సంక్షిప్త వార్తలు(8)
హెవీ డ్యూటీ ట్రక్కుల కోసం దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ టెక్నాలజీ సొల్యూషన్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ సోమవారం ఆవిష్కరించింది.
హెవీ డ్యూటీ ట్రక్కుల కోసం హైడ్రోజన్‌తో నడిచే ఇంజిన్ సాంకేతికత
ఆవిష్కరించిన రిలయన్స్
హెవీ డ్యూటీ ట్రక్కుల కోసం దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ టెక్నాలజీ సొల్యూషన్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ సోమవారం ఆవిష్కరించింది. ఈ సాంకేతికతపై పనిచేసే ట్రక్కును ‘ఇండియా ఎనర్జీ వీక్’ కార్యక్రమంలో ప్రదర్శించింది. రెండు పెద్ద హైడ్రోజన్ సిలిండర్‌లతో అశోక్ లేలాండ్ ఈ ట్రక్కును తయారుచేసింది. హెచ్2ఐసీఈతో (ఇందులో హెచ్2 అంటే హైడ్రోజన్, ఐసీఈ అంటే.. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) నడిచే ట్రక్కులు దాదాపుగా శూన్య ఉద్గారాలు విడుదల చేస్తాయి. అలాగే సంప్రదాయ డీజిల్ ఇంజిన్‌తో నడిచే ట్రక్కుల తరహాలోనే.. హైడ్రోజన్‌తో నడిచే ట్రక్కులు పనిచేసే సామర్థ్యం ఉంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. శబ్దకాలుష్యం ఉండకపోగా.. నిర్వహణ వ్యయాలు కూడా దీని ద్వారా తగ్గుతాయని పేర్కొంది.
37% తగ్గిన ఎల్‌ఐసీ హౌసింగ్ లాభం
ముంబయి: డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ రూ.480.3 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.767.33 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 37 శాతం తక్కువ. అధిక వ్యయాలు లాభం తగ్గడానికి కారణమయ్యాయి. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.5,054 కోట్ల నుంచి 16 శాతం వృద్ధి చెంది రూ.5,871 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ.4,108.54 కోట్ల నుంచి రూ.5,283 కోట్లకు అధికమయ్యాయి. కంపెనీ నికర వడ్డీ ఆదాయం రూ.1,455 కోట్ల నుంచి రూ.1,606 కోట్లకు పెరిగింది. మొత్తం రుణ పంపిణీలు రూ.17,770 కోట్ల నుంచి రూ.16,100 కోట్లకు చేరాయి.
హైదరాబాద్‌లో పెరిగిన గోదాముల అద్దె లావాదేవీలు: నివేదిక
ఈనాడు, హైదరాబాద్: పారిశ్రామిక, గోదాముల అద్దె లావాదేవీల్లో గత ఏడాది హైదరాబాద్‌లో 16 శాతం వృద్ధి కనిపించింది. 2022లో మొత్తం 37 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాములు అద్దెకు వెళ్లినట్లు స్థిరాస్తి సేవల సంస్థ సీబీఆర్‌ఈ వెల్లడించింది. 2021లో 32 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే ఇది 16 శాతం అధికమని తెలిపింది. జులై-డిసెంబరు మధ్య కాలంలో 22లక్షల చదరపు అడుగుల స్థలం అద్దెకు వెళ్లిందని పేర్కొంది. అంతకు క్రితం ఏడాది ఇదే సమయంలో 12 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలోనే లావాదేవీలు జరిగాయి. 2022 ద్వితీయార్థంలో శాంసంగ్ 2.25లక్షలు, వి-గార్డ్ ఇండస్ట్రీస్ 2లక్షలు, ఆప్టార్ ఫార్మా 1.34లక్షల చ.అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయని పేర్కొంది. మిగతా స్థలాన్ని పలు సంస్థలు లీజింగ్‌కు తీసుకున్నాయని తెలిపింది. దేశ రాజధాని దిల్లీలో అత్యధికంగా గత ఏడాది అత్యధికంగా 73 లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో స్థలం అద్దెకు వెళ్లింది.
డ్రోన్ టెక్ యాక్సిలేటర్ కార్యక్రమంలో 10 అంకురాలు
ఈనాడు, హైదరాబాద్: డ్రోన్ల సాంకేతికతపై పని చేస్తున్న అంకురాలను ప్రోత్సహించేందుకు టి-హబ్, ఏడబ్ల్యూఎస్-ఇంటెల్ ఇన్నోవేషన్ ఉమ్మడిగా నిర్వహిస్తోన్న తొలి డ్రోన్ టెక్ యాక్సిలేటర్ కార్యక్రమంలో 10 అంకురాలు ఎంపికయ్యాయి. గత ఏడాది జులైలో ఇది ప్రారంభమైంది. గగనతల సర్వేలు, వీడియోల చిత్రీకరణ, రక్షణ, అంతరిక్షం, జాతీయ భద్రత, ఆరోగ్య రంగం, ప్రజా రక్షణ, రవాణా.,. తదితర రంగాల్లో పని చేస్తున్న డ్రోన్ టెక్నాలజీ సంస్థలను ఇందుకోసం ఎంపిక చేసినట్లు టి-హబ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. 10ఇన్‌ఫినిటి, అకిన్ అనలిటిక్స్, డేబెస్ట్ రీసెర్చ్, డ్రోగో డ్రోన్స్, ఇండ్రోన్స్, ఓప్లస్ ఇన్నోవేషన్, సెన్స్‌ఏకర్ ల్యాబ్స్, విక్రోస్ టెక్నాలజీస్, వ్యోమిక్ డ్రోన్స్, యరలవ టెక్నాలజీస్ ఇందులో ఉన్నాయి. మూడేళ్లుగా డ్రోన్ సాంకేతికత ఆధారంగా వస్తున్న అంకురాలు పెరిగాయని, భవిష్యత్తులో ఈ రంగంలో భారతీయ సంస్థలు అగ్రగామిగా కొనసాగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని టి-హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ విభాగాలు, అంకురాలు కలిసి పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని తెలంగాణ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంతా తౌటం పేర్కొన్నారు.
విశాక ఇండస్ట్రీస్ షేర్ల విభజన
ఈ నెల 22న బోర్డు సమావేశంలో నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: పార్టికల్ బోర్డులు, ఆస్‌బెస్టాస్ సిమెంటు రేకులు, పాలియస్టర్ యార్న్ ఉత్పత్తి చేసే సంస్థ అయిన విశాక ఇండస్ట్రీస్ ఈక్విటీ షేర్లను విభజించాలని కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతం ఒక్కో షేరు ముఖ విలువ రూ.10గా ఉండగా, దీన్ని విభజించాలని ప్రతిపాదించింది. ఒక్కో షేరును ఎన్ని షేర్లుగా విభజించాలనే అంశాన్ని ఈ నెల 22న జరిగే బోర్డు డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయిస్తారు. అధిక ద్రవ్యలభ్యత నిమిత్తం ఆ ప్రతిపాదన చేపట్టినట్లు తెలుస్తోంది. విశాక ఇండస్ట్రీస్ షేరు సోమవారం బీఎస్‌ఈ (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ)లో రూ.383 ముగింపు ధర నమోదు చేసింది.
గ్జేబియా ప్రొడక్ట్ ఇంజినీరింగ్ కార్యాలయం విస్తరణ
కొత్తగా 650 ఉద్యోగాలు
ఈనాడు, హైదరాబాద్: ప్రత్యేక సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, పరిశోధన (ఆర్ అండ్ డీ) సేవలను అందిస్తోన్న డచ్ ఐటీ సంస్థ గ్జేబియా ప్రొడక్ట్ ఇంజినీరింగ్ (కోమేకిట్ సాఫ్ట్‌వేర్) హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని విస్తరించింది. సోమవారం జరిగిన కార్యక్రమంలో భారత్‌లో డచ్ రాయబారి మార్టిన్ వాన్ డెన్ బెర్గ్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. 19 దేశాల్లో దాదాపు 6,200 మంది ఉద్యోగులు ఈ సంస్థకు ఉన్నారు. కోమేక్‌ఇట్ (ప్రస్తుతం గ్జేబియా) సహ వ్యవస్థాపకులు, సీఓఓ కిరణ్ మధునాపంతుల మాట్లాడుతూ.. తమ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల అభివృద్ధి విభాగం కొన్నేళ్లుగా 30 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. 2007లో 17 మంది ఉద్యోగులతో ప్రారంభమైన సంస్థలో ఇప్పుడు 350 మంది ఉన్నారని పేర్కొన్నారు. 2025 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,000కి చేరుకుంటుందని వివరించారు.
నష్టాల్లోకి టాటా స్టీల్
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో టాటా స్టీల్ నష్టాల్లోకి జారింది. రూ.2,501.95 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఏడాది కింద ఇదే సమయంలో రూ.9,598.16 కోట్ల నికర లాభాన్ని ఆర్జించడం విశేషం. ఇక ఏకీకృత ఆదాయం రూ.60,842.72 కోట్ల నుంచి రూ.57,354.16 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ.48,666.02 కోట్ల నుంచి రూ.57,172.02 కోట్లకు పెరిగాయి. కంపెనీ రుణాలు రూ.71,706 కోట్లుగా ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
సంక్షిప్తంగా
* ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్23కు ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమైన మొదటి రోజున రూ.1,400 కోట్ల విలువైన 1.4 లక్షల ఫోన్లకు ఆర్డర్లు వచ్చాయని శామ్‌సంగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మొబైల్ వ్యాపారం) రాజు పుల్లన్ తెలిపారు.
* 2022లో భారత విమాన ప్రయాణికుల రాకపోకలు కొవిడ్ మునుపటి స్థాయిలో 86 శాతానికి చేరాయని అంతర్జాతీయ విమానయాన సంఘం ఐఏటీఏ తెలిపింది.
* డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నుంచి తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు డిజిటల్ కాంపిటీషన్ చట్టంపై ప్యానెల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
* గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్లుగా ప్రమోటరు కుమార్ మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా, కుమారుడు విక్రమ్ బిర్లా చేరారు.
* జర్మనీ నుంచి ఎయిర్‌బస్ ఏ321ఎల్‌ఆర్ విమానాన్ని విస్తారా అందుకుంది.
* ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రుణదాతలు మధ్యంతర చెల్లింపుగా రూ.3,200 కోట్లు అందుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nani: ఆ రాంబాబేనా ఈ ‘ధరణి’?.. ఆసక్తికరం నాని జర్నీ!
-
Crime News
Vizag : ఆత్మహత్య చేసుకుంటామని బంధువులకు సెల్ఫీ వీడియో పంపిన దంపతులు..
-
India News
Rahul Gandhi: ‘చట్టాన్ని గౌరవించడమే.. ’: రాహుల్ ‘అనర్హత’పై అమెరికా స్పందన ఇదే..
-
Sports News
Virat -Babar: ఆ ఒక్క క్వాలిటీనే వ్యత్యాసం.. అందుకే బాబర్ కంటే విరాట్ అత్యుత్తమం: పాక్ మాజీ ఆటగాడు
-
Crime News
Crime News: శంషాబాద్ విమానాశ్రయంలో కిలోకుపైగా విదేశీ బంగారం పట్టివేత
-
Movies News
Telugu Movies:ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!