రెండో రోజూ అమ్మకాల ఒత్తిడి

వరుసగా రెండో రోజూ సూచీలు నష్టాలు చవిచూశాయి. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ప్రకటనకు ముందు ఎఫ్‌ఎమ్‌సీజీ, లోహ, వాహన షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.

Published : 08 Feb 2023 01:52 IST

సమీక్ష

వరుసగా రెండో రోజూ సూచీలు నష్టాలు చవిచూశాయి. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ప్రకటనకు ముందు ఎఫ్‌ఎమ్‌సీజీ, లోహ, వాహన షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు తగ్గి 82.70 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.79% పెరిగి 81.78 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్‌ ఉదయం 60,511.32 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఇంట్రాడేలో 60,063.49 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. ఆఖర్లో కొంత కోలుకుని 220.86 పాయింట్ల నష్టంతో 60,286.04 వద్ద ముగిసింది. నిఫ్టీ 43.10 పాయింట్లు తగ్గి 17,721.50 దగ్గర స్థిరపడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 డీలాపడ్డాయి. టాటా స్టీల్‌ 5.23%, ఐటీసీ 2.65%, సన్‌ఫార్మా 1.74%, మారుతీ 1.72%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.59%, టాటా మోటార్స్‌ 1.50%, హెచ్‌యూఎల్‌ 1.29%, విప్రో 1.09%, అల్ట్రాటెక్‌ 0.73% చొప్పున నష్టపోయాయి. కోటక్‌ బ్యాంక్‌ 1.59%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.22%, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.90%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 0.61% రాణించాయి.

14% దూసుకెళ్లిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌: 1114 మిలియన్‌ డాలర్ల విలువైన రుణాలను ముందస్తుగా చెల్లించి.. అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్లను తనఖా నుంచి విడిపిస్తామని అదానీ గ్రూప్‌ ప్రకటించిన నేపథ్యంలో, మంగళవారం 6 అదానీ గ్రూప్‌ షేర్లు రాణించాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 14.63% పరుగులు తీసి రూ.1802.50 వద్ద ముగిసింది. అదానీ పోర్ట్స్‌ 1.33%, అదానీ విల్మర్‌ 4.99%, ఏసీసీ 1.32%, అంబుజా సిమెంట్స్‌ 1.12%, ఎన్‌డీటీవీ 1.07% చొప్పున రాణించాయి. అదానీ టోటల్‌ గ్యాస్‌ 5%, అదానీ గ్రీన్‌ 5%, అదానీ పవర్‌ 4.99%, అదానీ ట్రాన్స్‌మిషన్‌ 0.77% నష్టపోయాయి. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన (జనవరి 24 నుంచి) ఇప్పటివరకు అదానీ గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.9.2 లక్షల కోట్లు ఆవిరైంది.  

* బలహీన త్రైమాసిక ఫలితాలతో టాటా స్టీల్‌ షేరు 5.23% కోల్పోయి రూ.111.45 వద్ద ముగిసింది.

* బీమా సేవలు అందించే గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఐపీఓ పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెనక్కి పంపింది. తాజా సమాచారంతో కంపెనీ ముసాయిదా పత్రాలను మళ్లీ దాఖలు చేయాలని చూస్తోంది. కంపెనీ 2022 ఆగస్టులో ఐపీఓకు దరఖాస్తు చేసుకుంది.

* దివాలా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటున్న రిలయన్స్‌ క్యాపిటల్‌కు రెండో విడత ఆర్థిక బిడ్‌లు కోరుతూ రుణదాత దాఖలు చేసిన పిటిషన్‌పై టొరెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఇతర ప్రతివాదులకు ఎన్‌సీఎల్‌ఏటీ నోటీసులు జారీ చేసింది.  

* వొడాఫోన్‌ ఐడియా రూ.16,133 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రభుత్వానికి కేటాయించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ కేటాయింపు తర్వాత కంపెనీలో ప్రభుత్వానికి 33.44 శాతం వాటా ఉంటుంది. సంస్థలో ప్రభుత్వమే అతిపెద్ద వాటాదారు అవుతుంది. ప్రమోటర్ల వాటా 75 శాతం నుంచి దాదాపు 50 శాతానికి దిగివస్తుంది.
నేటి బోర్డు సమావేశాలు: ఎస్కార్ట్స్‌, అదానీ పవర్‌, అదానీ విల్మర్‌, లిఖితా ఇన్‌ఫ్రా, మిధానీ, ఎన్‌సీసీ, కమిన్స్‌, ఈక్విటాస్‌ బ్యాంక్‌, శ్రీసిమెంట్‌, గతీ, గ్రాఫైట్‌, ఇర్కాన్‌, సింఫనీ, ట్రెంట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని