ఫండ్‌ పొదుపులో ‘నారి’ .. నిర్వహణలో కానరాదేమి?

‘భారతీయ మహిళలు స్వతహాగా పొదుపరులు. ఇంటి ఆర్థిక నిర్వహణలో వారిది అందెవేసిన చేయి’ అని ఎన్నో సర్వేలు తేల్చి చెప్పాయి. అయినా ఆర్థిక సేవల సంస్థల నిర్వహణకు వచ్చేసరికి మహిళల సంఖ్య పరిమితంగా ఉంటోంది.

Published : 08 Mar 2023 03:39 IST

సేవల రంగంలో మహిళలకు అరకొర ప్రాధాన్యం

ఈనాడు, హైదరాబాద్‌: ‘భారతీయ మహిళలు స్వతహాగా పొదుపరులు. ఇంటి ఆర్థిక నిర్వహణలో వారిది అందెవేసిన చేయి’ అని ఎన్నో సర్వేలు తేల్చి చెప్పాయి. అయినా ఆర్థిక సేవల సంస్థల నిర్వహణకు వచ్చేసరికి మహిళల సంఖ్య పరిమితంగా ఉంటోంది. బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్లు, బీమా సంస్థల్లో పురుషులే ఎక్కువగా ఎండీ, సీఈఓలుగా ఉండటమే ఇందుకు నిదర్శనం.

ఫండ్‌ మేనేజర్లలో 10% లోపే

మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్‌ పర్సన్‌గా మాధవీ పురి బచ్‌ ఉన్నారు. ఎడిల్‌వైజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈఓగా రాధికా గుప్తా (33) వ్యవహరిస్తున్నారు. కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజరీ బిజినెస్‌ సీఈఓగా లక్ష్మీ అయ్యర్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా కొంతమందే ఉన్నత స్థానాల్లో ఉన్నారు.. మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్ల విషయానికి వచ్చే సరికి పరిస్థితి నిరాశాజనకంగా ఉందని మార్నింగ్‌స్టార్‌ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 31 నాటికి మొత్తం ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ దాదాపు రూ.39.62 లక్షల కోట్లు. వీటిని 428 మంది ఫండ్‌ మేనేజర్లు నిర్వహిస్తున్నారు. ఇందులో 42 మందే మహిళా ఫండ్‌ మేనేజర్లు. అంటే 10% లోపే ఈ బాధ్యతల్లో ఉన్నారు. గతేడాది మహిళా దినోత్సవంతో పోలిస్తే మొత్తం ఫండ్‌ మేనేజర్ల సంఖ్య 399 నుంచి 428కి చేరగా, మహిళా మేనేజర్లు 10 మంది పెరిగారు.

24 సంస్థల్లో ఇలా

దేశంలోని 24 మ్యూచువల్‌ ఫండ్‌లను పరిశీలిస్తే.. 13 సంస్థల్లో ఒక్కో ఫండ్‌ మేనేజర్‌ మాత్రమే మహిళ. అయిదింటిలో ముగ్గురు - అంతకంటే ఎక్కువమంది, ఆరు సంస్థల్లో ఇద్దరు చొప్పున మహిళా ఫండ్‌ మేనేజర్లు ఉన్నారు.  

రూ.4.43 లక్షల కోట్లు

మహిళా ఫండ్‌ మేనేజర్ల సంఖ్య తక్కువగానే ఉన్నా.. వారి నిర్వహణలోని మొత్తం ఆస్తులు రూ.4.43 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం ఫండ్‌ ఏయూఎంలో ఇది  11.19%. 2022 జనవరి నాటికి ఉన్న 11.98 శాతంతో పోలిస్తే ఇది తక్కువే. ప్రముఖ ఫండ్‌ మేనేజర్లు స్వాతి కులకర్ణి (యూటీఐ ఎంఎఫ్‌), లక్ష్మీ అయ్యర్‌ (కోటక్‌) ఫండ్‌ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఈ తగ్గుదల కనిపించిందని మార్నింగ్‌స్టార్‌ పేర్కొంది.

మెరుగైన ఫలితాలు

మహిళా మేనేజర్లు నిర్వహిస్తున్న ఫండ్లలో మంచి ఫలితాలు సాధించినట్లు మార్నింగ్‌స్టార్‌ పేర్కొంది. మహిళా ఫండ్‌ మేనేజర్లు నిర్వహిస్తున్న ఓపెన్‌ ఎండెడ్‌ పథకాల్లో అవే విభాగంలోని ఫండ్లతో పోల్చినప్పుడు ఏడాది ప్రాతిపదికన 82%, మూడేళ్ల ప్రాతిపదికన 93%, అయిదేళ్ల సగటున 99% ఫండ్లు మంచి పనితీరును చూపించాయని వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు