సంక్షిప్త వార్తలు(10)
దేశంలోనే తొలిసారిగా రూపొందించిన విద్యుత్తుతో నడిచే టిప్పర్‌ను, హైదరాబాదీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌లో ప్రదర్శించింది.
ఒలెక్ట్రా విద్యుత్తు టిప్పర్
హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా రూపొందించిన విద్యుత్తుతో నడిచే టిప్పర్‌ను, హైదరాబాదీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌లో ప్రదర్శించింది. నిర్మాణరంగం, గనుల కార్యకలాపాలకు ఇది ఎంతో అనువైనదని సంస్థ తెలిపింది. ఒకసారి ఛార్జింగ్‌తో 150 కిలోమీటర్ల వరకు ఇది ప్రయాణిస్తుందన్నది అంచనా. వచ్చేనెలలోనే ఈ టిప్పర్‌ను విపణిలోకి విడుదల చేయాలన్నది లక్ష్యమని పేర్కొంది. ఒలెక్ట్రా మాతృసంస్థ ఎంఈఐఎల్ తమ ఇతర ఇంధన అనుబంధ సంస్థలైన డ్రిల్‌మెక్ స్పా, పెట్రీవెన్ స్పా, మేఘా సిటీగ్యాస్, ఐకామ్ టెలీ ఉత్పత్తులనూ ఇక్కడ ప్రదర్శించింది.
ఎన్‌సీసీ లాభంలో వృద్ధి
ఈనాడు, హైదరాబాద్: డిసెంబరు త్రైమాసికంలో ఏకీకృత ఖాతాల ప్రకారం ఎన్‌సీసీ రూ.3,903.73 కోట్ల మొత్తం ఆదాయాన్నీ, రూ.157.70 కోట్ల నికర లాభాన్నీ ఆర్జించింది. 2021-22 ఇదే కాలంలో మొత్తం ఆదాయం రూ.3032.84 కోట్లు, నికర లాభం రూ.76.42 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబరులో ఆదాయం రూ.10,659.64 కోట్లు, నికర లాభం రూ.418.34 కోట్లుగా నమోదయ్యాయి. సమీక్షా త్రైమాసికంలో రూ.5,495 కోట్ల ఆర్డర్లు లభించినట్లు ఎన్‌సీసీ తెలిపింది. ప్రస్తుతం చేతిలో మొత్తం రూ.41,862 కోట్ల ఆర్డర్లు ఉన్నట్లు వెల్లడించింది.
97% పెరిగిన పెన్నార్ ఇండస్ట్రీస్ లాభం
హైదరాబాద్: విలువ ఆధారిత ఇంజినీరింగ్ ఉత్పత్తులు, పరిష్కారాలు అందించే పెన్నార్ ఇండస్ట్రీస్ డిసెంబరు త్రైమాసికంలో రూ.21.12 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదేకాల లాభం రూ.10.71 కోట్లతో పోలిస్తే, ఇది 97.19 శాతం ఎక్కువ. టర్నోవర్ 29.88% పెరిగి రూ.692.22 కోట్లకు చేరింది. 2022-23 ఏప్రిల్-డిసెంబరులో నికరలాభం 104.76% వృద్ధితో రూ.51.58 కోట్లకు, టర్నోవర్ 41.53% పెరిగి రూ.2226 కోట్లకు చేరినట్లు వెల్లడించింది.
లిఖితా ఇన్‌ఫ్రా లాభం రూ.15 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికానికి లిఖితా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.84.67 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.15.60 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.65.58 కోట్లు, నికర లాభం రూ.11.25 కోట్లుగా ఉన్నాయి. 2022-23 ఏప్రిల్-డిసెంబరులో రూ.250.90 కోట్ల ఆదాయం, రూ.58.74 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు సంస్థ పేర్కొంది.
15% పెరిగిన పతంజలి ఫుడ్స్ లాభం
హైదరాబాద్: డిసెంబరు త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్ (ఇంతకు ముందు రుచిసోయా ఇండస్ట్రీస్) రూ.269 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదేకాల లాభం రూ.234 కోట్లతో పోలిస్తే ఇది 15% అధికం. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.6,280 కోట్ల నుంచి 26% పెరిగి రూ.7,929 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికంలో వంటనూనెల ధరలు స్థిరీకరించుకుని, కనిష్ఠాల నుంచి పుంజుకున్నట్లు కంపెనీ తెలిపింది.
రుచిసోయా సంస్థను బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద కొనుగోలు చేసి.. పతంజలి ఫుడ్స్‌గా పేరు మార్చింది. రుణరహిత సంస్థగా మారేందుకు గత ఏడాది మార్చిలో కంపెనీ ఎఫ్‌పీఓ ద్వారా రూ.4,300 కోట్లు సమీకరించింది.
మాపై ఎలాంటి ఒత్తిడీ లేదు
రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై జీవీకే గ్రూప్
హైదరాబాద్: ముంబయి విమానాశ్రయంలో వాటాల విక్రయానికి సంబంధించి తమపై ఎవరి ఒత్తిడీ లేదని జీవీకే గ్రూపు స్పష్టం చేసింది. ‘సీబీఐ, ఈడీలను ఉపయోగించి, జీవీకే గ్రూప్ నుంచి ముంబయి విమానాశ్రయాన్ని తీసుకుని, ప్రభుత్వం అదానీకి అప్పగించింది’ అని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో గ్రూపు ఈ వ్యాఖ్యలు చేసింది. ముంబయి విమానాశ్రయంలో వాటాలను అదానీకి విక్రయించాలనే నిర్ణయాన్ని యాజమాన్యం తీసుకుందని, ఈ విషయంలో ఎలాంటి ఇతర ఇబ్బందులూ తమకు లేవని జీవీకే గ్రూపు ప్రతినిధి వెల్లడించారు. విమానాశ్రయం అమ్మకం విషయంలో జరిగిన విషయాలను వివరిస్తూ గ్రూపు వైస్ ఛైర్మన్ సంజయ్ రెడ్డి.. ‘గతంలో ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ విమానాశ్రయ వ్యాపారం కోసం నిధులను సేకరించాలని చూస్తున్నాం అని చెప్పాను. ఈ సమయంలో అదానీ గ్రూపు వ్యవస్థాపకుడు, ఛైర్మన్ గౌతమ్ అదానీ తనకు విమానాశ్రయ వ్యాపారంపై ఆసక్తి ఉందని చెబుతూ మమ్మల్ని సంప్రదించారు. ఒక నెలలోనే లావాదేవీ పూర్తి చేస్తామని చెప్పారు. ఇతర పెట్టుబడిదారుల నుంచి ఎలాంటి ఆశాజనక పరిస్థితులు కనిపించకపోవడంతో రుణదాతలు, కంపెనీ ప్రయోజనాల దృష్ట్యా ఈ ఒప్పందానికి మేము అంగీకరించాం’ అని పేర్కొన్నారు.
అదానీ విల్మర్ లాభంలో 16% వృద్ధి
దిల్లీ: డిసెంబరు త్రైమాసికంలో అదానీ విల్మర్ ఏకీకృత నికర లాభం 15 శాతం వృద్ధితో రూ.246.16 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే కాల లాభం రూ.211.41 కోట్లు. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.14,398.08 కోట్ల నుంచి రూ.15,515.55 కోట్లకు పెరిగింది. ఏప్రిల్- డిసెంబరులో కంపెనీ నికర లాభం రూ.488.51 కోట్లకు పరిమితమైంది. ఏడాది క్రితం ఇదేకాలంలో ఈ మొత్తం రూ.569.45 కోట్లు.
96% తగ్గిన అదానీ పవర్ లాభం
దిల్లీ: అక్టోబరు- డిసెంబరులో అదానీ పవర్ ఏకీకృత నికర లాభం 96% క్షీణించి రూ.8.77 కోట్లకు పరిమితమైంది. 2021-22 ఇదే కాల లాభం రూ.218.49 కోట్లు కావడం గమనార్హం. బొగ్గు దిగుమతి వ్యయాలు పెరగడం వల్లే లాభంలో క్షీణత నమోదైంది. మొత్తం ఆదాయం రూ.5,593.58 కోట్ల నుంచి రూ.8,290.21 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.5,389.24 కోట్ల నుంచి రూ.8,079.31 కోట్లకు పెరిగాయి.
ఎన్‌హెచ్‌పీసీ మధ్యంతర డివిడెండు రూ.1.40
దిల్లీ: అక్టోబరు- డిసెంబరులో ఎన్‌హెచ్‌పీసీ ఏకీకృత పద్ధతిలో రూ.775.99 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదే కాలంలో నమోదైన రూ.887.76 కోట్లతో పోలిస్తే ఈసారి లాభం 12.59 శాతం తగ్గింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.2,373.72 కోట్ల నుంచి రూ.2,691.34 కోట్లకు పెరిగింది. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.1.40 మధ్యంతర డివిడెండుగా కంపెనీ చెల్లించనుంది.
భారత్‌కొచ్చే విదేశీయులకూ యూపీఐ సేవలు
దేశీయంగా రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ దూసుకుపోతోంది. దేశీయ పర్యటనకు వచ్చే విదేశీయులు కూడా వాణిజ్య సంస్థల్లో చెల్లింపులకు(పీ2ఎమ్) యూపీఐ వినియోగించుకునే అనుమతి ఇవ్వాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ముందుగా జి-20 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో ఈ సదుపాయాన్ని ప్రారంభిస్తారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Flight Pilots: విమానంలో ఇద్దరు పైలట్లు ఒకే రకమైన ఆహారం ఎందుకు తీసుకోరు?
-
India News
Antibiotics: కొవిడ్ కేసుల పెరుగుదల వేళ.. యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు
-
Movies News
Amitabh Bachchan: గాయం నుంచి కోలుకున్న అమితాబ్.. సోషల్ మీడియాలో పోస్ట్
-
India News
Anand Mahindra: గతం వదిలేయ్.. భవిష్యత్తుపై హైరానావద్దు.. మహీంద్రా పోస్టు చూడాల్సిందే..!
-
Sports News
WPL: కీలక మ్యాచ్‌లో సత్తాచాటిన యూపీ.. గుజరాత్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపు
-
India News
Delhi Liquor Scam: 8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ