ఔషధ పరిశోధనలకు తోడ్పాటు

‘పరిశోధనలకు సహకరించాలన్న’ ఔషధ పరిశ్రమ దీర్ఘకాల డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

Published : 02 Feb 2023 03:32 IST

ఐసీఎంఆర్‌ కేంద్రాల్లో కార్యక్రమాలు చేపట్టే వీలు

ఈనాడు, హైదరాబాద్‌: ‘పరిశోధనలకు సహకరించాలన్న’ ఔషధ పరిశ్రమ దీర్ఘకాల డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ‘కొవిడ్‌’ సమయంలో మనదేశం అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి ఎన్నో దేశాలకు టీకాలు, మందులు సరఫరా చేసింది. ఫార్మా పరిశ్రమ భారీగా ఉండటం, కాస్తోకూస్తో పరిశోధనా కార్యకలాపాలు చేపట్టడం వల్లే ఇది సాధ్యమైంది. ఔషధ రంగంలో పరిశోధనలను ఇంకా విస్తరించేందుకు తాజా బడ్జెట్లో కొన్ని సానుకూలతలను కల్పించారు.  దేశవ్యాప్తంగా ఉన్న ‘సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ ల ద్వారా పరిశోధనా కార్యకలాపాలను పెంపొందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఎంపిక చేసిన ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) కేంద్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పరిశోధనా కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిస్తామన్నారు. భారతదేశం ఫార్మా పరిశోధనలకు ఒక ప్రత్యేక విధానాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని ఇటీవల యూఎస్‌ఏ- ఇండియా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌  సూచించింది కూడా. ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌) పరిశోధన, తయారీపై దృష్టి సారించేందుకు వీలుగా కంపెనీలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలని కోరింది.

గెలవాలంటే తప్పదు: ఔషధ పరిశోధనను ప్రోత్సహించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఫార్మాగ్జిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఉదయ భాస్కర్‌ స్వాగతించారు. ఈ విషయంలో ఫార్మాగ్జిల్‌ ఎంతో కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తోందనిగుర్తుచేశారు. ప్రపంచ వ్యాప్తంగా మనదేశం క్రియాశీలక పాత్ర పోషించాలంటే, బయో- ఫార్మాస్యూటికల్స్‌, సంక్లిష్ట జనరిక్‌ ఔషధాల విభాగాల్లో పరిశోధనలు అధికంగా నిర్వహించాలని వివరించారు. ఈ విభాగాల్లో కొత్త ఔషధాలను ప్రపంచ మార్కెట్‌కు అందించే అవకాశం ఉందన్నారు. దేశీయ ఫార్మా కంపెనీలు పరిశోధనలకు బడ్జెట్లు పెంచుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ మద్దతు కూడా లభిస్తే ఆసక్తికర ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.

కొత్త మందులు ఆవిష్కరిస్తేనే: మనదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 24- 25 బిలియన్‌ డాలర్ల ఔషధ ఎగుమతులు నమోదు చేయొచ్చని అంచనా. దీన్ని ఇంకా పెంచుకోవాలంటే కొత్త మందులను ఆవిష్కరించాలి. ఔషధాలకు దేశీయ విపణి కూడా 42 బిలియన్‌ డాలర్ల  స్థాయిలో ఉంది. దేశీయ మందుల మార్కెట్‌ విలువ 2030కి 130 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని తాజాగా ఆర్థిక సర్వే పేర్కొంది. పరిశోధనాలకు ప్రోత్సాహకాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాల్సి ఉంది.


ఆశించిన విధంగా ఉంది

ఫార్మా పరిశోధనలపై పెట్టుబడులను ప్రోత్సహించాలనే నిర్ణయం పరిశ్రమకు ఎంతో మేలు చేస్తుంది. సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లలో పరిశోధనా కార్యకలాపాల నిర్వహణకు అనుమతించడం, ఐసీఎంఆర్‌ ల్యాబ్స్‌తో కలిసి పనిచేసే అవకాశం వంటివి దేశీయ ఔషధ పరిశ్రమకు మేలు చేస్తాయి. విద్య, వైద్యం, నైపుణ్యాల పెంపు, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్‌ టెక్నాలజీలకు బడ్జెట్‌ పెద్దపీట వేసింది.

సతీశ్‌రెడ్డి, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఛైర్మన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు