టీవీల ధరలు తగ్గుతాయ్‌

దేశీయంగా తయారవుతున్న (అసెంబ్లింగ్‌ చేస్తున్న) ఎల్‌ఈడీ టీవీల ధరలు తగ్గనున్నాయి.

Published : 02 Feb 2023 03:31 IST

ఈనాడు వాణిజ్య విభాగం: దేశీయంగా తయారవుతున్న (అసెంబ్లింగ్‌ చేస్తున్న) ఎల్‌ఈడీ టీవీల ధరలు తగ్గనున్నాయి. వీటి తెరల తయారీలో వినియోగించే ఓపెన్‌సెల్‌పై దిగుమతి సుంకాన్ని 5% నుంచి 2.5 శాతానికి  తగ్గించడమే ఇందుకు కారణం. ఎల్‌ఈడీ టీవీల తయారీ వ్యయంలో 60-70% వాటా ఓపెన్‌సెల్‌ ప్యానల్‌దే ఉంటుంది. వీటిపై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకం సగానికి తగ్గినందున, ఆమేర టీవీల ధరలు తగ్గుతాయి. ఇందువల్ల పెద్ద తెరల టీవీల ధరల్లో తేడా ఎక్కువగా వచ్చినా, చిన్న టీవీలకు వచ్చేసరికి పెద్దగా మార్పు ఉండదని పరిశ్రమ వర్గాలు ‘ఈనాడు’కు తెలిపాయి. ఇందుకు కారణం ఏమిటంటే..

40 అంగుళాల టీవీలు రూ.15,000కు లభిస్తున్నాయి. ఇందులో తెర ధర రూ.9,000-10,500 అవుతుంది. దీని సుంకంలో తేడా సర్‌ఛార్జీతో కలిపి 2.75% అంటే రూ.247-289 మాత్రమే అవుతుంది. అదే రూ.60,000 పైన ఉండే 70 అంగుళాల టీవీని తీసుకుంటే, తెర వ్యయమే రూ.36,000-42,000 అవుతుంది. దీనిపై 2.75% తేడా అంటే రూ.990-1155 తగ్గుతుంది. ఈ మేర వినియోగదార్లతో పాటు, దేశీయ తయారీ సంస్థలకూ ఇది ఉపకరిస్తుంది.

సెల్‌ఫోన్ల ధరల్లో మార్పులుండవ్‌: సెల్‌ఫోన్ల తయారీ (అసెంబ్లింగ్‌) కోసం దిగుమతి చేసుకునే కెమెరా లెన్స్‌పై దిగుమతి సుంకాన్ని 5.5% నుంచి 2.75% శాతానికి తగ్గించినా, ఫోన్‌ ధరల్లో మార్పులు వచ్చే పరిస్థితి లేదని పరిశ్రమ సంఘం ఐసియా పేర్కొంది. మొత్తం ఫోన్‌ ధరలో ఈ విడిభాగం వాటా 0.16-0.19% మాత్రమే ఉంటుందని స్థానిక పరిశ్రమ వర్గాలూ తెలిపాయి. అంటే రూ.10,000 ఫోన్‌లో దీని ధర రూ.160-190 మాత్రమే. ఈ మొత్తంపై 2.75% తగ్గినా, వినియోగదారులకు బదిలీ చేసేది ఉండదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు