ఇంజినీరింగ్‌ విద్యార్థులకు కోడింగ్‌ నేర్పిస్తాం

దేశంలో ఏటా పదిహేను లక్షలకు పైగా విద్యార్థులు ఇంజినీరింగ్‌ విద్యను పూర్తి చేసుకుంటున్నారు. కానీ, డిగ్రీ పూర్తికాగానే ఉద్యోగాల్లో చేరుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.

Updated : 12 Feb 2023 12:00 IST

ఈనాడు - హైదరాబాద్‌

దేశంలో ఏటా పదిహేను లక్షలకు పైగా విద్యార్థులు ఇంజినీరింగ్‌ విద్యను పూర్తి చేసుకుంటున్నారు. కానీ, డిగ్రీ పూర్తికాగానే ఉద్యోగాల్లో చేరుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. చాలామంది పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు లేక వెనుకబడిపోతున్నారు. ఒక నివేదిక ప్రకారం 95 శాతం మంది కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకు సాఫ్ట్‌వేర్‌ కొలువులో చేరడానికి అవసరమైన కోడింగ్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ పరిజ్ఞానం సరిగా ఉండటం లేదు. ఇంజినీరింగ్‌లో చేరినప్పటి నుంచే ఈ విషయంపై దృష్టి సారించి, అవసరమైన అంశాలన్నీ నేర్పిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన నుంచి పుట్టిన అంకురమే మెరిట్‌కర్వ్‌. కళాశాల స్థాయిలోనే విద్యార్థులకు తగిన శిక్షణ ఇవ్వడమే తమ పని అని వివరిస్తున్నారు ఈ సంస్థ వ్యవస్థాపకుడు కె.ప్రశాంత్‌రెడ్డి.

‘మాది ఖమ్మం. ఇంటర్మీడియట్‌ వరకూ అక్కడే చదివాను. చిన్నప్పటి నుంచీ కంప్యూటర్‌ సైన్స్‌ అంటే ఇష్టం. ఇంజినీరింగ్‌ బెంగళూరులోని ఒక కాలేజీలో చేరాను. ఆ సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు విద్యార్థులను గమనించేవాడిని. కొంతమందికి కోడింగ్‌ నైపుణ్యాలు ఉంటే, మరికొంతమంది వెనకబడే వారు. ఇరవై ఏళ్ల క్రితం బోర్డుపై నేర్పినట్లుగా ఇప్పుడూ కోడింగ్‌ నేర్పిస్తే ఫలితం ఉండదు. ఐటీ సంస్థల అవసరాలను గుర్తించి, అందుకు అనుగుణంగా ఉండాలని ఆలోచన ఉండేది. దీనికి పరిష్కారాన్ని వెతుకుతూనే ఎంఎన్‌సీలో ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో డెవలపర్స్‌ సర్కిల్స్‌లో భాగమయ్యాను. పలు అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నాను. కోడింగ్‌లో శిక్షణ ఇచ్చేలా సొంతంగా సంస్థను స్థాపించాలనే లక్ష్యంతో ఇటువైపు అడుగులు వేశాను. 2020లో నా ఆలోచనను ఆచరణలో పెట్టాను. బెంగళూరులో ప్రారంభించినప్పటికీ, 2022 నుంచి టి-హబ్‌కు మారిపోయాం.

ఏం చేస్తామంటే..

ఇంజినీరింగ్‌ కాలేజీలతో భాగస్వామ్యం కుదుర్చుకొని, ప్లాట్‌ఫాం యాజ్‌ ఏ సర్వీస్‌ (పాస్‌) విధానంలో విద్యార్థులకు కోడింగ్‌ నేర్పిస్తాం. దీనికోసం మొదటి ఏడాది నుంచే విద్యార్థులను మా ప్లాట్‌ఫాంపైకి తీసుకొస్తాం. కొవిడ్‌ సమయంలో ఎడ్యుటెక్‌ సంస్థలు బాగా పనిచేశాయి. ఇది మాకూ ఒక రకంగా కలిసొచ్చిందనే చెప్పాలి. బ్లాక్‌ బోర్డు నుంచి ఆన్‌లైన్‌లోకి కోడింగ్‌ శిక్షణను తీసుకొచ్చేందుకు ఉపయోగపడింది. ఒక విద్యార్థికి కోడింగ్‌ నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ మెరుగుపర్చుకోవాలి అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంటాం. 100కు పైగా సమస్యలను పరిష్కరించేలా వారికి శిక్షణ ఉంటుంది. దీనివల్ల వారు కోడింగ్‌లో రాటుదేలుతారు. కృత్రిమ మేధ వారి నైపుణ్యాలను గమనిస్తూ ఉంటుంది. 

ఇప్పటి వరకూ..

ప్రస్తుతం మేము 12 ఇంజినీరింగ్‌ కాలేజీలతో ఒప్పందం కుదుర్చుకొని, సేవలను అందిస్తున్నాం. ఇలా ఏడాదికి 1,500 మందికి పైగా కొత్త విద్యార్థులు మా ప్లాట్‌ఫాంను వినియోగించుకుంటున్నారు. టి-హబ్‌తో కలిసి ఇంటర్న్‌షిప్‌ మేళాను నిర్వహించాం. రెండు విడతల్లో జరిగిన ఈ కార్యక్రమంలో 80కి పైగా విద్యాసంస్థల నుంచి 5,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 200 స్టార్టప్‌లు వీరిలో కొందరికి ఉద్యోగాలు ఇస్తామని ముందుకు వచ్చాయి.

రెండేళ్లలో 60,000 మందికి..

ఈ ఏడాదిలో కొత్తగా 20 కాలేజీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటాం. 2025 నాటికి 60వేల మంది విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించాలన్నది మా ఆలోచన. ఇప్పుడు 11 మంది ఉన్న మా బృందంలో కొత్తగా మరో 10 మందినీ తీసుకుంటాం. ప్రస్తుతానికి సొంత నిధులు, వస్తున్న ఆదాయంతోనే మా సంస్థ నడుస్తోంది. మా అంచనాలు అందుకున్న తర్వాత పెట్టుబడుల కోసం వెళ్తాం. దేశంలోని ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో 5శాతం మందికి మా ద్వారా శిక్షణ అందాలన్నదే మా లక్ష్యం.’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని