కొత్త పన్ను విధానంతో మధ్య తరగతికి లబ్ధి

కొత్త పన్ను విధానంతో మధ్య తరగతికి లబ్ధి చేకూరుతుందని, వారి చేతుల్లో మరింత నగదు మిగులుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

Updated : 12 Feb 2023 10:34 IST

‘అదానీ’ అంశం నియంత్రణ సంస్థల చేతుల్లో
సుప్రీంలో ప్రభుత్వం ఏం చెప్పిందన్నది వెల్లడించం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: కొత్త పన్ను విధానంతో మధ్య తరగతికి లబ్ధి చేకూరుతుందని, వారి చేతుల్లో మరింత నగదు మిగులుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. బడ్జెట్‌ అనంతరం ఆర్‌బీఐ కేంద్ర బోర్డుకు ఇచ్చిన ప్రసంగం తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాల్లో ప్రజలతో పెట్టుబడులు పెట్టించాల్సిన అవసరం లేదని, పెట్టుబడుల విషయంలో వ్యక్తిగత నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ‘బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలోనూ స్టాండర్డ్‌ డిడక్షన్‌ను ప్రతిపాదించాం. ఇదే సమయంలో శ్లాబ్‌లు, పన్ను రేట్లలో మార్పులు చేశాం. దీంతో పన్ను చెల్లింపుదార్లకు మరింత లబ్ధి చేకూరనుంది. పెట్టుబడులు, వ్యయాల విషయంలో సంపాదించే వ్యక్తులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి’ అని అన్నారు. కొత్త పన్ను చెల్లింపు విధానంలో రూ.7 లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు ప్రకటించారు. మధ్య తరగతిపై పన్ను భారం తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ప్రత్యక్ష పన్నులను సులభతరం చేస్తామని ఇచ్చిన హామీ అనుగుణంగా చేపట్టామని వివరించారు. 2023-24లో రిటైల్‌ ద్రవ్యోల్బణం దాదాపు 5.3 శాతంగా నమోదుకావొచ్చని, ముడి చమురు ధరలు ఇదే విధంగా ఉంటే మరింత తగ్గొచ్చని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంచనాకు బ్యారెల్‌ ముడిచమురును 95 డాలర్లుగా లెక్కకట్టామని తెలిపారు. రుణ, డిపాజిట్‌ రేట్లపై బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. రుణ మంజూరు, జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు నేషనల్‌ ఫైనాన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ రిజిస్ట్రీ (ఎన్‌ఎఫ్‌ఐఆర్‌)ను తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.

క్రిప్టో నియంత్రణపై జీ20 సమావేశాల్లో చర్చ

క్రిప్టో కరెన్సీ ఆస్తుల నియంత్రణ అంశాన్ని జీ20 సమావేశాల్లో చర్చిస్తామని, ఈ విషయంలో అందరూ కలిసి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్‌ అన్నారు. ‘క్రిప్టో అనేది పూర్తి టెక్నాలజీ ఆధారితమైనది. మానవ ప్రమేయానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. కేవలం ఒక్కదేశం నిబంధనలు రూపొందించలేదు కాబట్టి అన్ని దేశాలు సంయుక్తంగా నియమావళిని తీసుకురావాల్సి ఉంది. స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) రూపకల్పనపై చర్చించనున్నాం’ అని తెలిపారు.
నియంత్రణ సంస్థలే చూసుకుంటాయ్‌: అదానీ గ్రూప్‌ సంక్షోభానికి సంబంధించి విషయాన్ని నియంత్రణ సంస్థలు చూసుకుంటాయని, మన నియంత్రణ సంస్థలు చాలా అనుభవం కలిగినవని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. అదానీ గ్రూప్‌ షేర్ల పతనం అనంతరం సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘కోర్టులో ప్రభుత్వం ఏం చెప్పిందో నేను వెల్లడించలేను. భారత నియంత్రణ సంస్థలకు చాలా అనుభవం ఉంది. ప్రస్తుతం అదానీ అంశాలను అవి పర్యవేక్షిస్తున్నాయ’ని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు