Adani Group: 4 కంపెనీల్లో అదానీ వాటాల విక్రయం

Adani Group: అమెరికా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ జీక్యూజీ పార్టనర్స్‌కు తన నాలుగు నమోదిత సంస్థల్లో మైనారిటీ వాటాలను రూ.15,446 కోట్లకు విక్రయించినట్లు అదానీ గ్రూప్‌ ప్రకటించింది.

Updated : 03 Mar 2023 10:11 IST

రూ.15,446 కోట్లకు కొనుగోలు చేసిన జీక్యూజీ పార్టనర్స్‌

దిల్లీ: అమెరికా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ జీక్యూజీ పార్టనర్స్‌కు తన నాలుగు నమోదిత సంస్థల్లో మైనారిటీ వాటాలను రూ.15,446 కోట్లకు విక్రయించినట్లు అదానీ గ్రూప్‌ (Adani Group) ప్రకటించింది. షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంస్థ, రాబోయే నెలల్లో 2 బిలియన్‌ డాలర్ల రుణాల చెల్లింపునకు నిధులు సమకూర్చుకుంటోంది. గురువారం సెకండరీ మార్కెట్‌ బ్లాక్‌ లావాదేవీల ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీల్లో వాటాలను అదానీ గ్రూప్‌ (Adani Group) విక్రయించింది. తాజా పెట్టుబడులతో భారత మౌలిక సదుపాయాల వృద్ధిలో కీలక పెట్టుబడిదారుగా జీక్యూజీ నిలిచినట్లు వెల్లడించింది.

ఎందుకంటే..: హిండెన్‌బర్గ్‌ నివేదికతో 140 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.11.5 లక్షల కోట్లు)కు పైగా మార్కెట్‌ విలువను కోల్పోయిన గ్రూప్‌.. పుంజుకునే వ్యూహంలో భాగంగా వాటా విక్రయం చేపట్టినట్లు తెలుస్తోంది. రుణాల చెల్లింపు ద్వారా మదుపర్లలో విశ్వాసం నింపాలని భావిస్తోంది.

ప్రస్తుతం గ్రూప్‌నకు స్థూల రుణభారం రూ.2.21 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో 8 శాతాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి చెల్లించాల్సి ఉంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రమోటర్లకు 72.6% వాటా ఉండగా.. ఇందులో 3.39% వాటాను విక్రయించారు. అదానీ పోర్ట్స్‌లో ఉన్న 66 శాతం ప్రమోటరు వాటాలో 4.1% వాటాను అమ్మేశారు.

అదానీ ట్రాన్స్‌మిషన్‌లో ఉన్న 73.9% వాటాలో 2.5 శాతాన్ని, అదానీ గ్రీన్‌లో ఉన్న 60.5 శాతం వాటాలో 3.5 శాతాన్ని గురువారం విక్రయించారు. ఈ లావాదేవీకి బ్రోకర్‌గా జెఫ్రీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవహరించింది.

అదానీ కంపెనీల్లో వాటాల కొనుగోలుపై జీక్యూజీ పార్టనర్స్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ జైన్‌ హర్షం వ్యక్తం చేశారు. తాజా లావాదేవీతో అంతర్జాతీయ వినియోగదారుల్లో విశ్వాసం కొనసాగుతున్నట్లు స్పష్టమైందని అదానీ గ్రూప్‌ సీఎఫ్‌ఓ జుగేషిందర్‌ సింగ్‌ తెలిపారు.

క్రమంగా పెరుగుతున్న అదానీ గ్రూప్‌ విలువ: అదానీ గ్రూప్‌ షేర్ల లాభాలు కొనసాగాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌ 5%, అదానీ గ్రీన్‌ 4.99%, అదానీ విల్మర్‌ 4.99%, అదానీ పవర్‌ 4.98%, ఎన్‌డీటీవీ  4.96%, అంబుజా సిమెంట్స్‌ 4.94%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 4.41%, అదానీ పోర్ట్స్‌ 3.50%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 2.69%, ఏసీసీ 1.50% చొప్పున లాభాలు నమోదుచేశాయి. దీంతో అదానీ గ్రూప్‌ మొత్తం మార్కెట్‌ విలువ రూ.7.86 లక్షల కోట్లకు చేరింది. గత రెండు సెషన్లలోనే వీటి విలువ రూ.74,302.47 కోట్లు పెరిగింది.

అదానీ గ్రూప్‌పై గౌరవం ఉంది.. ఆస్ట్రేలియా మాజీ ప్రధాని: అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీపై తమకు చాలా అభిమానం ఉందని, ఆయన కంపెనీలను గౌరవిస్తామని ఆస్ట్రేలియా మాజీ ప్రధాన మంత్రి టోనీ అబాట్‌ పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణల అంశాన్ని నియంత్రణ సంస్థలు చూసుకుంటాయని అన్నారు. 

* రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో 700 మెగావాట్‌ హైబ్రిడ్‌ శుద్ధ ఇంధన ప్రాజెక్ట్‌ కార్యకలాపాలు ప్రారంభించినట్లు అదానీ గ్రీన్‌ వెల్లడించింది. దీంతో కంపెనీ మొత్తం నిర్వహణలోని పునరుత్పాదక పోర్ట్‌ఫోలియో 8024 మెగావాట్‌లకు చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని