సంక్షిప్త వార్తలు (9)

సత్యం రామలింగరాజును సెక్యూరిటీస్‌ మార్కెట్‌ నుంచి 14 ఏళ్ల పాటు నిషేధిస్తూ సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా) ఇచ్చిన ఉత్తర్వులను శాట్‌ (సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌) నిలుపుదల చేసింది.

Published : 03 Feb 2023 04:13 IST

సత్యం రామలింగరాజుపై సెబీ నిషేధ ఉత్తర్వులను పక్కకు పెట్టిన శాట్‌

మళ్లీ పరిశీలించాలని సూచన  

దిల్లీ: సత్యం రామలింగరాజును సెక్యూరిటీస్‌ మార్కెట్‌ నుంచి 14 ఏళ్ల పాటు నిషేధిస్తూ సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా) ఇచ్చిన ఉత్తర్వులను శాట్‌ (సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌) నిలుపుదల చేసింది. ఈ వివాదాన్ని మళ్లీ పరిశీలించి, కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలని సూచించింది. సత్యం రామలింగరాజు, బి.రామరాజుతో పాటు మొత్తం ఆరుగురిపై సెబీ 2018లో రెండు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై వీరంతా శాట్‌ను ఆశ్రయించారు. దీనిపై తాజాగా శాట్‌ నిర్ణయం వెలువడింది. సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ ఆదాయాలు, లాభాలను కృత్రిమంగా ఎక్కువ చేసి చూపించి లబ్ధిపొందడంతో పాటు, ఆ క్రమంలో వాటాదార్లను మోసం చేశారనే ఆరోపణలపై రామలింగరాజు, ఇతరులపై సెబీ చర్యలు తీసుకుంది. ఈ వ్యవహారం 2009 జనవరిలో వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీస్‌ మార్కెట్‌ నుంచి నిషేధించడంతో పాటు, సత్యం కంప్యూటర్‌ షేర్ల క్రయవిక్రయాల నుంచి రామలింగరాజు, ఇతరులు లాభపడిన సొమ్మును వెనక్కి ఇవ్వాలని, దానిపై జరిమానా చెల్లించాలని సెబీ ఆదేశించింది. రామలింగరాజు, ఇతరులను 14 ఏళ్ల పాటు సెక్యూరిటీస్‌ మార్కెట్‌ నుంచి ఎందుకు నిషేధించాల్సి వచ్చిందో సెబీ సహేతుకంగా వివరించలేకపోయినట్లు శాట్‌   పేర్కొంది. అందువల్ల వచ్చే నాలుగు నెలల వ్యవధిలో మళ్లీ కొత్త ఉత్వర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. షేర్ల లావాదేవీల్లో పొందిన లబ్ధిని కూడా తిరిగి లెక్కించాలని ఆదేశించింది.


10% తగ్గిన టైటన్‌ లాభం

దిల్లీ: టాటా గ్రూప్‌ సంస్థ టైటన్‌ కంపెనీ డిసెంబరు త్రైమాసికంలో రూ.913 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.2021-22 ఇదేకాల లాభం రూ.1,012 కోట్లతో పోలిస్తే ఇది 9.78 శాతం తక్కువ. ఏకీకృత మొత్తం ఆదాయం రూ.10,094 కోట్ల నుంచి రూ.11,698 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.8,750 కోట్ల నుంచి రూ.10,454 కోట్లకు చేరాయి. ఆభరణాల విభాగాదాయం 11 శాతం పెరిగి రూ.9,518 కోట్లకు చేరింది. వాచీలు, వేరబుల్స్‌ విభాగాదాయం 15 శాతం వృద్ధితో రూ.811 కోట్లకు, నేత్ర సంరక్షణ విభాగాదాయం 12 శాతం పెరిగి రూ.174 కోట్లకు చేరినట్లు సంస్థ తెలిపింది. ‘సమీక్షా త్రైమాసికంలో పండుగలు ఉండటంతో వినియోగదారు గిరాకీ బలంగా పెరిగింద’ని టైటన్‌ కంపెనీ ఎండీ సీకే వెంకట్రామన్‌ వెల్లడించారు.


న్యూక్లియర్‌ టర్బైన్లకు ఆజాద్‌ ఇంజినీరింగ్‌ విడిభాగాలు  

ఈనాడు, హైదరాబాద్‌: ఫ్రాన్స్‌లో తయారవుతున్న న్యూక్లియర్‌ టర్బైన్లకు కీలక విడిభాగాలు సరఫరా చేసినట్లు హైదరాబాద్‌కు చెందిన ఆజాద్‌ ఇంజినీరింగ్‌ తెలిపింది. జీఈ స్టీమ్‌ పవర్‌ తో ఉన్న దీర్ఘకాలిక ఒప్పందం వల్లే, ప్రపంచ వ్యాప్తంగా న్యూక్లియర్‌ విభాగంలో పెద్ద వ్యాపార అవకాశాన్ని దక్కించుకున్నట్లు వెల్లడించారు. ప్రపంచ మార్కెట్‌కు న్యూక్లియర్‌ విడిభాగాలు సరఫరా చేసిన తొలి భారతీయ కంపెనీ తమదేనని ఆజాద్‌ ఇంజినీరింగ్‌ ఎండీ రాకేష్‌ ఛోప్దార్‌ అన్నారు. అయిదేళ్ల పాటు తమ ప్రగతి ప్రస్తానం కొనసాగుతుందన్నారు.


కార్ల అమ్మకాలు మరింత పెరుగుతాయ్‌

బడ్జెట్‌ ఉపకరిస్తుంది: ఎంఎస్‌ఐ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ శశాంక్‌ శ్రీవాత్సవ

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో ప్రయాణికుల వాహన విక్రయాలు సుమారు 40.5-41.5 లక్షల నమోదు కావొచ్చని వాహన పరిశ్రమ అంచనా వేస్తోందని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి (మార్కెటింగ్‌, విక్రయాలు) శశాంక్‌ శ్రీవాత్సవ వెల్లడించారు. ‘మొత్తం ఆర్థిక వ్యవస్థ గమనంపై వాహన పరిశ్రమ వృద్ధి ఆధారపడుతుంది. వాహన కొనుగోళ్లకు గిరాకీ పెరిగేలా కేంద్ర బడ్జెట్‌ 2023-24ను రూపొందించారు. పన్ను రేట్లలో గొప్పగా మార్పులు లేకపోయినా.. ద్రవ్యోల్బణం, ముడి చమురు, కమొడిటీ ధరలు స్థిరంగా ఉంచేందుకు, మౌలిక సదుపాయాల మెరుగుకు తీసుకుంటున్న చర్యల వల్ల వాహనాలకు గిరాకీ పెరుగుతుంద’ ని శశాంక్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 38.5 లక్షల వాహనాలు విక్రయమవ్వొచ్చని అంచనా వేస్తున్నామని శశాంక్‌ వెల్లడించారు.


గిఫ్ట్‌ సిటీలో కేఫిన్‌ టెక్నాలజీస్‌ కార్యకలాపాలు

ఈనాడు, హైదరాబాద్‌: రిజిస్ట్రార్‌, ట్రాన్సఫర్‌ ఏజెంట్‌ సేవల సంస్థ అయిన కేఫిన్‌ టెక్నాలజీస్‌ గుజరాత్‌లోని గిఫ్ట్‌ సిటీలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. అక్కడి తమ కార్యాలయంలో 600 మంది ఉద్యోగులను నియమించనున్నట్లు కేఫిన్‌ టెక్నాలజీస్‌ వెల్లడించింది. సంపద నిర్వహణ (ఆల్టర్నేటివ్‌ అస్సెట్స్‌, ప్రైవేట్‌ వెల్త్‌, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌) సేవలను ఆ కేంద్రం నుంచి అందించనున్నట్లు కేఫిన్‌ టెక్నాలజీస్‌ ఎండీ శ్రీకాంత్‌ నాదెళ్ల వెల్లడించారు.


‘ఎక్స్‌ట్రోవిస్‌’లో మెగాసాఫ్ట్‌కు 40% వాటా

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన మెగాసాఫ్ట్‌ లిమిటెడ్‌, ఎక్స్‌ట్రోవిస్‌ ఏజీ అనే స్విస్‌ కంపెనీలో 40% వాటా కొనుగోలు చేసింది. దీనికి వంతుల వారీగా మొత్తం 16.78 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.137 కోట్లు) చెల్లించింది. చివరి విడతగా గత నెలలో 1 మిలియన్‌ డాలర్లు చెల్లించడంతో మొత్తం కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీకి మెగాసాఫ్ట్‌ వెల్లడించింది. మందులు, రసాయనాల ఉత్పత్తి, పంపిణీ, పరిశోధనా కార్యకలాపాల్లో నిమగ్నమైన సంస్థే ఎక్సోట్రోవిస్‌ ఏజీ. ఈ సంస్థ 2020-21లో 3.94 మిలియన్‌ డాలర్ల టర్నోవర్‌ నమోదు చేసింది. ఫార్మాస్యూటికల్‌ రంగంలోకి విస్తరించేందుకే ఈ కంపెనీలో వాటా కొనుగోలు చేసినట్లు మెగాసాఫ్ట్‌ తెలియజేసింది.  


డాబర్‌ లాభాలపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు

దిల్లీ: ఎఫ్‌ఎంసీజీ సంస్థ డాబర్‌ ఇండియా డిసెంబరు త్రైమాసికంలో రూ.476.55 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.504.35 కోట్లతో పోలిస్తే ఇది 5.51% తక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.2,941.75 కోట్ల నుంచి 3.44 శాతం పెరిగి రూ.3,043.17 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.2,388.53 కోట్ల నుంచి రూ.2,523.09 కోట్లకు చేరాయి. ‘ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు గ్రామీణ విపణిపై ప్రభావం చూపడంతో అందుబాటు, తక్కువ ధరల్లో లభించే చిన్న ప్యాక్‌ల వైపు వినియోగదార్లు మళ్లారు. ఇది లాభదాయకతపై ప్రభావం చూపింద’ని కంపెనీ సీఈఓ మోహిత్‌ మల్హోత్రా వెల్లడించారు.


42% పెరిగిన కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లాభం

ఈనాడు, హైదరాబాద్‌: ఎరువులు, సస్య రక్షణ ఉత్పత్తుల సంస్థ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ డిసెంబరు త్రైమాసికానికి స్టాండలోన్‌ ఖాతాల ప్రకారంరూ.8,350 కోట్ల ఆదాయాన్ని, రూ.539 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదే కాల ఆదాయం రూ.5,101 కోట్లు, నికరలాభం రూ.379 కోట్లు మాత్రమే. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 64%, నికరలాభం 42% పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు ఆదాయం రూ.24,265 కోట్లు, నికరలాభం రూ.1,773 కోట్లుగా ఉన్నాయి.

ఏకీకృత ఖాతాల ప్రకారం సమీక్షా త్రైమాసికానికి రూ.8,349 కోట్ల ఆదాయాన్ని, రూ.527 కోట్ల నికరలాభాన్ని సంస్థ నమోదు చేసింది. ఒక్కో షేరుకు రూ.6 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ చెల్లించనున్నారు.

సమీక్షా త్రైమాసికంలో అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు ప్రదర్శించామని కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ఛైర్మన్‌ అరుణ్‌ అలగప్పన్‌ అన్నారు. నాలుగో త్రైమాసికంలో కొన్ని క్రిమిసంహారక మందులు దేశీయంగా విడుదల చేయనున్నామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు