పీఈ పెట్టుబడుల డీలా

దేశీయ కంపెనీల్లోకి ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు 2022లో 42 శాతం క్షీణించి 23.3 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయని పరిశ్రమ నివేదిక వెల్లడించింది.

Updated : 05 Feb 2023 06:41 IST

2022లో 42% క్షీణత

23.3 బి.డాలర్లకు పరిమితం: నివేదిక

ముంబయి: దేశీయ కంపెనీల్లోకి ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు 2022లో 42 శాతం క్షీణించి 23.3 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయని పరిశ్రమ నివేదిక వెల్లడించింది. 2019 తరవాత ఇదే అత్యల్ప స్థాయి. ఆ ఏడాది 15.8 బి.డాలర్ల పీఈ పెట్టుబడులు మన దేశంలోకి వచ్చాయి. గత ఏడాది జరిగిన మొత్తం ఒప్పందాల సంఖ్యను వెల్లడించలేదు. నివేదిక ప్రకారం.

* డిసెంబరు త్రైమాసికంలో పీఈ పెట్టుబడులు త్రైమాసిక ప్రాతిపదికన 8.1 శాతం తగ్గి 3.61 బి.డాలర్లుగా నమోదయ్యాయి. సెప్టెంబరు త్రైమాసికంలో ఇవి 3.93 బి.డాలర్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే 11.06 బి.డాలర్ల నుంచి ఏకంగా 67.2 శాతం క్షీణించాయి.

* మూడో త్రైమాసికం నాటి 443 ఒప్పందాలతో పోలిస్తే , డిసెంబరు త్రైమాసికంలో మొత్తం ఒప్పందాలు 24.8 శాతం తగ్గి 333కు పరిమితమయ్యాయి. 2021 డిసెంబరు త్రైమాసికం నాటి 411తో పోలిస్తే 19 శాతం తగ్గాయి.

* పాశ్చాత్య దేశాల్లో భౌగోళిక-రాజకీయ అనిశ్చితులు, పెరుగుతున్న వడ్డీ రేట్లు, మాంద్యం భయాల నేపథ్యంలో, అంతర్జాతీయ పెట్టుబడిదార్లు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆచితూచి వ్యవహరిస్తుండటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఎల్‌ఎస్‌ఈజీ బిజినెస్‌ అనుబంధ సంస్థ రెఫినిటివ్‌ సీనియర్‌ విశ్లేషకులు ఎలైన్‌ ట్యాన్‌ వెల్లడించారు.

* ఇంటర్నెట్‌-ఆధారిత, కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, రవాణా తదితర రంగాలు మెజార్టీ నిధులు చేజిక్కించుకున్నాయి. మొత్తం పీఈ పెట్టుబడుల్లో 66 శాతం ఈ రంగాలే దక్కించుకున్నాయి. ఇంటర్నెట్‌ ఆధారిత రంగంలోకి గత ఏడాది పెట్టుబడులు 57.4 శాతం తగ్గాయి. 2021లో ఈ రంగంలో 556 ఒప్పందాలు జరగ్గా, 2022లో 528కి పరిమితమయ్యాయి.

* 2021తో పోలిస్తే కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లోకి 46.4 శాతం, ఆర్థిక సేవల రంగంలోకి 34.6 శాతం, వైద్య, ఆరోగ్య రంగాల్లోకి 26.4 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి.

* రవాణా రంగంలోకి మాత్రం నిధులు దాదాపు రెట్టింపయ్యాయి. కమ్యూనికేషన్స్‌లోకి 225.6 శాతం, వ్యవసాయ, అటవీ, మత్య్స రంగాల్లోకి 215.8 శాతం మేర నిధులు పెరిగాయి. చైనాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల పీఈ సంస్థలు తమ పెట్టుబడుల్ని భారత్‌, ఆగ్నేయాసియాకు బదిలీ చేయడం కలిసొచ్చింది.

* దేశీయ పీఈ సంస్థలు 2022లో 13.7 బి.డాలర్ల నిధుల్ని సమీకరించాయి. 2021లో సమీకరించిన 5.21 బి.డాలర్లతో పోలిస్తే ఇది 163.2 శాతం అధికం. 2019-22 మధ్య దేశీయ పీఈ సంస్థలు 32 బి.డాలర్లను సమీకరించాయి.

* ఒప్పందాల విపణిలో థింక్‌ అండ్‌ లెర్న్‌, వెర్సె ఇన్నోవేషన్‌లు పీఈ సంస్థల నుంచి చెరో 800 మి.డాలర్లను దక్కించుకుని అగ్ర స్థానంలో నిలిచాయి. భారతీ ఎయిర్‌టెల్‌, బండి టెక్నాలజీస్‌ (చెరో 700 మి.డాలర్లు), టాటా మోటార్స్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ (494.7 మి.డాలర్లు), రిలయన్స్‌ రిటైల్‌ (343.5 మి.డాలర్లు), ఎన్‌టెక్స్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సర్వీసెస్‌ (330 మి.డాలర్లు), డెలివరీ (304 మి.డాలర్లు) బిజీబీస్‌ లాజిస్టిక్స్‌ సొల్యూషన్స్‌, రెంక్యూబ్‌ (చెరో 300 మి.డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు