Vedanta: అప్పుల ఒత్తిళ్లలో అనిల్‌ అగర్వాల్‌.. ఇంకో తుపాను రావొచ్చంటున్న ఎస్‌ అండ్‌ పీ

ఒక్క నెల రోజుల్లోనే 236 బిలియన్‌ డాలర్ల గౌతమ్‌ అదానీ సామ్రాజ్యం కాస్తా అయిదింట మూడొంతులను కోల్పోయింది. అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటు.. అంత కంటే వేగంతో సంపదను కోల్పోయిన కారణంగా అదానీ, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఆందోళనకు కారణమయ్యారు.

Updated : 28 Feb 2023 08:34 IST

కొత్త రుణాలు పుట్టడమే కీలకం
హిందుస్థాన్‌ జింక్‌ నుంచి నగదు వచ్చినా సరే

ఒక్క నెల రోజుల్లోనే 236 బిలియన్‌ డాలర్ల గౌతమ్‌ అదానీ సామ్రాజ్యం కాస్తా అయిదింట మూడొంతులను కోల్పోయింది. అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటు.. అంత కంటే వేగంతో సంపదను కోల్పోయిన కారణంగా అదానీ, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఆందోళనకు కారణమయ్యారు.  ఇంకో భారతీయ కుబేరుడు, వేదాంతా అధిపతి అనిల్‌ అగర్వాల్‌ కూడా మార్కెట్లలో చిన్న తుపానును సృష్టించే అవకాశం ఉందని అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే దిగ్గజ విశ్లేషణా సంస్థ ఎస్‌ అండ్‌ పీ హెచ్చరించింది.

ఒకప్పుడు లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో నమోదైన వేదాంతా రిసోర్సెస్‌కు ఈయన అధిపతి. ఆ కంపెనీ ప్రస్తుతం రుణాల ఊబిలో చిక్కుకుంది. వచ్చే జనవరిలో 100 కోట్ల డాలర్ల బాండ్లకు గడువు తీరనుంది. అయితే తనకున్న రుణాలను ఈ కంపెనీ క్రమంగా తగ్గించుకుంటూ వస్తోంది. గత 11 నెలల్లో నికర అప్పులను 2 బిలియన్‌ డాలర్లు తగ్గించుకుని, 7.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.64,000 కోట్ల)కు పరిమితం చేసుకుంది. 2023 సెప్టెంబరు వరకు, ఈ సంస్థ చెల్లించాల్సిన రుణాలకు ఇబ్బందేమీ ఉండబోదనీ ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ ఇంక్‌ భిప్రాయపడింది. అయితే ఈ ఏడాది సెప్టెంబరు నుంచి 2024 జనవరి వరకు తీర్చాల్సిన రుణ, బాండ్ల కోసం 150 కోట్ల డాలర్ల (సుమారు రూ.12,450 కోట్ల) నిధుల సమీకరణ కోసం అగర్వాల్‌ చేస్తున్న ప్రయత్నాలకు ఎదురవుతున్న అడ్డంకులే ఆందోళన కరమని తెలిపింది.

వచ్చే కొద్ది వారాలు కీలకం..

‘అనిల్‌ అగర్వాల్‌ నిధుల సమీకరణకు వచ్చే కొద్ది వారాలు కీలకం కావొచ్చు. ఒక వేళ అందులో విఫలమైతే మాత్రం ఇప్పటికే ‘బి-’ క్రెడిట్‌ రేటింగ్‌లో ఉన్న బాండ్లు కాస్తా మరీ ఒత్తిడిలోకి వెళతాయ’ని ఎస్‌ అండ్‌ పీ ఈ నెలలోనే హెచ్చరించింది. అదానీకున్న 24 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.1.99 లక్షల కోట్ల) రుణంతో పోలిస్తే అగర్వాల్‌ అప్పులు మూడో వంతే అయినప్పటికీ.. ఈయన బాండ్ల రేటింగ్‌ మరీ తక్కువగా ఉండడమే ఆందోళన కలిగించే అంశం.

హిందుస్థాన్‌ జింక్‌ కాపాడుతుందనుకుంటే..

భారత ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్థాన్‌ జింక్‌లో తన వాటాను రెండు దశాబ్దాల కిందటి నుంచే అగర్వాల్‌ పెంచుకుంటూ వెళ్లారు. హిందుస్థాన్‌ జింక్‌లో అంతక్రితంతో పోల్చితే తగ్గినా.. 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.16,600 కోట్ల)వరకు నగదు నిల్వలున్నాయి. ప్రతి త్రైమాసికంలో ఈ కంపెనీ 300-600 మి. డాలర్ల ఎబిటాను అందిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీలో వేదాంతా లిమిటెడ్‌కు 65 శాతం వాటా ఉంది. ఈ ఏడాది జనవరిలో టీహెచ్‌ఎల్‌ జింక్‌ మారిషస్‌ వాటాను, హిందుస్థాన్‌ జింక్‌కు విక్రయించాలని వేదాంతా నిర్ణయించింది. అందుకు కారణం లేకపోలేదు. వేదాంతాలో 70 శాతం వాటా వేదాంతా రిసోర్సెస్‌దే కావడం వల్ల ఈ ఒప్పందం ద్వారా 3 బిలియన్‌ డాలర్ల రుణాలను తగ్గించుకుందామని భావించారు. అయితే హిందుస్థాన్‌ జింక్‌లో ఇంకా 30% వాటా ఉన్న కేంద్రం మాత్రం అందుకు అంగీకరించలేదు. ఒక వేళ తమ మాట కాదని ముందుకెళితే చట్టపర చర్యలు తీసుకుంటామని ఈ నెల 17న రాసిన ఒక లేఖలో హెచ్చరించింది కూడా. మారిషస్‌ వాటా విలువపై తమకు అనుమానాలున్నాయని కేంద్రం పేర్కొంది.

ఇపుడు అగర్వాల్‌ ముందు రెండు సమస్యలు..

అనిల్‌ అగర్వాల్‌ ముందు ఇపుడు రెండు సమస్యలున్నాయి. హిందుస్థాన్‌ జింక్‌ వద్ద ఉన్న నగదు నిల్వలను వినియోగించుకోకపోతే తన రుణ సామర్థ్యం తగ్గుతుంది. అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సి ఉంటుంది. అమెరికాలోనూ తక్కువ వడ్డీకి తాజాగా అప్పులు పుట్టడం కష్టమే.

ఇక రెండో సమస్య రాజకీయపరమైనది. ఆస్తుల విక్రయానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే.. దేశీయంగా గుజరాత్‌లో, ఫాక్స్‌కాన్‌తో కలిసి అనిల్‌ అగర్వాల్‌ 19 బిలియన్‌ డాలర్లతో ఏర్పాటు చేస్తున్న సెమీకండక్టర్‌ ఫ్యాక్టరీపై నీలినీడలు ప్రసరించవచ్చు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ప్రతిపక్ష రాజకీయనాయకులు గుర్రుగా ఉన్నారు. ప్రాజెక్టును మహరాష్ట్ర నుంచి మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు మార్చడమే ఇందుకు కారణం. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలూ ఉన్నాయి. రఘురామ్‌రాజన్‌ వంటి ఆర్థివేత్తలు సైతం చిప్‌తయారీలో వేదాంతాకున్న అనుభవాన్ని ప్రశ్నించడం ప్రతికూలంగా మారుతోంది.

ఏడేళ్ల కిందటా ఇదే సమస్య

అగర్వాల్‌కు ఇదే సమస్య ఏడేళ్ల కిందటా ఎదురైనప్పటికీ.. హిందుస్థాన్‌ జింక్‌ ఇచ్చిన ప్రత్యేక డివిడెండుతో గట్టెక్కారు. ఆ సమయంలో కంపెనీ వద్ద 5 బి. డాలర్ల వరకు నగుదు నిల్వలున్నాయి. మైనారిటీ వాటాదారుగా ఆర్థిక మంత్రిత్వశాఖకూ తన వాటా దక్కింది. ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అగర్వాల్‌కు అప్పుపుట్టడం కష్టంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని