లోహ, విద్యుత్‌ షేర్లు డీలా

ఐటీ, విద్యుత్‌, లోహ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. రేట్ల పెంపు భయాలతో అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా మారాయి.

Updated : 07 Feb 2023 03:09 IST

సమీక్ష

ఐటీ, విద్యుత్‌, లోహ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. రేట్ల పెంపు భయాలతో అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా మారాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు ఇందుకు తోడయ్యాయి. డాలరుతో పోలిస్తే రూపాయి 65 పైసలు తగ్గి 82.73 వద్ద ముగిసింది. పీపా ముడిచమురు 80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్‌ నష్టపోగా, టోక్యో, సియోల్‌ లాభపడ్డాయి. ఐరోపా సూచీలు నష్టాల్లో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 60,847.21 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. మళ్లీ కోలుకోలేకపోయింది. ఒకదశలో 60,345.61 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయిన సెన్సెక్స్‌, చివరకు 334.98 పాయింట్ల నష్టంతో 60,506.90 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 89.45 పాయింట్లు కోల్పోయి 17,764.60 దగ్గర స్థిరపడింది.

* ఆకర్షణీయమైన త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు 0.74% పెరిగి రూ.383.30 వద్ద ముగిసింది.
* త్రైమాసిక నష్టం తగ్గడంతో పేటీఎం షేరు 6.31% పరుగులు తీసి రూ.558 దగ్గర స్థిరపడింది.
* సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 నష్టపోయాయి. టాటా స్టీల్‌ 2.08%, కోటక్‌ బ్యాంక్‌ 1.87%, ఇన్ఫోసిస్‌ 1.79%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.18%, ఎం అండ్‌ ఎం 0.91%, అల్ట్రాటెక్‌ 0.84% చొప్పున డీలాపడ్డాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.34%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.56%, పవర్‌గ్రిడ్‌ 1.05% లాభపడ్డాయి.  
* హరిత బాండ్లపై నిర్వహణ మార్గదర్శకాలను సెబీ విడుదల చేసింది. ఈ బాండ్లను జారీ చేసే వారు పర్యావరణ లక్ష్యాలకు సంబంధించి అదనపు వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ప్రాజెక్టుల అర్హత, సమీకరించిన నిధులను ఏ విధంగా వినియోగించనున్నారో వంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.

అదానీ షేర్లలో రూ.9.5 లక్షల కోట్ల ఆవిరి సోమవారం అధిక శాతం అదానీ షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 10%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 5%, అదానీ పవర్‌   5%, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 5%, అదానీ విల్మార్‌ 5%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 0.74% పడ్డాయి. అదానీ పోర్ట్స్‌ 9.46%, అంబుజా 1.54%, ఏసీసీ 2.24%, ఎన్‌డీటీవీ 1.37% రాణించాయి. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన తర్వాత గత 9 ట్రేడింగ్‌ రోజుల్లో అదానీ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.9.5 లక్షల కోట్లు ఆవిరైంది.

ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం ప్రారంభం: ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ (ఎంపీసీ)  3 రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది. బుధవారం ఉదయం వడ్డీ రేట్ల నిర్ణయం ప్రకటించనున్నారు. ఈసారి 25 బేసిస్‌ పాయింట్ల మేర రేట్ల పెంపు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ఆర్‌బీఐ లక్ష్యిత శ్రేణి 6% లోపలే ఉండటం ఇందుకు కారణం.


నేటి బోర్డు సమావేశాలు

భారతీ ఎయిర్‌టెల్‌, హీరో మోటోకార్ప్‌, అదానీ పోర్ట్స్‌, అంబుజా సిమెంట్‌, అదానీ గ్రీన్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, బార్బెక్యూ నేషన్‌, బేయర్‌ క్రాప్‌, చంబల్‌ ఫెర్టిలైజర్స్‌, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ ఫార్మా, కల్యాణ్‌ జువెలర్స్‌, నాగార్జున ఫెర్టిలైజర్స్‌, ఎన్‌డీటీవీ, ఎన్‌హెచ్‌పీసీ, రామ్‌కో సిమెంట్‌, శోభా, ధెర్మాక్స్‌Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని