వైద్య రంగంలో మానవ వనరుల అభివృద్ధి

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరచిన ప్రతిపాదనలతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు వైద్య సేవలు విస్తరించే అవకాశం కనిపిస్తోంది.

Updated : 05 Feb 2023 06:42 IST

మున్ముందు మరింత నాణ్యంగా సేవలు
బడ్జెట్‌పై వైద్య వర్గాల స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరచిన ప్రతిపాదనలతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు వైద్య సేవలు విస్తరించే అవకాశం కనిపిస్తోంది. అంతేగాక టెలీమెడిసిన్‌ సేవలు పెరుగుతాయని, కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత వైద్య సేవలు, శస్త్రచికిత్సలు విస్తరిస్తాయని కార్పొరేట్‌ ఆస్పత్రుల వర్గాలు వివరిస్తున్నాయి. వైద్య, ఆరోగ్య సేవల రంగానికి తాజాగా బడ్జెట్లో రూ.88,956 కోట్లు కేటాయించారు. క్రితం ఏడాది బడ్జెట్‌తో పోల్చితే ఇది 2.71 శాతం (రూ.2,350 కోట్లు) అధికం. వైద్య, ఆరోగ్య సేవల విస్తరణలో ప్రస్తుతం మానవ వనరుల కొరత, నైపుణ్యాల లేమి ప్రధాన సమస్యగా ఉంది. దీనికి తోడు వైద్య పరిశోధనలు కూడా పరిమితంగానే జరుగుతున్నాయి. పశ్చిమ దేశాల్లోని వైద్య విధానాలను తెచ్చుకోవడం మినహా మన దేశంలో స్థానిక పరిస్థితులకు, వైద్య పరిజ్ఞానానికి అనుగుణంగా మెరుగైన వైద్య సేవలను ఆవిష్కరించడం అనేది ఇటీవల కాలంలో కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నారా... అన్నట్లుగా మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల విస్తరణపై దృష్టి సారించనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

కృత్రిమ మేధకు ప్రోత్సాహం, 5జీ ల్యాబ్స్‌ విస్తరణ, ఐసీఎంఆర్‌ పరిశోధనా కేంద్రాల్లో వైద్య పరిశోధనలు నిర్వహించే వీలు కల్పించడం.... వంటి ప్రతిపాదనలు బడ్జెట్లో ఉన్నాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చితే మనదేశంలో వైద్య రంగ ముఖచిత్రం ఎంతో వేగంగా మారుతుందని, సేవల నాణ్యత పెరుగుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని అపోలో హాస్పిటల్స్‌ గ్రూపు అధ్యక్షుడు డాక్టర్‌ హరిప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. ‘కొవిడ్‌’ పరిణామాల ఫలితంగా ఆరోగ్య సేవల రంగంలో నైపుణ్యాల వృద్ధి అవసరం అధికంగా ఉందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని కేర్‌ హాస్పిటల్స్‌ గ్రూపు సీఈఓ జస్‌దీప్‌సింగ్‌ అభిప్రాయపడ్డారు. ఆరోగ్య సేవల రంగానికి సంబంధించి ఈ బడ్జెట్‌ ఎంతో విప్లవాత్మకమైనదని మెడికవర్‌ హాస్పిటల్‌ సీఎండీ అనిల్‌ కృష్ణ తెలిపారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌’కు 10% అదనంగా నిధులు కేటాయించడం ఎంతోమందికి మేలు చేస్తుందని కామినేని హాస్పిటల్స్‌ ఎండీ కామినేని శశిధర్‌ పేర్కొన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, పరిశోధన, పర్యాటకం, హరిత ఇంధనం, వ్యవసాయం వంటి కీలక రంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేసినట్లు, భారత్‌ బయోటెక్‌ ఎండీ, సీఐఐ- దక్షిణ ప్రాంత ఛైర్‌పర్సన్‌ సుచిత్ర ఎల్ల అన్నారు. కొవిడ్‌ మహమ్మారి, ఇతరత్రా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో, భరోసా కల్పించేదిగా ఇందులో ప్రతిపాదనలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని