పని జీవితంలో మరింత సౌలభ్యం కావాలి

ఎక్కువ శాతం మంది ఉద్యోగులు తమ పని జీవితంలో మరింత సౌలభ్యం కోరుకుంటుకున్నారని, ఇందుకోసం వారు వేతన కోతలకు రాజీ పడటానికి కూడా సిద్ధమవుతున్నారని ఏడీపీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన ‘పీపుల్‌ ఎట్‌ వర్క్‌ 2022-ఎ గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌ వ్యూ’ అనే నివేదిక వెల్లడించింది.

Updated : 05 Feb 2023 11:39 IST

76% భారతీయ ఉద్యోగుల అభిప్రాయమిది
అవసరమైతే వేతనాలు తగ్గించుకుంటాం
ఏడీపీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక

దిల్లీ: ఎక్కువ శాతం మంది ఉద్యోగులు తమ పని జీవితంలో మరింత సౌలభ్యం కోరుకుంటుకున్నారని, ఇందుకోసం వారు వేతన కోతలకు రాజీ పడటానికి కూడా సిద్ధమవుతున్నారని ఏడీపీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన ‘పీపుల్‌ ఎట్‌ వర్క్‌ 2022-ఎ గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌ వ్యూ’ అనే నివేదిక వెల్లడించింది. 17 దేశాల్లోని సుమారు 33,000 మంది ఉద్యోగులను సర్వే చేసి ఈ నివేదికను ఏడీపీ రూపొందించింది. ఇందులో ప్రతి 10 మంది ఉద్యోగుల్లో ఏడుగురు వారి పని సమయంపై మరింత సౌలభ్యాన్ని కోరుకుంటున్నారని నివేదిక తెలిపింది.

* భారత్‌లో 76.07 శాతం మంది ఉద్యోగులు తమ పని వేళలపై నియంత్రణ తమకే ఉండాలని భావిస్తున్నారు. రిమోట్‌ వర్కింగ్‌కు హామీ లభించినా, కార్యాలయం-ఇంటి నుంచి ప్రత్యామ్నాయంగా పని చేసేందుకు అంగీకరించినా వేతన కోతలకు కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఒకవేళ పూర్తిస్థాయిలో కార్యాలయానికి వచ్చి పని చేయాలని కంపెనీలు కోరితే 76.38 శాతం భారతీయ ఉద్యోగులు రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడబోమని తేల్చిచెప్పారు. సంప్రదాయ 9-5 ఉద్యోగాలకు బదులుగా ప్రస్తుతం వినూత్న ప్రత్యామ్నాయ ఎంపికల అవసరం ఎంతైనా ఉందని ఏడీపీ ఎండీ (ఆగ్నేయాసియా, భారత్‌) రాహుల్‌ గోయల్‌ వెల్లడించారు.

* ఇంటి నుంచి పని చేస్తున్నా తమకు గుర్తింపు బాగానే ఉందని, సరైన విలువ ఇస్తున్నారని సుమారు 73% మంది ఉద్యోగులు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అవసరాల గురించి ఉద్యోగ సంస్థలు దాపరికం లేకుండా మాతో సంప్రదిస్తున్నాయని 74% మంది ఉద్యోగులు తెలిపారు.

* ఇంటి నుంచి పని వల్ల మానసిక ఆరోగ్యంపై తమ మేనేజర్ల నుంచి సహకారం లభిస్తోందని 56% మంది ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని