ఉద్యోగుల స్థానాన్ని చాట్‌జీపీటీ భర్తీ చేయలేదు

చాట్‌జీపీటీ వంటి ఉత్పాదక కృత్రిమ మేధ (ఏఐ) ప్లాట్‌ఫామ్‌లు ఉద్యోగుల స్థానాన్ని  భర్తీ చేయలేవని.. అవి కేవలం ‘ఏఐ సహ-ఉద్యోగి’గా వ్యవహరిస్తాయని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) పేర్కొంది.

Published : 27 Feb 2023 02:43 IST

టీసీఎస్‌ సీహెచ్‌ఆర్‌ఓ మిలింద్‌ లక్కడ్‌

ముంబయి: చాట్‌జీపీటీ వంటి ఉత్పాదక కృత్రిమ మేధ (ఏఐ) ప్లాట్‌ఫామ్‌లు ఉద్యోగుల స్థానాన్ని  భర్తీ చేయలేవని.. అవి కేవలం ‘ఏఐ సహ-ఉద్యోగి’గా వ్యవహరిస్తాయని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) పేర్కొంది. ఉత్పాదకతను మెరుగుపర్చుకునేందుకు చాట్‌జీపీటీ వంటి టూల్స్‌ వినియోగించవచ్చని, అయితే కంపెనీల వ్యాపార నమూనాలే మార్చడానికి పనికి రావని.. 6 లక్షల మందికి పైగా ఉద్యోగులున్న టీసీఎస్‌ ముఖ్య మానవ వనరుల అధికారి (సీహెచ్‌ఆర్‌ఓ) మిలింద్‌ లక్కడ్‌ తేల్చి చెప్పారు. ‘జనరేటివ్‌ ఏఐ అనేది సహ ఉద్యోగిగా మాత్రమే ఉండగలదు. ఖాతాదారును అర్థం చేసుకోవడానికి దీనికి సమయం పడుతుంది. ఈ క్రమంలో ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేస్తాయని కాదు గానీ ఉద్యోగ నిర్వచనాలు మారతాయ’ని మిలింద్‌ తెలిపారు. అయితే భవిష్యత్‌ కోసం చాట్‌జీపీటీ మంచిదేనని.. ఇది ఉద్యోగులకూ సహకారంగానే ఉంటుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో ఇటువంటి ప్లాట్‌ఫామ్‌ల పనితీరుకు సంబంధించి పూర్తి స్పష్టత వస్తుందని అభిప్రాయపడ్డారు. పదాలు, ఇమేజ్‌లు, ఆడియో, సింథటిక్‌ డేటా (కృత్రిమ సమాచారం)ను ఉత్పత్తి చేసే ఒక రకమైన కృత్రిమ మేధనే జనరేటివ్‌     ఏఐగా పరిగణిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని