Adani Group: అదానీది అంతటా రాకెట్ వేగమే
గౌతమ్ అదానీ భారత్, ఆసియాల్లోనే అపర కుబేరుడు. ప్రపంచ శ్రీమంతుల్లో మూడో స్థానంలో ఉన్న వ్యక్తి.
సంపద సృష్టి-క్షీణతలో
సమిధలవుతున్న సామాన్య మదుపర్లు
సరిగ్గా వారం క్రితం.. గౌతమ్ అదానీ (Gautham Adani) భారత్, ఆసియాల్లోనే అపర కుబేరుడు. ప్రపంచ శ్రీమంతుల్లో మూడో స్థానంలో ఉన్న వ్యక్తి. దేశీయంగా ముకేశ్ అంబానీ.. అంతర్జాతీయంగా బిల్‌గేట్స్, జెఫ్ బెజోస్ లాంటి దిగ్గజాలు ఆయన వెనకే..
‘అదానీ కంపెనీల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచుతున్నారని, సంస్థ పద్దుల్లోనూ అవకతవకలున్నాయని’ ఆరోపిస్తూ అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ జనవరి 26 వెల్లడించిన నివేదిక అదానీ సంపద విలువను అనూహ్యంగా తగ్గించింది.
ఎంతలా అంటే.. అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల మేర మాయం కాగా, అదానీ వ్యక్తిగత సంపదా 120 బి.డా. నుంచి 64 బి.డా.కు క్షీణించింది. అంటే మరో 56 బి.డా. మేర సామాన్య మదుపర్లు, సంస్థాగత పెట్టుబడిదార్లు పోగొట్టుకున్నట్లే. ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో అదానీ స్థానం 17కు చేరిందని ఫోర్బ్స్ తెలిపింది.
ఎంత వేగంగా ఎదిగారో.. అంతకంటే శరవేగంగా అదానీ సంపద క్షీణించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవ్వడమే కాదు.. భారత మార్కెట్ల తీరుపైనా ప్రతికూల ప్రభావం చూపొచ్చని భావిస్తున్నారు.
ఏడాదికాలంలో దేశీయ కార్పొరేట్ రంగంలో గౌతమ్ అదానీదే హవా. ఆయన కోరుకున్న విధంగా నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, సిమెంటు, విద్యుత్తు రంగంలోని దిగ్గజ సంస్థలెన్నో అదానీ గ్రూప్‌లోకి వచ్చి చేరాయి. మీడియా సంస్థ ఎన్‌డీటీవీ కూడా చేరాల్సి వచ్చింది. గ్రూప్ కంపెనీల షేర్ల విలువలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లాయి. దీంతో ఆయన సంపద అమాంతం పెరుగుతూపోయి, 120 బిలియన్ డాలర్లకు చేరి, స్వల్పకాలం పాటు ప్రపంచంలో రెండో అతిపెద్ద శ్రీమంతుడిగా అవతరించినా, మూడోస్థానంలో కొద్దిగా ఎక్కువ కాలం ఉన్నారు. ఈ క్రమంలో ఆయన గ్రూపు కంపెనీల షేర్ల వల్ల మదుపర్లూ బాగానే లాభపడ్డారు.
ఇప్పుడు చూస్తే.. వారం వ్యవధిలో అదానీ కంపెనీల షేర్ల విలువలు సగానికిపైగా ఆవిరయ్యాయి. ఈ షేర్ల ధర బాగా తక్కువగా ఉన్నప్పుడు వాటిని కొన్న మదుపర్లపై నష్ట ప్రభావం తక్కువగానే ఉండొచ్చు. కానీ.. ధరలు బాగా పెరిగాక కొన్న వారికి మాత్రం నష్టకన్నీరే మిగులుతోంది. మళ్లీ షేర్లు కోలుకుంటాయా అనే భయంతో, బహుశా వాళ్లకు నిద్ర కూడా పట్టకపోవచ్చేమో.
ఆ ధీమా ఏమైంది..?: హిండెన్‌బర్గ్ నివేదికలోని 88 ప్రశ్నలకు, అదానీ గ్రూపు సరైన రీతిలో వివరణ ఇవ్వలేకపోయిందనే అభిప్రాయం వినిపిస్తోంది. 10 నమోదిత కంపెనీల వల్ల, ఎంతో మంది మదుపర్ల పెట్టుబడులు రూ.లక్షల కోట్ల ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్నాయి. అడిగిన వివరాలివ్వకుండా, ‘దేశ వృద్ధిని భరించలేని శక్తుల కుట్ర’గా బదులివ్వడంతో, ‘అమెరికా కోర్టులో మాపై దావా వేయండి. అప్పుడు అదానీ గ్రూప్ కంపనీల పత్రాలు అడుతుతాం’ అంటూ హిండెన్‌బర్గ్ ఇంకా గట్టిగా పేర్కొనడం మదుపర్లను సందేహంలో పడేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా, రూ.20 వేల కోట్ల అదానీ ఎంటర్‌ప్రైజెస్ మలివిడత పబ్లిక్ ఆఫర్ విషయంలో వెనుకడుగు వేయబోమని ధీమాగా చెప్పడంతో పాటు ‘రహస్య మిత్రుల’ అండతో గట్టెక్కించాక, రద్దు చేసుకోవడంతో.. మదుపర్లలో భయాలు మరింత పెరిగాయి. నియంత్రణ సంస్థలు ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయనే ఆసక్తి వ్యక్తమవుతోంది.
రంగంలోకి నియంత్రణ సంస్థలు..: ఈ వ్యవహారాన్ని సెబీతో పాటు ఆర్‌బీఐ కూడా ఆరా తీస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్, అంబుజా సిమెంట్ షేర్లను ఏఎస్‌ఎం ఫ్రేమ్‌వర్క్‌లోకి తెచ్చినట్లు ఎన్‌ఎస్‌ఈ తెలిపింది. దీని ప్రకారం.. ఈ షేర్లలో ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలంటే ట్రేడర్లకు ముందస్తుగా 100 శాతం మార్జిన్ అవసరం. ఇందువల్ల కొంత మేర షార్ట్ సెల్లింగ్‌కు అడ్డుకట్ట పడుతుంది.
నైతికంగా సరికాదనే.. ఎఫ్‌పీఓ రద్దు - గౌతమ్ అదానీ
మార్కెట్లో తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్న క్రమంలో, ఎఫ్‌పీఓ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం నైతికంగా సరికాదని బోర్డు భావించి, రద్దుకు నిర్ణయం తీసుకుందని అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. ‘ఒక వ్యాపారవేత్తగా 4 దశాబ్దాల నా ప్రయాణంలో వాటాదార్ల నుంచి అమిత ఆదరణ దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. మదుపర్ల ప్రయోజనాలే నాకు అత్యంత ముఖ్యం. ఆ తర్వాతే ఏదైనా. మదుపర్లను నష్టాల ప్రభావం నుంచి బయటపడేసేందుకే ఎఫ్‌పీఓను ఉపసంహరించుకున్నాం’ అని అదానీ వివరించారు. మార్కెట్లు కుదురుకున్నాక, అప్పుడు కేపిటల్ మార్కెట్ వ్యూహాలపై సమీక్ష జరుపుతామని తెలిపారు. ఎఫ్‌పీఓ ఉపసంహరణ నిర్ణయం.. గ్రూపు కంపెనీల ప్రస్తుత కార్యకలాపాలపై, భవిష్యత్ ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపబోదని తెలిపారు. అనుకున్న సమయానికే ప్రాజెక్టులను అందించడంపై దృష్టి కొనసాగస్తామని తెలిపారు. ‘మా గ్రూపు కంపెనీల మూలాలు బలంగా ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్‌లు, ఆస్తుల విలువలు పటిష్ఠమే. రుణాల చెల్లింపుల విషయంలో మాకు మంచి చరిత్ర ఉంది. మదుపర్లకు దీర్ఘకాలిక విలువను సృష్టించే దిశగా మా ప్రయత్నం కొనసాగుతుంది. అంతర్గతంగా సమీకరించిన నిధుల ద్వారా వృద్ధి ప్రణాళికలు అమలు జరుపుతామ’ని అదానీ వివరించారు.
* రుణాలు సమీకరించేందుకు అంబుజా సిమెంట్స్, ఏసీసీ షేర్లను ప్రమోటర్లు తనఖా పెట్టారంటూ వస్తున్న వార్తలపై ఆ సంస్థలు స్పందిస్తూ... అలాంటిదేమీ లేదని, ఒక్క షేరు కూడా తనఖా పెట్టలేదని స్పష్టం చేశాయి. మార్కెట్‌ను తప్పుదారి పట్టించేందుకు ఇలాంటివి ప్రచారం చేస్తున్నాయని స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
* అదానీ పవర్‌తో 2017లో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో బంగ్లాదేశ్ సవరణలు అడిగినట్లు బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ అధికారి ఒకరు వెల్లడించారు. విద్యుత్ ధర చాలా ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా తెలిపారు. బొగ్గుకు అదానీ పవర్ అధిక ధర వెచ్చించాల్సి రావడం వల్లే ఈ ధర ఎక్కువగా ఉందని మీడియా కథనాలు చెబుతున్నాయి.
* అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఎఫ్‌పీఓతో సంబంధమున్న బ్రిటన్ పెట్టుబడుల సంస్థలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా పనిచేస్తున్న లార్డ్ జో జాన్సన్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈయన బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు సోదరుడు.
అదానీకిచ్చిన రుణాల వివరాలివ్వండి
బ్యాంకులను కోరిన ఆర్‌బీఐ
ముంబయి: అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాల వివరాలను వెల్లడించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కోరినట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు భారీ నష్టాలకు లోనుకావడంతో, రూ.20,000 కోట్ల మలి విడత ఆఫర్(ఎఫ్‌పీఓ)ను సంస్థ ఉపసంహరించుకుంది. మార్జిన్‌పై రుణాలు ఇవ్వడానికి, అదానీ సంస్థల బాండ్లను హామీగా అంగీకరించడాన్ని నిలిపివేసినట్లు స్విస్‌కు చెందిన క్రెడిట్ సూయిజీ, అమెరికాకు చెందిన సిటీగ్రూప్ పేర్కొన్న నేపథ్యంలో, ఈ పరిణామం చోటుచేసుకుంది.
సమాచారం ఎలా.. ఎందుకు?: బ్యాంకులు పెద్ద కార్పొరేట్లకిచ్చే రుణాల వివరాలను ఆర్‌బీఐ క్రమం తప్పకుండా తెలుసుకునే వీలుంటుంది. సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్(సీఆర్‌ఐఎల్‌సీ) డేటా బేస్ ఇందుకు ఉపకరిస్తుంది. సాధారణంగా కార్పొరేట్లకు రుణాలిచ్చే సమయంలో, బ్యాంకులు ఆయా సంస్థల షేర్లను తనఖా పెట్టుకుంటాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన 10 నమోదిత కంపెనీల షేర్ల ధరలు భారీగా పతనమైనందున, ఆ తనఖా షేర్ల విలువా క్షీణించి ఉంటుంది. ఇది బ్యాంకు ఖాతాలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. (అదానీ గ్రూప్‌నకు రుణాలిచ్చిన బ్యాంకు షేర్లపై విక్రయాల ఒత్తిడి కనిపించడానికి ఇదే కారణం.)
బ్యాంకులేమంటున్నాయ్..
అదానీ గ్రూప్‌నకిచ్చిన రుణాలన్నీ.. నగదు వచ్చే ఆస్తుల ద్వారా పూర్తిగా హామీతో ఉన్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ బ్యాంకు 2.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.21,300 కోట్ల) రుణాలిచ్చినట్లు కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. అందులో 200 మిలియన్ డాలర్లను విదేశీ అనుబంధ సంస్థల ద్వారా ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ బ్యాంకు అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాలేవీ ‘తక్షణం సవాలు’గా మారే సమస్యే లేదని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖరా పేర్కొన్నారు.
* బ్యాంక్ ఆఫ్ బరోడా తామిచ్చిన రూ.7,000 కోట్ల అప్పులకు పూర్తి భద్రత ఉందని తెలిపింది.
* అదానీ గ్రూప్‌లో తమ పెట్టుబడులు, రుణాలు రూ.36,474.78 కోట్లుగా ఉన్నాయని.. తమ మొత్తం పెట్టుబడుల్లో ఇవి 1 శాతం కంటే తక్కువేనని ఎల్‌ఐసీ పేర్కొంది.
* పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.7,000 కోట్లు ఇచ్చింది. ఇందులో మూడొంతులు.. అదానీ విమానాశ్రయ వ్యాపారానికి ఇచ్చినట్లు గత నెలలో తెలిపింది.
* మొత్తం రుణాల్లో అదానీ గ్రూప్‌నకిచ్చినవి 0.1 శాతం కంటే తక్కువేనని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్; 0.5% మాత్రమే ఇచ్చామని ఇండస్‌ఇండ్ బ్యాంక్ వెల్లడించాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Lokesh: రూ.లక్ష కోట్లున్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతారు?: లోకేశ్
-
India News
Lancet Report: తీవ్ర గుండెపోటు కేసుల్లో.. మరణాలకు ప్రధాన కారణం అదే!
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..
-
Politics News
BJP: ప్రతి నియోజకవర్గంలో 1000 మంది ప్రముఖులతో.. భాజపా ‘లోక్‌సభ’ ప్లాన్
-
India News
Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసు.. నాలుగో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ
-
Movies News
Randeep Hooda: వీర్ సావర్కర్ పాత్ర కోసం నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గిన హీరో!