సంక్షిప్త వార్తలు (5)

డిసెంబరు త్రైమాసికంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) రూ.448.01 కోట్ల లాభాన్ని ప్రకటించింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.1,97,168 కోట్ల నుంచి రూ.2,28.168 కోట్లకు పెరిగింది.

Updated : 01 Feb 2023 04:25 IST

ఐఓసీ లాభం రూ.448 కోట్లు

దిల్లీ: డిసెంబరు త్రైమాసికంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) రూ.448.01 కోట్ల లాభాన్ని ప్రకటించింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.1,97,168 కోట్ల నుంచి రూ.2,28.168 కోట్లకు పెరిగింది. వరుసగా రెండు త్రైమాసికాల పాటు నష్టపోయిన కంపెనీ, సమీక్షా త్రైమాసికంలో మళ్లీ లాభాల్లోకి వచ్చింది. 2022-23 ఏప్రిల్‌-సెప్టెంబరులో కంపెనీ నష్టం రూ.2,265 కోట్లుగా ఉంది. 2021-22 డిసెంబరు త్రైమాసికంలో లాభం రూ.5,860.80 కోట్లుగా ఉంది. 2022 ఏప్రిల్‌ నుంచి అంతర్జాతీయ ముడిచమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను సవరించకపోవడంతో ఐఓసీ, ఇతర ప్రభుత్వ చమురు రిటైల్‌ సంస్థలు నష్టాలు చవిచూస్తున్నాయి.


28 రోజులకు రూ.99 రీఛార్జీ: వొడాఫోన్‌ ఐడియా

ఈనాడు, హైదరాబాద్‌: వొడాఫోన్‌ ఐడియా కొత్తగా రూ.99 రీఛార్జి ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. 28 రోజుల కాలావధితో పాటు పూర్తి టాక్‌టైమ్‌, 200 ఎంబీ డేటా లభిస్తాయని వొడాఫోన్‌ ఐడియా ఏపీ, తెలంగాణ, కర్ణాటక క్లస్టర్‌ బిజినెస్‌ హెడ్‌ సిద్ధార్థ చైన్‌ తెలిపారు. ‘వి షాప్స్‌’ ద్వారా గ్రామీణ వినియోగదార్లు నైపుణ్యాలు పెంచుకునేందుకు సహకరిస్తున్నామన్నారు.


‘నకిలీ మార్కెట్ల జాబితా’లో ఇండియామార్ట్‌

వాషింగ్టన్‌: అమెరికా విడుదల చేసిన వార్షిక ‘నొటోరియస్‌ మార్కెట్స్‌ లిస్ట్‌’లో భారత్‌కు చెందిన ఇ-కామర్స్‌ సంస్థ ఇండియామార్ట్‌తో పాటు దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, ముంబయిలలోని కొన్ని సంప్రదాయ మార్కెట్లు కూడా ఉన్నాయి. మంగళవారం విడుదలైన ఈ జాబితాలో 39 ఆన్‌లైన్‌, 33 సంప్రదాయ మార్కెట్లు కనిపించాయి. నకిలీ లేదా కాపీరైట్‌/ పైరసీ ఉత్పత్తులు అధికంగా ఉండే మార్కెట్లను గుర్తించి, ఏటా జాబితా రూపంలోఅమెరికా విడుదల చేస్తుంటుంది. ఇందులో ఇండియామార్ట్‌తో పాటు ముంబయిలోని హీరాపన్నా, కోల్‌కతాలోని కిడర్‌పోర్‌: బెంగళూరులోని సదర్‌ పత్రప్ప రోడ్‌ మార్కెట్‌, దిల్లీలోని ట్యాంక్‌ రోడ్‌ మార్కెట్‌  ఉన్నాయి. ప్రైవేటు రంగం, వాణిజ్య భాగస్వాములు కలిసి ఈ మార్కెట్లలో ప్రమాదకర చర్యలను నిలువరించాలని అగ్రరాజ్యం పిలుపునిచ్చింది.


‘ క్రిప్టోల’పై నియంత్రణ అవసరం

ఇటీవల అమెరికాలో క్రిప్టో ఎక్స్ఛేంజీ అయిన ఎఫ్‌టీఎక్స్‌ కుప్పకూలడంతో.. క్రిప్టో వ్యవస్థలో ఉన్న బలహీనతలు ఒక్కసారిగా ప్రపంచం కళ్లముందు కనిపించాయి. ‘క్రిప్టో ఆస్తులనేవి ఆర్థిక ఆస్తులు కావని స్పష్టమైంది. ఇప్పటికే బిట్‌కాయిన్‌, ఈథర్‌ వంటి పలు క్రిప్టో ఆస్తులు.. సెక్యూరిటీలుగా ఉండడానికి అర్హత లేదని అమెరికా నియంత్రణ సంస్థలు స్పష్టం చేశాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థకు అవి హాని కలిగిస్తాయని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌, ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌, ఆఫీస్‌ ఆఫ్‌ కంప్ట్రోలర్‌ ఆఫ్‌ కరెన్సీలు అరుదైన సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. క్రిప్టో ఆస్తుల నియంత్రణకు అంతర్జాతీయ స్థాయిలో సమన్వయంతో కూడిన ప్రక్రియ దిశగా ఓఈసీడీ, జి-20 దేశాలు చర్చిస్తున్నాయ’ని సర్వే పేర్కొంది.

* ప్రస్తుతమున్న అంతర్జాతీయ ప్రమాణాలు క్రిప్టో ఆస్తుల ద్వారా వచ్చే నష్టభయాలను, బలహీనతలను ఏ మాత్రం తగ్గించలేవు. ఒక విస్తృత స్థాయి, బహుళ దేశీయ నియంత్రణ సంస్థలు కలిసి వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది.


డిసెంబరులో కీలక రంగాల వృద్ధి 7.4%

3 నెలల గరిష్టానికి

దిల్లీ: డిసెంబరులో 8 కీలక రంగాల వృద్ధి 3 నెలల గరిష్ఠమైన 7.4 శాతానికి చేరింది. 2021 డిసెంబరులో ఇది 4.1 శాతమే. బొగ్గు, ఎరువులు, ఉక్కు, విద్యుత్‌ రంగాల్లో మంచి వృద్ధి నమోదు కావడంతోనే ఈసారి కీలక రంగాలు రాణించాయి. ముడి చమురు ఉత్పత్తి 1.2% తగ్గింది. 2022 నవంబరులో 8 రంగాల కీలక వృద్ధి 5.7 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. 2022 డిసెంబరులో బొగ్గు ఉత్పత్తి 11.5 శాతం, ఎరువుల ఉత్పత్తి 7.3 శాతం, ఉక్కు 9.2 శాతం, విద్యుత్‌ 10 శాతం చొప్పున పెరిగాయి.

* ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్‌-డిసెంబరు మధ్య కీలక రంగాలైన బొగ్గు, ముడిచమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్‌, విద్యుత్‌ రంగాల వృద్ధి 8 శాతంగా నమోదైంది. 2021-22 ఇదే సమయంలో ఈ వృద్ధి 12.6 శాతంగా ఉంది.

* పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ 8 కీలక రంగాల వాటా 40.27 శాతం ఉండటంతో ఐఐపీ గణాంకాలను ఇవి ప్రభావితం చేస్తాయి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు