దిగుమతయ్యే కార్లు.. మరింత ప్రియం

పూర్తిగా దిగుమతయ్యే కార్లు (విద్యుత్‌ వాహనాలు సహా) మరింత ప్రియం కానున్నాయి. పూర్తిగా నిర్మితమై (సీబీయూ), దిగుమతి అయ్యే వాహనాలపై కస్టమ్స్‌ సుంకం పెంపు ఇలా..

Published : 02 Feb 2023 03:28 IST

దిల్లీ: పూర్తిగా దిగుమతయ్యే కార్లు (విద్యుత్‌ వాహనాలు సహా) మరింత ప్రియం కానున్నాయి. పూర్తిగా నిర్మితమై (సీబీయూ), దిగుమతి అయ్యే వాహనాలపై కస్టమ్స్‌ సుంకం పెంపు ఇలా..

* 40,000 డాలర్ల కంటే తక్కువ ధర లేదా ఇంజిన్‌ సామర్థ్యం 3,000 సీసీ కంటే తక్కువ ఉన్న పెట్రోలు వాహనాలపై; 2,500 సీసీ కంటే తక్కువ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న డీజిల్‌ వాహనాలపై కస్టమ్స్‌ సుంకాన్ని ప్రస్తుత 60% నుంచి 70 శాతానికి చేర్చారు. వీటి ధరలు 2% వరకు పెరగొచ్చు.
* ధర, బీమా, రవాణా(సీఐఎఫ్‌) విలువ 40,000 డాలర్ల కంటే ఎక్కువ ఉన్న; విద్యుత్తు వాహనాలపై కస్టమ్స్‌ సుంకాన్ని 60% నుంచి 70 శాతానికి చేర్చారు. పాక్షికంగా తయారై(ఎస్‌కేడీ) దిగుమతయ్యే విద్యుత్‌ వాహనాలతో పాటు అన్ని వాహనాలపై కస్టమ్స్‌ సుంకాన్ని 30% నుంచి 35 శాతానికి పెంచారు.
* ఇప్పటికే 40,000 డాలర్లకు పైన సీఐఎఫ్‌ ఉండి, సీబీయూలుగా దిగుమతి చేసుకునే కార్లు లేదా 3,000 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న పెట్రోలు కార్లపై లేదా 2,500 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న డీజిల్‌ కార్లపై 100 శాతం కస్టమ్స్‌ సుంకం ఉంది.

కొన్ని మోడళ్లపైనే ప్రభావం: ‘మా మోడళ్లలో చాలా వరకు స్థానికంగానే తయారు చేస్తున్నాం. కాబట్టి 95% పోర్ట్‌ఫోలియోపై ప్రభావం ఉండద’ని మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈఓ సంతోశ్‌ అయ్యర్‌ అంటున్నారు. ఎస్‌-క్లాస్‌ మేబాక్‌, జీఎల్‌బీ, ఈక్యూబీ వంటి మోడళ్ల ధరలు పెరగొచ్చని అన్నారు. బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్‌ ఇండియా, లెక్సస్‌ ఇండియా కూడా కొన్ని మోడళ్ల ధరలే పెరుగుతాయని స్పష్టం చేశాయి. 

ఈవీ ధరలు తగ్గుతాయా?

దేశంలో హరిత వాహనాలను పెంచేందుకు.. బ్యాటరీలకు ఉపయోగించే లిథియం అయాన్‌ సెల్స్‌ తయారీలో ఉపయోగించే యంత్రపరికరాలు, సామగ్రి దిగుమతిపై కస్టమ్స్‌ సుంకం మినహాయింపును కొనసాగించనున్నారు. దీంతో భవిష్యత్‌లో విద్యుత్‌ వాహనాల ధరలు కొంత మేర తగ్గే వీలుంది. పాత కాలుష్య వాహనాలను విద్యుత్‌ వాహనాలతో భర్తీ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు