.  పోర్ట్‌లో అదానీకి 70% వాటా ఉండగా, స్థానిక భాగస్వామికి 30 శాతం వాటా ఉంది.


అదానీ కంపెనీలకు రూ.5.56 లక్షల కోట్ల నష్టం

సోమవారం అదానీ టోటల్‌ గ్యాస్‌ షేరు 20%, అదానీ గ్రీన్‌ 19.99%, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 19.99%, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 14.91%, అదానీ పవర్‌ 5%, అదానీ విల్మర్‌ 5%, ఎన్‌డీటీవీ  4.99%, అదానీ పోర్ట్స్‌ 0.29% చొప్పున కుదేలయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 4.21%, అంబుజా 1.65%, ఏసీసీ 1.10% పెరిగాయి. ఫలితంగా రూ.1.53 లక్షల కోట్ల మేర అదానీ కంపెనీలకు నష్టం వాటిల్లింది.

* గత 3 ట్రేడింగ్‌ రోజుల్లో అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువలో రూ.5.56 లక్షల కోట్ల మేర ఆవిరైంది.  అదానీ టోటల్‌ గ్యాస్‌ 39.57%, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 37.95%, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 37.93%, అంబుజా సిమెంట్స్‌ 22.28%, అదానీ పోర్ట్స్‌ 21.55%, ఏసీసీ 18.47%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 16.38%, అదానీ విల్మర్‌ 14.25%, అదానీ పవర్‌ 14.24%, ఎన్‌డీటీవీ షేరు 14.22% చొప్పున క్షీణించాయి. అదానీ గ్రూప్‌ సంస్థలతో సంబంధం ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 10.93%, ఎస్‌బీఐ 9.42%, ఎల్‌ఐసీ షేరు  6.52% మేర నష్టపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని