ఎక్కువ మందికి కొత్త పన్ను విధానమే మేలు

2023-24 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కొత్త, సవరించిన ఆదాయ పన్ను విధానం వల్ల రిటర్నుల ఫైలింగ్‌ మరింత సరళమైందని.. ఎక్కువ మంది పన్ను చెలింపుదార్లకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని సీబీడీటీ ఛైర్మన్‌ నితిన్‌ గుప్తా పేర్కొన్నారు.

Updated : 03 Feb 2023 04:07 IST

సీబీడీటీ ఛైర్మన్‌ నితిన్‌ గుప్తా

దిల్లీ: 2023-24 బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కొత్త, సవరించిన ఆదాయ పన్ను విధానం వల్ల రిటర్నుల ఫైలింగ్‌ మరింత సరళమైందని.. ఎక్కువ మంది పన్ను చెలింపుదార్లకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని సీబీడీటీ ఛైర్మన్‌ నితిన్‌ గుప్తా పేర్కొన్నారు. కొత్త పన్ను విధానంలో కొత్త శ్లాబులు, రేట్లను ప్రకటించడం ద్వారా ‘మినహాయింపులు, తగ్గింపుల’ వంటి సంక్లిష్ట పద్ధతుల నుంచి దూరంగా వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ‘కొత్త విధానాన్ని 2020-21లోనే తీసుకొచ్చినా, ఎక్కువ మందికి ప్రయోజనాలు చేరలేదు. అందుకే శ్లాబులను, రేట్లను సవరించాం. ఇప్పుడు కొత్త విధానం ద్వారా ప్రయోజనం పొందని వారు చాలా తక్కువ మందే ఉండొచ్చు. గృహ రుణ వడ్డీ మినహాయింపులు, సెక్షన్‌ 6ఏ కింద మినహాయింపులు పొందే వారే పాత విధానం నుంచి ప్రయోజనం పొందుతార’ని వివరించారు. కొత్త విధానం ‘డిఫాల్ట్‌’గా ఉన్నా.. తమకిష్టమొచ్చిన విధానంలో రిటర్నులు ఫైల్‌ చేసి, ప్రయోజనాలను పొందచ్చని స్పష్టం చేశారు.

మినహాయింపుల్లేని ఐటీ విధానం వైపు: సరళమైన, మినహాయింపులు లేని, తక్కువ రేట్లు ఉన్న  పన్ను విధానం వైపునకు క్రమంగా కదలాలని ప్రభుత్వం భావిస్తోందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా తెలిపారు. రెవెన్యూ విభాగ విశ్లేషణ ప్రకారం.. ఏటా రూ.15 లక్షలు సంపాదించే వ్యక్తి.. పాత విధానంలో కనీసం రూ.3.75 లక్షల వరకు మినహాయింపులు క్లెయిము చేసుకుంటేనే ప్రయోజనాలుంటాయి. లేదంటే కొత్త, సవరించిన విధానమే మేలు చేస్తుందన్నారు. కొత్త పన్ను విధానాన్ని తప్పనిసరి చేయడానికి ఎటువంటి గడువును ప్రభుత్వం నిర్దేశించుకోలేదని మల్హోత్రా స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు