ఊగిసలాటలకే అవకాశం

అదానీ గ్రూప్‌ షేర్లలో భారీ హెచ్చుతగ్గులు కాస్తా ఈ వారం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు అంటున్నారు. మరో వైపు అంతర్జాతీయ సంకేతాలు, దేశీయంగా ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ సమావేశం, ఆర్థిక ఫలితాలు కూడా మార్కెట్లకు దిశానిర్దేశం చేయొచ్చని భావిస్తున్నారు.

Updated : 06 Feb 2023 03:53 IST

అదానీ షేర్లపైనే దృష్టంతా
ఆర్‌బీఐ పరపతి విధాన నిర్ణయాలు కీలకం
బ్యాంకింగ్‌, ఫార్మాకు సానుకూలతలు
విశ్లేషకుల అంచనాలు
స్టాక్‌ మార్కెట్‌
ఈ వారం

దానీ గ్రూప్‌ షేర్లలో భారీ హెచ్చుతగ్గులు కాస్తా ఈ వారం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు అంటున్నారు. మరో వైపు అంతర్జాతీయ సంకేతాలు, దేశీయంగా ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ సమావేశం, ఆర్థిక ఫలితాలు కూడా మార్కెట్లకు దిశానిర్దేశం చేయొచ్చని భావిస్తున్నారు. అమెరికా నెలవారీ ఉద్యోగ గణాంకాల నుంచి అంతర్జాతీయ ఈక్విటీలు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. మరో వైపు బుధవారం ముగిసే పరపతి విధాన కమిటీ రెపో రేటులో 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచే అవకాశం ఉందని అంచనాలున్నాయి. అదే సమయంలో భవిష్యత్‌లో మరిన్ని రేట్ల కోతలు ఉండకపోవచ్చన్న సంకేతాలనూ ఆర్‌బీఐ వెలువరచవచ్చని అంటున్నారు. దేశీయ మార్కెట్లో విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు కొనసాగితే.. ఆ ప్రభావం కనిపించొచ్చు. వివిధ రంగాలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

* ఎటువంటి ప్రధాన వార్తలూ లేనందున ఎంపిక చేసిన ఐటీ షేర్లలో కదలికలు గమనించొచ్చు. అమెరికాలో 53 ఏళ్లలోనే అత్యంత తక్కువ నిరుద్యోగ గణాంకాలను నమోదు కావడం కొంత ప్రభావం చూపొచ్చు.

* జనవరిలో బలమైన విక్రయ గణాంకాలు, బడ్జెట్‌లో సానుకూల ప్రతిపాదనల నేపథ్యంలో వాహన  కంపెనీల లాభాలు కొనసాగొచ్చు. ఈ వారం  ఫలితాలను వెల్లడించే మహీంద్రా అండ్‌ మహీంద్రా, హీరో మోటోలపై మదుపర్లు దృష్టి సారించొచ్చు.

* యంత్రపరికరాల రంగం సమీప భవిష్యత్‌లో స్థిరీకరణకు లోనుకావొచ్చు. అందుకే ఈ రంగ షేర్లలో భారీ లాభాలేమీ కనిపించకపోవచ్చు. 

అప్‌స్ట్రీమ్‌ కంపెనీలైన ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా షేర్లు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా కదలాడవచ్చు.

* ఎంపిక చేసిన ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లలో చలనాలను అంచనా వేయొచ్చు. ఫలితాల సీజనుకు తోడు బడ్జెట్‌ నుంచి నేరుగా ఈ రంగానికి మద్దతు లభించకపోవడం ఇందుకు కారణం.

* ఫార్మా కంపెనీల షేర్లపై మదుపర్ల ఆసక్తి కనిపించొచ్చు. ఈ రంగంలో స్థిరీకరణ కొనసాగుతూ ఉండడంతో షేర్లు తక్కువ స్థాయిల్లో ఉన్నాయి.

* ఈ వారం వెలువడనున్న భారతీ ఎయిర్‌టెల్‌ ఫలితాలను బట్టి టెలికాం కంపెనీల షేర్లు సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు.

* బ్యాంకింగ్‌ షేర్లు ఈ వారమూ లాభాలందుకోవచ్చు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐలు ముందుండి నడిపించొచ్చు. ఇక బుధవారం పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాల వైపు       మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించొచ్చు.

* బలహీన మార్కెట్‌ సెంటిమెంటు నేపథ్యంలో సిమెంటు కంపెనీల షేర్లు ఒక శ్రేణికి లోబడి చలించొచ్చు.  

* లోహ కంపెనీల షేర్లు ఈ వారం ఊగిసలాటలకు గురికావొచ్చు. అమెరికా తయారీ గణాంకాలు, అమెరికా నిరుద్యోగ గణాంకాల ప్రభావం పడొచ్చు.  


నేటి బోర్డు సమావేశాలు

టాటా స్టీల్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఎస్‌జేవీన్‌, ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌, ఇన్ఫిబీమ్‌ అవెన్యూస్‌, కోల్టే పాటిల్‌, ఆన్‌మొబైల్‌ గ్లోబల్‌, తమిళనాడు పెట్రో ప్రోడక్ట్స్‌, యునికెమ్‌ ల్యాబ్స్‌, విశాక ఇండస్ట్రీస్‌, వీమార్ట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని