ఐటీకి మాంద్యం, మార్పులు మామూలే

ఐటీ రంగానికి మాంద్యం, మందగమనం మామూలేని, గత నాలుగు దశాబ్దాల్లో ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎన్నోసార్లు చూసినట్లు హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌) అధ్యక్షురాలు మనీషా సాబు అన్నారు.

Published : 04 Feb 2023 01:56 IST

కష్టకాలం నుంచి త్వరగా కోలుకుంటాం
ఉద్యోగాల తొలగింపు తాత్కాలిక పరిణామమే
హైసియా అధ్యక్షురాలు మనీషా సాబు

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ రంగానికి మాంద్యం, మందగమనం మామూలేని, గత నాలుగు దశాబ్దాల్లో ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎన్నోసార్లు చూసినట్లు హైసియా (హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌) అధ్యక్షురాలు మనీషా సాబు అన్నారు. మాంద్య పరిస్థితుల నుంచి కోలుకోడానికి ఇతర రంగాలకు రెండు- మూడేళ్లు పడితే, ఐటీ రంగం అంతకంటే ఎంతో ముందుగా గాడిన పడుతున్నట్లు వివరించారు. ‘ఉద్యోగాలు పోతున్నాయని, భవిష్యత్తు కష్టకాలమేనని అనుకోవద్దని, త్వరలో మంచి రోజులు వస్తాయ’ని అన్నారు. ఉద్యోగాల తొలగింపు తాత్కాలిక పరిణామమేనని తెలిపారు. నియామకాలు తగ్గాయని ఆందోళన చెందొద్దని, ఆన్‌లైన్లో చిన్న, మధ్యస్థాయి ప్రాజెక్టులు ఎన్నో లభిస్తున్నాయని ఆమె వివరించారు. అందువల్ల ఖాళీగా ఉండకుండా ఈ ప్రాజెక్టులు చేస్తూ, తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటే, త్వరలో మంచి ఉద్యోగాల్లో చేరేందుకు తమను తాము సన్నద్ధం చేసుకున్నట్లు అవుతుందన్నారు. ఇప్పటికే ‘ఆఫర్‌ లెటర్లు’ జారీ చేసిన ఐటీ కంపెనీలు, ఉద్యోగార్థులను పిలవడం లేదని కంగారు పడాల్సిన పనిలేదని, ప్రాజెక్టులు లభించగానే ఆయా కంపెనీలు తాము ఎంపిక చేసుకున్న వారికి అవకాశాలిస్తాయని చెప్పారు. ఇది ఎప్పుడూ జరిగే ప్రక్రియేనని వివరించారు.  

8న హైసియా వార్షిక సదస్సు

‘కొవిడ్‌’ పరిణామాల ఫలితంగా ప్రపంచంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులు చోటుచేసుకున్నందున, ఐటీ సేవలు, ఉత్పత్తులు పెను మార్పులకు లోనవుతున్నట్లు పేర్కొన్నారు. ఐటీ రంగంలో కొత్త మార్గాలు - నమూనాల అవసరం పెరుగుతోందన్నారు. ప్రపంచాన్ని నడిపిస్తున్న ఐటీ పరిశ్రమ మూలాలు సహా పునర్నిర్మితమవుతోందని తెలిపారు. మానవ మేధస్సు, నైతికత, నిబద్ధతల విలువలతో సాఫ్ట్‌వేర్‌ సేవల రంగం రూపాంతరం చెందాల్సి ఉందన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ‘రీ-ఇమాజిన్‌, రీ-థింక్‌, రీబిల్డ్‌ ద ఫ్యూచర్‌’ అనే ప్రధానాంశంతో హైసియా 30 వార్షిక సమావేశాన్ని ఈ నెల 8న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా భాగస్వామ్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ జనరల్‌ అర్వింద్‌ కుమార్‌, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ ఎండీ దేవశిష్‌ ఛటర్జీ, సైయెంట్‌ వ్యవస్థాపకులు బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి, డాక్టర్‌ రెడ్డీస్‌ సహ-ఛైర్మన్‌ జీవీ ప్రసాద్‌ తదితర ప్రముఖులు పాల్గొంటారు.

ఆర్‌.చంద్రశేఖర్‌కు జీవిత కాల సౌఫల్య అవార్డు

ఈ సదస్సులో హైసియా వార్షిక అవార్డులను బహుకరిస్తారు. దీంతో పాటు ప్రాథమిక దశలో ఉండి, మంచి ఫలితాలు సాధిస్తున్న 10 అంకుర సంస్థలకు అవార్డులు అందజేస్తారు. ఇందుకోసం 100కు పైగా నామినేషన్లు రాగా, 40 సంస్థలు ఫైనల్‌కు చేరాయని హైసియా ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ నాదెళ్ల తెలిపారు. ఈ సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ఈ సదస్సులో ప్రదర్శిస్తాయి. ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదార్లు, ఏంజెల్‌ ఇన్వెస్టర్లు, ప్రభుత్వ ప్రతినిధులను కలుసుకునే అవకాశం అంకుర సంస్థల నిర్వాహకులకు లభిస్తుంది. అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు 3 నెలల కాలపరిమితి గల ‘స్టార్టప్‌ ఎనేబుల్‌మెంట్‌ ప్రోగ్రామ్‌’నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఈ సారి ‘జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని’ విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, సెంటర్‌ ఫర్‌ ద డిజిటల్‌ ఫ్యూచర్‌ ఛైర్మన్‌ ఆర్‌.చంద్రశేఖర్‌కు అందించాలని హైసియా నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు, ఐటీ ఉద్యోగాలు గణనీయంగా పెరిగినట్లు ఎస్‌టీపీఐ- హైదరాబాద్‌ డైరెక్టర్‌ సీవీడీ రామ్‌ ప్రసాద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని