పాలసీదారుల కేసులను తగ్గించేందుకు ప్రయత్నించండి

బీమా పాలసీదారులకు సంబంధించి వినియోగదారుల కోర్టుల్లో ఉన్న కేసులను తగ్గించేందుకు ఐఆర్‌డీఏఐ, బీమా సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

Published : 09 Feb 2023 02:35 IST

ఐఆర్‌డీఏఐ, బీమా సంస్థలకు ప్రభుత్వ సూచన

దిల్లీ: బీమా పాలసీదారులకు సంబంధించి వినియోగదారుల కోర్టుల్లో ఉన్న కేసులను తగ్గించేందుకు ఐఆర్‌డీఏఐ, బీమా సంస్థలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రధానంగా బీమా ఒప్పందాల్లో ఉన్న అస్పష్టత, నిబంధనల కారణంగా పలు కేసులు దాఖలవుతున్న విషయాన్ని  ప్రస్తావించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వినియోగారుల ఫిర్యాదులలో ఐదింట ఒక వంతు కంటే ఎక్కువ బీమా రంగానికే చెందినవని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్‌ సింగ్‌ ఇక్కడ జరిగిన ఒక సదస్సులో తెలిపారు. కోర్టు వెలుపల పరిష్కారం విషయంలో బీమా సంస్థల ప్రతినిధులకు అధికారాలు లేకపోవడం, పాలసీపై సంతకం చేసే సమయంలో బీమా ఏజెంట్లు పూర్తి పాలసీ పత్రాలను వినియోగదారులతో పంచుకోకపోవడం, క్లెయింలను తిరస్కరించడం వంటివి కీలక సమస్యలుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న వ్యాధుల విషయంలోనూ చిక్కులు ఎదురవుతున్నాయన్నారు. పంటల బీమా వంటి కేంద్ర ప్రభుత్వ పథకంలోనూ క్లెయింల విషయంలో ఇబ్బందులున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ నియంత్రణ సంస్థతోపాటు, ఇతర భాగస్వాముల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బీమా రంగం 8 శాతం విస్తరించాలనే లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో ఫిర్యాదులు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉందన్నారు. బీమా పాలసీల నిబంధనలు, షరతులను సరళంగా ఉంచడంతోపాటు, అర్థమయ్యే భాషలో రూపొందించాలని తెలిపారు. దీనివల్ల కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాలసీని అర్థం చేసుకున్నాకే, సంతకం చేసేలా వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. దేశ వ్యాప్తంగా వినియోగదారుల కోర్టుల్లో ఉన్న పెండింగ్‌లో ఉన్న 5.53 లక్షల కేసుల్లో దాదాపు 1.61 లక్షల కేసులు బీమా రంగానికి చెందినవే ఉన్నాయని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా చాలా వరకూ కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉందని, ఈ దిశగా ప్రయత్నాలు చేయాలని కోరుతున్నట్లు బీమా సంస్థలను కోరినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని