మన మార్కెట్లకు ఢోకా లేదు

అదానీ గ్రూప్‌ షేర్ల భారీ పతనం స్టాక్‌ మార్కెట్లో సృష్టించిన ఆందోళన అంతా ఇంతా కాదు. విదేశీ మదుపర్లూ అమ్మకాలకు దిగిన నేపథ్యంలో, ఆర్థిక మంత్రి, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల నుంచి ఈ అంశంపై స్పందన వెలువడింది.

Updated : 04 Feb 2023 09:37 IST

ఒక్క ఉదంతంతో అంతా మారిపోదు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
ఇది టీ కప్పులో తుపానే: ఆర్థిక కార్యదర్శి
బ్యాంకింగ్‌ రంగం భద్రమే: ఆర్‌బీఐ

దానీ గ్రూప్‌ షేర్ల భారీ పతనం స్టాక్‌ మార్కెట్లో సృష్టించిన ఆందోళన అంతా ఇంతా కాదు. విదేశీ మదుపర్లూ అమ్మకాలకు దిగిన నేపథ్యంలో, ఆర్థిక మంత్రి, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల నుంచి ఈ అంశంపై స్పందన వెలువడింది. మన స్టాక్‌ మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ రంగం చాలా బలంగా, స్థిరంగా ఉన్నాయనే భరోసా కల్పించారు. మదుపర్లు, డిపాజిటర్లు, పాలసీదార్లు ఆందోళన చెందక్కర్లేదని స్పష్టం చేశారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌: భారత్‌ ఎప్పటికీ అత్యంత నియంత్రణలో ఉన్న ఆర్థిక మార్కెట్‌గానే కొనసాగుతుందని అంతర్జాతీయ పెట్టుబడుదార్లు గుర్తించాలి. ‘ఒక్క ఉదంతం’ వల్ల దేశీయ మార్కెట్లపై ఏ మాత్రం ప్రభావం ఉండబోదు. మా మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థలు  కొన్ని పాలనా పద్ధతుల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుంటాయి. అందువల్ల ఆర్థిక మార్కెట్ల పాలనపై సందేహాలొద్దు. కొన్ని దశాబ్దాల్లో చాలా పాఠాలు నేర్చుకున్నాం. కాబట్టి దేశీయ ఆర్థిక మార్కెట్లను బలంగా ఉంచడంలో మా నియంత్రణ సంస్థలు నిక్కచ్చిగా పనిచేస్తాయి.

ఆర్థిక కార్యదర్శి టి.వి. సోమనాథన్‌: స్థూల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చూస్తే అదానీ గ్రూప్‌ షేర్ల  వల్ల మార్కెట్‌పై పడుతున్న ప్రభావాన్ని ‘టీ కప్పులో తుపాను’గానే చూడాలి. మన ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉంది. స్టాక్‌ మార్కెట్లో ఊగిసలాటలపై ప్రభుత్వం ఆందోళన చెందడం లేదు. వాటిపై తగిన చర్యలు తీసుకోవడానికి స్వతంత్ర నియంత్రణ సంస్థలు ఉన్నాయి. అదానీ గ్రూప్‌నకు బ్యాంకులు, బీమా సంస్థలు రుణాలివ్వడంతో పాటు పెట్టుబడి పెట్టినందున డిపాజిటర్లు, పాలసీదార్లు.. ఆయా సంస్థ షేర్లను కలిగి ఉన్న వారు భయపడాల్సిన అవసరం లేదు. మనకున్న ఆర్థిక స్థిరత్వం అటువంటిది. ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్‌ మార్కెట్లలో ఊగిసలాటలు సాధారణమే.


రుణాలపై పరిశీలన జరుపుతున్నాం: ఆర్‌బీఐ

దేశ బ్యాంకింగ్‌ రంగం బలంగా, స్థిరంగా ఉంది. బ్యాంకింగ్‌ రంగం ‘ఒక వ్యాపార దిగ్గజాని’కిచ్చిన రుణాలపై పరిశీలన జరుపుతున్నాం. ‘రూ.5 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకులు రుణాలిస్తే, ఆ వివరాలన్నీ సెంట్రల్‌ రిపాజిటరీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆన్‌ లార్జ్‌ క్రెడిట్స్‌ (సీఆర్‌ఐఎల్‌సీ) డేటాబేస్‌లో ఉంటాయి. వీటిపై పరిశీలన జరుపుతుంటాం. అధికమొత్తం రుణాలకు మేము జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే బ్యాంకులు వ్యవహరిస్తుంటాయి.


అదానీ నిధుల సమీకరణ సామర్థ్యంపై ప్రభావం: మూడీస్‌  

అదానీ గ్రూప్‌ షేర్ల విలువల క్షీణత వల్ల, ఆ గ్రూప్‌ నిధుల సమీకరణ సామర్థ్యం దెబ్బతినొచ్చని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ హెచ్చరించింది. వారంలోనే గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ 100 బిలియన్‌ డాలర్లకు పైగా పతనమైన నేపథ్యంలో మూడీస్‌ స్పందించింది. ‘అదానీ కంపెనీల ఆర్థిక స్థిరత్వ పరిస్థితులను మదింపు చేస్తున్నాం. ద్రవ్య లభ్యత, విస్తరణ కార్యక్రమాలు, వాటికి నిధుల మద్దతు వంటివి పరిశీలిస్తున్నామని పేర్కొంది. అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌లకు మేమిచ్చే రేటింగ్‌లు ఆయా కంపెనీల పరిస్థితిని బట్టి ఉంటాయి. 1-2 ఏళ్లలో మూలధన వ్యయాలకు సరిపడా నిధులను సమీకరించే సామర్థ్యాన్ని తాజా పరిణామాలు దెబ్బతీయొచ్చని హెచ్చరించింది. అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌ కంపెనీల బాండ్లు 2024 జూన్‌, డిసెంబరులలో గడువు తీరనుండగా.. మిగతా కంపెనీలకు 2026, అంతకు మించి గడువుండడం ఊరటనిచ్చే అంశం. తక్షణం రేటింగ్స్‌పై ప్రభావం ఉండదని ఫిచ్‌ పేర్కొంది.

* అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను ఫిబ్రవరి 7 నుంచి తమ సస్టెయినబిలిటీ సూచీల నుంచి తొలగిస్తున్నట్లు ఎస్‌ అండ్‌ పీ డోజోన్స్‌ ప్రకటించింది. అదానీ గ్రూప్‌ కంపెనీలైన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, అంబుజా సిమెంట్స్‌లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు స్వల్పకాలిక అదనపు నిఘా చర్యల కింద పెట్టినందున ఎస్‌ అండ్‌ పీ జోన్స్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

* అదానీ పోర్ట్స్‌, అదానీ ఎలక్ట్రిసిటీ రేటింగ్‌ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి మార్చినట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ప్రకటించింది. అయితే స్వల్పకానికి ద్రవ్యలభ్యత సరిపోను ఉందని, రాబోయే ఏడాది కాలంలో బాండ్లకు చెల్లింపుల్లో ఇబ్బంది ఉండదనీ భరోసా ఇచ్చింది.

* భారత చట్టాల్లోని నిబంధనలకు పూర్తిగా లోబడే, అదానీ గ్రూప్‌లోని 2 కంపెనీల్లో పెట్టుబడులు (3.1 బి.డాలర్లు) పెట్టినట్లు ఫ్రాన్స్‌కు చెందిన టోటల్‌ఎనర్జీస్‌ ఎస్‌ఈ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని