సంక్షిప్త వార్తలు (8)

టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ రాణించింది. 2022-23 అక్టోబరు-డిసెంబరులో కంపెనీ ఏకీకృత నికర లాభం 91.5 శాతం వృద్ధితో రూ.1,588 కోట్లకు చేరుకుంది.

Updated : 08 Feb 2023 03:07 IST

రాణించిన భారతీ ఎయిర్‌టెల్‌

లాభంలో 91.5% వృద్ధి

దిల్లీ: టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ రాణించింది. 2022-23 అక్టోబరు-డిసెంబరులో కంపెనీ ఏకీకృత నికర లాభం 91.5 శాతం వృద్ధితో రూ.1,588 కోట్లకు చేరుకుంది. అన్ని విభాగాల్లో బలమైన, స్థిరమైన పనితీరు కారణంగా మొత్తం ఆదాయం దాదాపు 20 శాతం వృద్ధితో రూ.35,804 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. అసాధారణ అంశాలను పరిగణనలోకి తీసుకోకపోతే ఏకీకృత నికర లాభం 147 శాతం వృద్ధితో రూ.1,994 కోట్లకు చేరిందని కంపెనీ పేర్కొంది.

రూ.193కు ఆర్పు

‘త్రైమాసికం వారీగా ఆదాయం 3.7%, ఎబిటా మార్జిన్‌ 52% పెరిగాయి. నాణ్యమైన వినియోగదార్లను అందిపుచ్చుకునే మా వ్యూహం కారణంగా అదనంగా 4జీ కనెక్షన్లు 64 లక్షల మేర జతయ్యాయి. వినియోగదారు సగటు ఆదాయం (ఆర్పు) రూ.163 నుంచి రూ.193 కు పెరిగిందని, ఇది పరిశ్రమలోనే అత్యధికమ’ని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గోపాల్‌ విత్తల్‌ పేర్కొన్నారు. 2022 సెప్టెంబరు త్రైమాసికంలో ఆర్పు రూ.190గా ఉంది. ‘పోస్ట్‌పెయిడ్‌, ఎంటర్‌ప్రైజ్‌, గృహ, ఆఫ్రికా వ్యాపారాల్లో వృద్ధి కొనసాగుతోంది. ఒత్తిడి ఉన్నా.. డీటీహెచ్‌ వ్యాపారంలోనూ వృద్ధి కనిపిస్తోంద’ని వివరించారు. మొత్తం వ్యయాలు 52% వృద్ధితో రూ.9,313.6 కోట్లకు పెరిగాయి. 5జీ నెట్‌వర్క్‌ కోసం ఇందులో ఎక్కువ వ్యయాలు అయ్యాయి.

2024 మార్చి కల్లా దేశవ్యాప్తంగా 5జీ: వచ్చే ఏడాది మార్చిలోగా దేశంలోని అన్ని పట్టణాలు, కీలక గ్రామాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ తెలిపింది. అంతర్జాతీయంగా కంపెనీ వినియోగదార్ల సంఖ్య 5.8 శాతం పెరిగి 51 కోట్లకు పెరిగింది. ఇందులో 36.92 కోట్ల మంది భారత్‌కు చెందినవారే. మొబైల్‌ వినియోగదార్ల సంఖ్య భారత్‌లో 2.9% పెరిగి 33.22 కోట్లకు చేరుకుంది. డిసెంబరు త్రైమాసికం చివరకు కంపెనీ నికర రుణాలు 32% పెరిగి రూ.1.59 లక్షల కోట్ల నుంచి రూ.2.09 లక్షల కోట్లకు చేరాయి.


డిజిటల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఏర్పాటు

దిల్లీ: డిజిటల్‌ ఫోరెన్సిక్‌ లేబొరేటరీల ఏర్పాటు నిమిత్తం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ), నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్శిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల దర్యాప్తు, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ల విషయంలో డీజీజీఐకు బహుళ ప్రయోజనం ఉండటంతో పాటు.. విచారణను సమర్థంగా చేపట్టేందుకు, నేరంపై తుది నిర్ణయానికి వచ్చే విషయంలోనూ ఉపయోగపడనుందని ఒక అధికారిక ప్రకటన వెల్లడించింది. డీజీజీఐ.. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డులో దర్యాప్తు విభాగం. పన్ను ఎగవేతల నియంత్రణ, నకిలీ రశీదులను పసిగట్టడంలో డేటా అనలటిక్స్‌, సాంకేతికతలను ఇది ఎక్కువగా ఉపయోగించుకుంటుంది.


హీరో మోటోకార్ప్‌ డివిడెండు రూ.65

దిల్లీ: హీరో మోటోకార్ప్‌ డిసెంబరు త్రైమాసికంలో రూ.721.24 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదేకాల లాభం రూ.704.24 కోట్లతో పోలిస్తే ఇది 2.41 శాతం అధికం. ఇదే సమయంలో ఏకీకృత ఆదాయాలు రూ.8,013.08 కోట్ల నుంచి రూ.8,118.33 కోట్లకు చేరుకున్నాయి. సమీక్షా త్రైమాసికంలో 12.4 లక్షల మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను కంపెనీ విక్రయించింది. మొత్తం వ్యయాలు రూ.7217.07 కోట్ల నుంచి రూ.7,372.76 కోట్లకు పెరిగాయి. కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ.65 మధ్యంతర డివిడెండు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ‘మా మార్కెట్‌ వాటాలు పుంజుకోవడం మొదలుపెట్టాయి. వచ్చే కొద్ది త్రైమాసికాల్లో వెలువడే అద్బుత ఆవిష్కరణలతో ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తామ’ని హీరో మోటోకార్ప్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ నిరంజన్‌గుప్తా పేర్కొన్నారు.
2023-24లోనే విద్యుత్‌ స్కూటరు విడా:  ఇటీవల ఆవిష్కరించిన విద్యుత్‌ వాహనం (ఈవీ) విడాను 2023-24లో పలు నగరాల్లో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు గుప్తా తెలిపారు.


కల్యాణ్‌ జువెలర్స్‌ లాభంలో 10% వృద్ధి

ముంబయి: డిసెంబరు త్రైమాసికంలో కల్యాణ్‌ జువెలర్స్‌ ఏకీకృత నికర లాభం రూ.148.43 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదేకాల లాభం రూ.134.52 కోట్లతో పోలిస్తే, ఇది 10.34% అధికం. ఆదాయం  రూ.3,435.39 కోట్ల నుంచి 13.06% వృద్ధితో రూ.3,884.09 కోట్లకు చేరుకుంది. భారత కార్యకలాపాల ఎబిటా రూ.రూ.253 కోట్ల నుంచి రూ.276 కోట్లకు చేరింది. ఇ-కామర్స్‌ విభాగాదాయం రూ.47 కోట్ల నుంచి రూ.44 కోట్లకు తగ్గింది. మధ్య ప్రాచ్య కార్యకలాపాల ఆదాయం 24% పెరిగి రూ.515 కోట్లకు చేరుకుంది. కంపెనీ మొత్తం ఆదాయంలో మధ్య ప్రాచ్య వాటా 16.5 శాతంగా ఉంది. ‘పసిడి ధరలు పెరుగుతున్నా.. ప్రస్తుత పెళ్లిళ్ల సీజను వల్ల అన్ని మార్కెట్లలో బలమైన ఆదాయం నమోదు కావొచ్చ’ని కల్యాణ్‌ జువెలర్స్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రమేశ్‌ కల్యాణరామన్‌ పేర్కొన్నారు. 2023లో 52 కొత్త షోరూములను తెరవనున్నట్లు కంపెనీ ప్రకటించింది.


13% తగ్గిన అదానీ పోర్ట్స్‌ లాభం

దిల్లీ: ప్రస్తు ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.1,336.51 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.1,535.28 కోట్లతో పోలిస్తే ఇది 12.94 శాతం తక్కువ. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.4,713.37 కోట్ల నుంచి రూ.5,051.17 కోట్లకు వృద్ధి చెందింది. మొత్తం వ్యయాలు సైతం రూ.2,924.30 కోట్ల నుంచి రూ.3,507.18 కోట్లకు పెరిగాయి. హైఫా పోర్ట్‌ కంపెనీ (ఇజ్రాయెల్‌), ఐఓటీఎల్‌, ఐసీడీ టంబ్‌, ఓషియన్‌ స్పార్కిల్‌, గంగవరం పోర్ట్‌ స్వాధీనతా లావాదేవీలను కంపెనీ పూర్తి చేసిందని, రవాణా సంస్థగా వ్యాపారాన్ని మార్చే ప్రక్రియ పురోగతిలో ఉందని అదానీ పోర్ట్స్‌ సీఈఓ కరణ్‌ అదానీ పేర్కొన్నారు. 2023-24లో రూ.4000-5000 కోట్ల మూలధన వ్యయాలు చేయడంతో పాటు దాదాపు రూ.5000 కోట్ల రుణాల చెల్లింపులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.  


అంబుజా సిమెంట్స్‌ లాభం రూ.488 కోట్లు

దిల్లీ: అదానీ గ్రూప్‌ సంస్థ అయిన అంబుజా సిమెంట్స్‌ డిసెంబరు త్రైమాసికంలో రూ.487.88 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.430.97 కోట్ల కంటే ఇది 13.2% ఎక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.7625.28 కోట్ల నుంచి 3.69% పెరిగి రూ.7906.74 కోట్లకు చేరింది. వ్యయాలు కూడా రూ.6865.61 కోట్ల నుంచి 6.01% పెరిగి రూ.7278.89 కోట్లకు చేరాయి. స్టాండ్‌అలోన్‌ పద్ధతిలో డిసెంబరు త్రైమాసిక లాభం రూ.252.81 కోట్ల నుంచి రూ.368.99 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.3739.92 కోట్ల నుంచి 10.39% పెరిగి రూ.4128.52 కోట్లుగా నమోదైంది.


ఏపీలో ప్రాజెక్ట్‌ 2023-24లో పూర్తి: సెంచురీ ప్లై

కోల్‌కతా: ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న ఎండీఎఫ్‌ (మీడియం డెన్సిటీ ఫైబర్‌బోర్డ్‌) తయారీ ప్రాజెక్టు 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో పూర్తవుతుందని సెంచురీ ప్లైబోర్డ్స్‌ (ఇండియా) తెలిపింది. కొత్తగా నిర్మిస్తున్న లామినేట్‌ ప్రాజెక్ట్‌ కూడా ఆ సమయంలోనే అందుబాటులోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. డిసెంబరు త్రైమాసికానికి రూ.81.36 కోట్ల సాండ్‌అలోన్‌ నికరలాభాన్ని సంస్థ నమోదు చేసింది. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.97.27 కోట్లతో పోలిస్తే, ఇది 16% తక్కువ.  ఆదాయం రూ.848 కోట్ల నుంచి 3% పెరిగి రూ.877 కోట్లకు చేరింది.


యూపీఐతో రూపే క్రెడిట్‌ కార్డు అనుసంధానం: పేటీఎం

ఈనాడు, హైదరాబాద్‌: వినియోగదారులు సులభంగా చెల్లింపులను పూర్తి చేసేందుకు యూపీఐతో రూపే క్రెడిట్‌ కార్డును జత చేసుకునే వీలు తీసుకొచ్చినట్లు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఇందుకోసం వినియోగదారులు తమ యూపీఐ ఖాతాకు రూపే క్రెడిట్‌ కార్డు వివరాలను జత చేయాలి. ఆ తర్వాత కార్డుతో పనిలేకుండా వ్యాపారుల దగ్గరుండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఇప్పటివరకు డెబిట్‌కార్డు ద్వారానే ఈ లావాదేవీలు చేయగలుగుతున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు