భారత్‌ నుంచి 1700 విమానాలకు ఆర్డర్లు!

భారత విమానయాన కంపెనీలు వచ్చే ఒకట్రెండేళ్లలో 1500 నుంచి 1700 వరకు విమానాలకు ఆర్డర్లు పెట్టే అవకాశం ఉందని విమానయాన కన్సల్టెన్సీ కాపా అంచనా వేస్తోంది.

Updated : 09 Feb 2023 03:02 IST

వచ్చే 1-2 ఏళ్లలోనే: కాపా అంచనా

ముంబయి: భారత విమానయాన కంపెనీలు వచ్చే ఒకట్రెండేళ్లలో 1500 నుంచి 1700 వరకు విమానాలకు ఆర్డర్లు పెట్టే అవకాశం ఉందని విమానయాన కన్సల్టెన్సీ కాపా అంచనా వేస్తోంది. ఎయిరిండియా ఒక్కటే 500 విమానాల వరకు ఆర్డరు పెట్టవచ్చని బుధవారం పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద విమానయాన కంపెనీలతో పోలిస్తే, భారత్‌లోని మొత్తం వాణిజ్య విమానాల సంఖ్య (సుమారు 700) తక్కువేనని కాపా గుర్తు చేసింది. మరిన్ని విమానాలను తెచ్చుకునే సామర్థ్యం, అవసరాలు కూడా భారత కంపెనీలకు ఉందని కాపా పేర్కొంది.  

కరోనా అనంతరం అత్యంత ఆకర్షణీయ విమానయాన మార్కెట్‌గా అంతర్జాతీయ దృష్టిని భారత్‌ ఆకర్షిస్తోంది. ప్రతి విమానయాన కంపెనీ వచ్చే కొన్నేళ్లలో మరిన్ని విమానాలకు ఆర్డరు చేయొచ్చని అంచనా. వచ్చే దశాబ్ద కాలంలో వృద్ధిని దృష్టిలో పెట్టుకుని అవి ఆ పనిచేస్తాయి.

విమానయాన రద్దీ పుంజుకునే విషయంలో ప్రపంచంలోనే భారత్‌ అత్యంత బలమైనదిగా ఉంది. వచ్చే 10 ఏళ్లలో భారత విమానయాన రద్దీ అంచనాలు, ఇపుడున్న విమానాల వయసును దృష్టిలో పెట్టుకుని వచ్చే 12-24  నెలల్లో 1500-1700 విమానాలకు భారత కంపెనీలు ఆర్డరు పెట్టే అవకాశం ఉంది.
* భారత్‌లో విమానాశ్రయాల మౌలిక వసతుల అభివృద్ధి కొనసాగుతోంది. అంతర్జాతీయ విమానయాన మార్కెట్లోనూ పటిష్ఠ స్థానాన్ని సాధించేందుకు సిద్ధమవుతోంది.

ఎయిర్‌బస్‌, బోయింగ్‌లకు ఎయిరిండియా 500 వరకు విమానాలకు ఆర్డరు ఇవ్వొచ్చు. ఈ ఆర్డరు  అనంతరం ఇండిగో తన విమానాల సంఖ్యను 500 నుంచి 1300కు పెంచుకోవచ్చు. కరోనాకు ముందు వరకు ఈ కంపెనీ 300 విమానాలను కొనుగోలు చేయాలని భావిస్తూ వచ్చింది. కరోనా పరిణామాలతో ఆ ప్రణాళికను వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని