సంక్షిప్త వార్తలు

దేశంలో ప్రాంతీయ విమాన అనుసంధానతను మెరుగుపరిచేందుకు 50 అదనపు విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, వాటర్‌ ఏరోడ్రోమ్‌లు, అధునాతన ల్యాండింగ్‌ గ్రౌండ్‌లకు పునరుజ్జీవం కల్పించనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.

Updated : 02 Feb 2023 06:44 IST

50 విమానాశ్రయాల పునరుద్ధరణ

దేశంలో ప్రాంతీయ విమాన అనుసంధానతను మెరుగుపరిచేందుకు 50 అదనపు విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, వాటర్‌ ఏరోడ్రోమ్‌లు, అధునాతన ల్యాండింగ్‌ గ్రౌండ్‌లకు పునరుజ్జీవం కల్పించనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. 2014 వరకు దేశంలో 74 విమానాశ్రయాలు ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 147కు చేరింది.


4% పెరిగిన విమాన ఇంధన ధర

దిల్లీ: విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధర 4% పెరిగింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా, ఏటీఎఫ్‌ ధరలు పెంచినా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను మాత్రం వరుసగా 10వ నెలలోనూ మార్చలేదు. దిల్లీలో కిలోలీటరు ఏటీఎఫ్‌ ధర రూ.4,218 పెరిగి (3.9%) రూ.1,12,356.77కు చేరింది.  నవంబరు 1న 4.19%, డిసెంబరు 1న 2.3% మేర, జనవరి 1న రూ.1,17,587.64 నుంచి రూ.1,08,138.77కు ఏటీఎఫ్‌ ధర తగ్గించారు. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో సుమారు 40 శాతం ఇంధనానిదే కావడంతో, పెరిగిన ఏటీఎఫ్‌ ధరల ప్రభావం వాటికి భారం కానుంది.  


అంకుర సంస్థలకు మరో ఏడాది పన్ను ప్రోత్సాహకాలు

2024 మార్చి వరకు ఏర్పాటయ్యే అంకుర సంస్థలకూ ఆదాయపు పన్ను ప్రోత్సహకాలు వర్తిస్తాయని బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు గడువును 2023 మార్చి 31 నుంచి 2024 మార్చి 31కి పొడిగిస్తున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. నష్టాలను క్యారీ ఫార్వర్డ్‌ చేసుకునే ప్రయోజనాన్ని కూడా అంకుర సంస్థలకు 10 ఏళ్లకు పెంచింది. ఇంతకుముందు ఇది ఏడేళ్లుగా ఉండేది. వ్యవస్థాపిత రోజు నుంచి పదేళ్ల కాలంలో వరుసగా మూడేళ్ల పాటు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలని గతంలో ప్రతిపాదించారు. 2016 ఏప్రిల్‌ 1న లేదా ఆ తర్వాత వ్యవస్థాపితమైన అంకురాలు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.


కంపెనీల చట్టం కింద  సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ కేంద్రం

కంపెనీల చట్టం కింద క్షేత్ర కార్యాలయాల్లో అందే దరఖాస్తులను నిర్వహించేందుకు ప్రభుత్వం సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం వల్ల కార్పొరేట్ల అభ్యర్థనలపై  త్వరితగతిన స్పందించేందుకు వీలుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు క్లెయిమ్‌ చేసుకోని షేర్లు, డివిడెండ్‌లను సులభంగా పొందేందుకు సమీకృత పెట్టుబడిదారు విద్య, భద్రతా నిధి (ఐఈపీఎఫ్‌) ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో పేర్కొన్నారు. కంపెనీల చట్టం 2013ను అమలు చేసే కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కిందకే ఐఈపీఎఫ్‌ అథారిటీ రానుంది. త్వరలోనే సమీకృత ఐటీ పోర్టల్‌ను తీసుకురానున్నారు. సులభతర వ్యాపారానికి వీలుగా 39,000కు పైగా నిబంధనలను సడలించామని, 3,400కు పైగా న్యాయ చట్టాలను నేరరహితం చేశామని సీతారామన్‌ తెలిపారు.


నైపుణ్యాల వృద్ధి ఎంతో కీలకం

మానవ వనరుల నైపుణ్యాలను పెంచుకోవటానికి సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజారోగ్యానికి తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చేదిగా బడ్జెట్‌ ఉంది. ‘ఆత్మనిర్భర్‌ క్లీన్‌ ప్లాంట్‌ ప్రోగ్రామ్‌’, తృణ ధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యలు హర్షణీయం.

డాక్టర్‌ ప్రతాప్‌ సి.రెడ్డి, అపోలో హాస్పిటల్స్‌ వ్యవస్థాపకులు


స్థిర వృద్ధికి వీలు

దీర్ఘకాలంలో స్ధిర వృద్ధికి వీలుకల్పించే బడ్జెట్‌ ఇది. అంకురాల కోసం ఏర్పాటు చేసిన అగ్రి యాక్సెలరేటర్‌ ఫండ్‌ వల్ల వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆసక్తికర మార్పులు వస్తాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి పెద్దపీట వేశారు.

డాక్టర్‌ కృష్ణ ఎల్ల, భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌


నేటి బోర్డు సమావేశాలు: హెచ్‌డీఎఫ్‌సీ, టైటన్‌, డాబర్‌, టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌, అపోలో టైర్స్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, బెర్జర్‌ పెయింట్స్‌, సెరా, సువెన్‌ లైఫ్‌సైన్సెస్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్‌, డీబీ కార్ప్‌, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌, జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌, కర్ణాటక బ్యాంక్‌, లాల్‌పాథ్‌ ల్యాబ్స్‌, మ్యాక్స్‌ ఇండియా, థామస్‌కుక్‌, టైమెక్స్‌, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, వీగార్డ్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌, జైడస్‌ వెల్‌నెస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు