భారత్‌.. కాస్త నెమ్మదిస్తుంది

భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో కాస్త నెమ్మదిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) అంచనా వేస్తోంది.

Published : 01 Feb 2023 04:18 IST

వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.1% వృద్ధే
ద్రవ్యోల్బణం 5 శాతానికి: ఐఎంఎఫ్‌

వాషింగ్టన్‌: భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో కాస్త నెమ్మదిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతం వృద్ధి నమోదవుతుందని, వచ్చే ఏడాది ఇది 6.1 శాతానికి పరిమితం కాగలదని మంగళవారం విడుదల చేసిన ‘వరల్డ్‌ ఎకనమిక్‌ అవుటులుక్‌’లో ఐఎంఎఫ్‌ పేర్కొంది. దేశీయేతర అంశాలే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ద్రవ్యోల్బణం 6.9 శాతానికి దిగివస్తుందని.. తర్వాతి సంవత్సరంలో 5 శాతానికి; ఆ తర్వాతి ఏడాది 4 శాతానికి పరిమితం కాగలదని అంచనా వేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చర్యలు ఇందుకు ఉపకరిస్తాయని పేర్కొంది.

* 2022లో ప్రపంచ వృద్ధి 3.4 శాతంగా నమోదవగలదని.. 2023లో 2.9 శాతానికి పరిమితమై.. 2024లో మళ్లీ 3.1 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ప్రపంచంలో 84 శాతం దేశాలు 2022తో పోలిస్తే 2023లో తక్కువ వినియోగదారు ద్రవ్యోల్బణాన్ని నమోదు చేయగలవని అంచనా వేసింది. గతేడాది 8.8 శాతంగా ఉన్న అంతర్జాతీయ ద్రవ్యోల్బణం ఈ ఏడాది 6.6 శాతానికి, వచ్చే ఏడాది 4.3 శాతానికి దిగివస్తుందని తెలిపింది.

పౌర విమానయానం కోలుకుంటోంది

కొవిడ్‌ పరిణామాల అనంతరం దేశ పౌర విమానయాన రంగం కోలుకుంది. మధ్య తరగతి ప్రజల నుంచి విమాన ప్రయాణాలకు గిరాకీ పెరగడం, ప్రజల వద్ద మిగులు ఆదాయం ఉండటం ఈ రంగానికి కలిసొచ్చాయి. చిన్న పట్టణాలకూ విమాన సర్వీసులు నడిపేందుకు ప్రారంభించిన ఉడాన్‌ పథకమూ ఊతమిచ్చింది. ఈ పథకం కింద మొత్తం పర్యాటక మార్గాల సంఖ్యను 59కి చేర్చారు. ప్రస్తుతం 51 పని చేస్తున్నాయి. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో కొవిడ్‌ ప్రభావంతో విమాన ప్రయాణికుల సంఖ్య వరుసగా 54 శాతం, 66 శాతం క్షీణించినా, ప్రస్తుతం రికవరీ బాటలో ఉంది. 2022 డిసెంబరులో మొత్తం 1.5 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. కొవిడ్‌కు ముందు సమయమైన 2019 ఏప్రిల్‌ నుంచి 2020 ఫిబ్రవరి నెలల సగటు ప్రయాణాలతో పోల్చినా ఇది 106.4 శాతానికి చేరింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని