774 టన్నుల పసిడికి గిరాకీ

దేశీయంగా గత ఏడాదిలో 774 టన్నుల బంగారానికి గిరాకీ లభించిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వార్షిక నివేదిక తెలిపింది.

Updated : 01 Feb 2023 05:06 IST

2022పై  ప్రపంచ స్వర్ణ మండలి

ముంబయి: దేశీయంగా గత ఏడాదిలో 774 టన్నుల బంగారానికి గిరాకీ లభించిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) వార్షిక నివేదిక తెలిపింది. 2021లో లభించిన గిరాకీ 797.3 టన్నులతో పోలిస్తే, ఇది 2.92% తక్కువని పేర్కొంది. ధరలు ఒక్కసారిగా పెరగడానికి తోడు, దిగుమతిపై సుంకం పెంచినా కూడా, పుత్తడికి గిరాకీ పెద్దగా తగ్గకపోవడం గమనార్హమని ప్ర.స్వ.మం. భారత ఎండీ పి.ఆర్‌.సోమసుందరం తెలిపారు. అక్టోబరు-డిసెంబరులో పండగలు, వివాహాది శుభకార్యాల వల్ల ఆభరణాల కొనుగోళ్లు అధికంగా జరిగినా, మొత్తంమీద గిరాకీ 276.1 టన్నులకు పరిమితమైంది. 2021 ఇదే కాలం నాటి గిరాకీ 343.9 టన్నులతో పోలిస్తే, ఇది 22% తక్కువ. విలువ రూపేణ చూస్తే రూ.1,48,780 కోట్ల నుంచి 15% తగ్గి, రూ.1,25,910 కోట్లకు పరిమితమైంది. ఇదే సమయంలో పెట్టుబడులకు గిరాకీ 79 టన్నుల నుంచి 56 టన్నులకు తగ్గింది. ధరలు పెరగడం వల్ల పాత బంగారాన్ని మార్చుకుని, కొత్త ఆభరణాలు తీసుకోవడం పెరిగిందన్నారు.

దశాబ్ద గరిష్ఠానికి ప్రపంచ గిరాకీ..  4741 టన్నులు

ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2022లో 4741 టన్నుల బంగారానికి గిరాకీ లభించింది. 2021 నాటి 4012.8 టన్నులతో పోలిస్తే ఇది 18% అధికం. అంతేకాదు 2011 తరవాత ఇదే అత్యధికమని ప్ర.స్వ.మం. తెలిపింది. వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు 1136 టన్నుల మేర కొనుగోలు చేయడమే ఇందుకు కారణమని విశ్లేషించింది. 2021లో కేంద్రీయ బ్యాంకుల కొనుగోళ్లు 450 టన్నులు మాత్రమే. కేంద్రీయ బ్యాంకుల కొనుగోళ్లలో ఇది 55 ఏళ్ల గరిష్ఠస్థాయి.

* అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొనడం, వడ్డీరేట్లు అధికమైన నేపథ్యంలో, సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించడం వల్లే పసిడికి గిరాకీ పెరిగింది.

* గనుల నుంచి బంగారం సరఫరా 4 ఏళ్ల గరిష్ఠమైన 3612 టన్నులకు చేరంది.

* వార్షిక సరఫరా కూడా 2 శాతం పెరిగి 4755 టన్నులుగా నమోదైంది. కొవిడ్‌ ముందు కంటే ఇది అధికం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని