బ్యాంకింగ్‌ షేర్లు దుమ్మురేపాయ్‌

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో శుక్రవారం మన సూచీలు దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది.

Updated : 04 Feb 2023 03:43 IST

సమీక్ష

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో శుక్రవారం మన సూచీలు దూసుకెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 12 పైసలు పెరిగి 82.08 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.44 శాతం లాభంతో 82.52 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ ఉదయం 60,350.01 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. కొనుగోళ్ల జోరుతో రోజంతా అదే ధోరణి కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 60,905.34 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 909.64 పాయింట్ల లాభంతో 60,841.88 వద్ద ముగిసింది. నిఫ్టీ 243.65 పాయింట్లు పెరిగి 17,854.05 దగ్గర స్థిరపడింది. .

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 27 పరుగులు తీశాయి. టైటన్‌ 6.87%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 5.15%, బజాజ్‌ ఫైనాన్స్‌ 5.13%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3.46%, హెచ్‌డీఎఫ్‌సీ 3.15%, ఎస్‌బీఐ 3.12% చొప్పున లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ నష్టపోయాయి.

* పుంజుకున్న 4 అదానీ షేర్లు: గత 6 రోజులుగా కుదేలైన అదానీ గ్రూప్‌ షేర్లలో నాలుగు పుంజుకున్నాయి. ఇంట్రాడేలో 35% క్షీణించిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు రూ.1017.10 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 1.25% లాభంతో రూ.1584.20 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్‌ షేరు రూ.394.95 వద్ద కనిష్ఠానికి చేరి, చివరకు 7.98% పెరిగి రూ.498.85 దగ్గర స్థిరపడింది. అంబుజా సిమెంట్స్‌ 6.03%, ఏసీసీ 4.39% చొప్పున రాణించాయి. అయితే అదానీ ట్రాన్స్‌మిషన్‌ 10%, అదానీ గ్రీన్‌ 10%, అదానీ పవర్‌ 5%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 5%, అదానీ విల్మర్‌ 4.99%, ఎన్‌డీటీవీ 4.98% చొప్పున నష్టాలు నమోదుచేశాయి. గత 6 రోజుల్లో 10 అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.8.76 లక్షల కోట్లు ఆవిరైంది.

* పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు: దేశ విదేశీ మారకపు (ఫారెక్స్‌) నిల్వలు జనవరి 27తో ముగిసిన వారానికి 3.03 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) పెరిగి 576.76 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.47,10,000 కోట్ల)కు చేరాయని ఆర్‌బీఐ పేర్కొంది. విదేశీ కరెన్సీ ఆస్తులు 2.66 బి. డాలర్లు పెరిగి 509.018 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

* హరిత బాండ్లకు బలమైన నియమావళి: హరిత బాండ్ల కోసం సెబీ బలమైన నియమావళిని ప్రవేశపెట్టింది. స్థిరమైన రుణాల కోసం ‘బ్లూ’, ‘ఎల్లో’ బాండ్ల పద్ధతులను తీసుకొచ్చింది. బ్లూ బాండ్‌లను నీటి నిర్వహణ, సముద్ర రంగాలకు, యెల్లో బాండ్‌లను సౌరవిద్యుత్‌కు కేటాయించింది..

* హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రతిపాదిత విలీనానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ ముంబయి బెంచ్‌ ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది. అదే తుది విచారణ అవుతుంది.            

*  వొడాఫోన్‌ ఐడియా రూ.16,133 కోట్ల వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్చేందుకు ప్రభుత్వం అనుమతించింది. రూ.10 ముఖవిలువ కలిగిన ఈక్విటీ షేర్లను, అదే ధర వద్ద ప్రభుత్వానికి కంపెనీ జారీ చేయనుంది. బకాయిలను ఈక్విటీగా మార్చడం ద్వారా కంపెనీలో ప్రభుత్వానికి దాదాపు 35 శాతం వాటా లభించనుంది.

* జనవరిలో దేశ సేవల రంగం వృద్ధి నెమ్మదించింది. భవిష్యత్తుపై సర్వీస్‌ ప్రొవైడర్ల విశ్వాసం స్తబ్దుగా ఉండటం, ఉద్యోగాల సృష్టిపై ఇది ప్రభావం చూపడం ఇందుకు నేపథ్యం. ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ ఇండియా సేవల పీఎంఐ సూచీ జనవరిలో 57.2 పాయింట్లుగా నమోదైంది. డిసెంబరులో ఇది 58.5గా ఉంది.  


నేటి బోర్డు సమావేశాలు: బిర్లా కార్పొరేషన్‌, దాల్మియా భారత్‌, ఎంసీఎక్స్‌, రిలాక్సో ఫుట్‌వేర్‌, ఆంధ్రా పెట్రోకెమికల్స్‌, అపెక్స్‌ ఫ్రోజెన్‌ ఫుడ్స్‌, పాల్‌రెడ్‌ టెక్నాలజీస్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని