భారత ఇంధన రంగంలో అపార అవకాశాలు

 ప్రస్తుతం ఇంధన రంగంలో పెట్టుబడులకు భారత్‌లోనే అపార అవకాశాలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Published : 07 Feb 2023 02:09 IST

వచ్చే దశాబ్దంలో అధిక గిరాకీ ఇక్కడే
ఇండియా ఎనర్జీ వీక్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఈనాడు, బెంగళూరు:  ప్రస్తుతం ఇంధన రంగంలో పెట్టుబడులకు భారత్‌లోనే అపార అవకాశాలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశీయంగా అధిక ఇంధన గిరాకీ, స్థిరమైన నాయకత్వం, సంస్కరణలు వంటివి అంతర్జాతీయ పెట్టుబడులకు అనువుగా ఉన్నాయని తెలిపారు. ‘ఇండియా ఎనర్జీ వీక్‌ 2023’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చే దశాబ్దంలో ప్రపంచంలో ఎక్కువ ఇంధన గిరాకీ వృద్ధి భారత్‌లోనే ఉండొచ్చన్నారు. అంతర్జాతీయ ఇంధన సంఘం లెక్కల ప్రకారం.. ప్రపంచ చమురు గిరాకీలో భారత వాటా 5 శాతంగా ఉందని, ఇది 11 శాతానికి పెరగొచ్చని చెప్పారు. గ్యాస్‌ గిరాకీ 500 శాతం అధికం కావొచ్చన్నారు. భారత ఇంధన రంగానికి సంబంధించి అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని కార్పొరేట్లకు సూచించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

‘‘ఇంధన రంగంలో చేపడుతున్న సంస్కరణలు భారత్‌ వికసిస్తోందనేందుకు సరైన నిదర్శనం. ఈ సంస్కరణల ఫలాలు దేశంలో స్వదేశీ, ఆధునిక ఇంధన ఉత్పత్తులకు నాంది పలికింది. చమురు, గ్యాస్‌ దిగుమతులపై ఆధారపడటం తగ్గించేందుకు పునరుత్పాదక ఇంధన, బయో ఇంధనాలు, హైడ్రోజన్‌ వంటి వాటిపై దృష్టి పెట్టి, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. 2030 నాటికి ఇంధన మిశ్రమంలో సహజవాయువును వినియోగించేందుకు కృషి చేస్తున్నాం. విద్యుత్తు వాహనాలు, హైడ్రోజన్‌ ద్వారా కర్బన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలు క్రమంగా సాధిస్తున్నాం. ప్రస్తుతం దేశ వార్షిక చమురు శుద్ధి సామర్థ్యం 250 మెట్రిక్‌ టన్నులు ఉండగా దీన్ని 450 ఎంఎంటీపీఏకు చేర్చనున్నాం. ఈ- ఇంధనం, 2జీ ఎథనాల్‌ బయో రిఫైనరీ రంగంలోనూ 12 వాణిజ్య 2జీ ఎథనాల్‌ ప్లాంట్లను తయారీకి సన్నాహకాలు చేస్తున్నాం.’’

11 రాష్ట్రాల్లో 20% ఎథనాల్‌ కలిపిన పెట్రోలు

ఈ-20 ఇంధనం, అన్‌బాటిల్డ్‌ యూనిఫార్మ్‌, ఆయిల్‌ ఇండోర్‌ సౌర వంట వ్యవస్థలను ప్రధాని మోదీ ప్రారంభించారు. అదే సమయంలో 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన పెట్రోలు బంకుల్లో 20 శాతం ఎథనాల్‌ కలిపిన పెట్రోలు అమ్మకాలను సైతం ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర ఇంధన మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ తదితరులు పాల్గొన్నారు.

హెచ్‌ఏఎల్‌ ప్రగతితో విపక్షాలకు గట్టి జవాబు: హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఒప్పందాలపై విపక్షాలు చేసిన తప్పుడు ఆరోపణలకు ఆ సంస్థ సాధిస్తున్న ప్రగతితో జవాబు చెబుతున్నట్లు మోదీ అన్నారు. సోమవారం కర్ణాటకలోని తుమకూరు పరిసరాల్లో హెచ్‌ఏఎల్‌ హెలికాప్టర్‌ ఫెసిలిటీ, స్ట్రక్చర్‌ హ్యాంగర్‌ కర్మాగారాన్ని ప్రారంభించారు. వైమానిక రంగంలో గత ఎనిమిదేళ్లలో పెట్టిన పెట్టుబడులు 2014కు ముందు 15 ఏళ్ల పెట్టుబడుల కంటే 15 రెట్లు అధికమని ప్రధాని విశ్లేషించారు. ప్రస్తుతం తుమకూరులో ప్రారంభించిన ఉత్పాదక కేంద్రం ద్వారా భవిష్యత్తులో రూ.4 లక్షల కోట్ల వ్యాపారం సాధ్యమన్నారు. ఈ కేంద్రం కేవలం సైనిక శక్తిని పెంచేందుకే కాకుండా ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు