70% పెరిగిన కోల్‌ ఇండియా లాభం

ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ ఇండియా డిసెంబరు త్రైమాసికంలో రూ.7,755.50 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.

Published : 01 Feb 2023 04:18 IST

రెండో మధ్యంతర డివిడెండ్‌ రూ.5.25

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ ఇండియా డిసెంబరు త్రైమాసికంలో రూ.7,755.50 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.4,558.30 కోట్లతో పోలిస్తే ఇది 70 శాతం అధికం. ఏకీకృత విక్రయాలు రూ.25,990.97 కోట్ల నుంచి 25 శాతం పెరిగి రూ.32,429.46 కోట్లకు చేరాయి. సమీక్షా త్రైమాసికంలో 14.65 మిలియన్‌ టన్నుల బొగ్గును ఇ-వేలం అమ్మకంలో నోటిఫై చేసిన ధర కంటే అధిక మొత్తానికి విక్రయించడంతో లాభం పెరిగిందని కంపెనీ వెల్లడించింది. వేలం పరిమాణం 2021-22 డిసెంబరు త్రైమాసికంలో 26 మి.టన్నులు కాగా, 2022-23 ఇదే సమయంలో 44 శాతం తగ్గింది. ఇ-గవాక్షం (విండో) కింద అధిక ప్రీమియం రావడంతో రూ.2,341 కోట్ల విక్రయాలు అధికంగా జరిగాయి. ఒక్కో టన్ను బొగ్గుకు వేలంలో రూ.5,046 లభించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో టన్ను బొగ్గుకు రూ.1,947 మాత్రమే వచ్చింది. అంటే 159 శాతం (రూ.3,099) అదనంగా లభించింది. ఇప్పటి వరకు సంస్థ ప్రకటించిన డిసెంబరు త్రైమాసిక ఫలితాల్లో అత్యధిక నికర లాభం ఇప్పుడే రావడం విశేషం. ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్‌ఎస్‌ఏ) కింద విక్రయ పరిమాణం 13.2 మి.టన్నులు పెరిగి 144.6 మి.టన్నులకు చేరింది. ఈ విభాగం కింద సరఫరా చేసిన ఒక్కో టన్ను బొగ్గుకు రూ.1,482 లభించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో లభించిన రూ.1,370తో పోలిస్తే ఇది 8.2 శాతం అధికం. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.5.25 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ చెల్లించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు