Salaries: వేతనాలు 10.3% పెరుగుతాయ్‌.. అయాన్‌ పీఎల్‌సీ సర్వే అంచనా

దేశంలో ఈ ఏడాది వేతనాలు  10.3% పెరిగే అవకాశం ఉందని అయాన్‌ పీఎల్‌సీ సర్వే అంచనా వేసింది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ఆసియా దేశాల కంటే ఇక్కడే వేతన పెరుగుదల ఎక్కువగా ఉంటుందని తేల్చింది.

Published : 24 Feb 2023 09:19 IST

ముంబయి: దేశంలో ఈ ఏడాది వేతనాలు  10.3% పెరిగే అవకాశం ఉందని అయాన్‌ పీఎల్‌సీ సర్వే అంచనా వేసింది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ఆసియా దేశాల కంటే ఇక్కడే వేతన పెరుగుదల ఎక్కువగా ఉంటుందని తేల్చింది. 2022లో దేశీయంగా వేతనాలు సగటున 10.6% పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది. ‘అయాన్‌ పీఎల్‌సీ 28వ వార్షిక వేతన పెంపు 2023 సర్వే’ ప్రకారం.. ఆర్థిక ఒడుదొడుకులు ఉన్నా ఉద్యోగ అధిక వలసలు ఉంటున్నందున, వేతన పెంపు రెండంకెల స్థాయిలో నమోదు కావచ్చు. 2022లో దేశంలో వలసల రేటు 21.4 శాతంగా నమోదైంది.

ప్రతిభావంతుల లభ్యత -గిరాకీ మధ్య వ్యత్యాసం అధికంగా ఉన్నందున, ఈ ఏడాది కూడా వలసల రేటు ఎక్కువగా ఉండొచ్చని సర్వే తేల్చింది. అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక అనిశ్చితులున్నా, భారతీయ కంపెనీలు ప్రతిభావంతులను చేర్చుకోవడంపై ఆసక్తిగా ఉన్నందున, రెండంకెల ఇంక్రిమెంట్లు సాధ్యమేనని పేర్కొంది. ప్రతిభావంతుల కోసం కంపెనీలు వ్యయాలు పెంచుతున్నాయని అయాన్‌ డైరెక్టర్‌ అండ్‌ ఇండియా ప్రాక్టీస్‌ లీడర్‌, ఎగ్జిక్యూటివ్‌ కాంపెన్సేషన్‌ అండ్‌ గవర్నెన్స్‌ ప్రీతీష్‌ గాంధీ వెల్లడించారు.
* 40కి పైగా రంగాల్లోని 1,400 కంపెనీల ప్రతినిధుల నుంచి సేకరించిన వివరాలతో ఈ నివేదిక రూపొందించినట్లు అయాన్‌ పీఎల్‌సీ వెల్లడించింది. ఇతర ఆర్థిక వ్యవస్థల్లో వేతన వృద్ధిపై అంచనాలు వెలువరించింది.
* ఇ-కామర్స్‌ సంస్థలు 12.2%, వృత్తి సేవలు అందించే సంస్థలు 11.2%, లైఫ్‌సైన్సెస్‌-రిటైల్‌ 9.7% మేర వేతనాలు పెంచొచ్చని సర్వే పేర్కొంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని