Twitter Vs Meta: ట్విటర్‌కు పోటీగా మెటా కొత్త యాప్‌!

ట్విటర్‌కు పోటీగా ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా కొత్త యాప్‌ను రూపొందిస్తోంది. అంతర్జాతీయంగా ట్విటర్‌కు ఉన్న ప్రజాదరణతోపాటు.. ఇప్పుడు ఆ సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని సిద్ధం చేస్తోంది.

Updated : 12 Mar 2023 07:52 IST

దిల్లీ: ట్విటర్‌కు పోటీగా ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా కొత్త యాప్‌ను రూపొందిస్తోంది. అంతర్జాతీయంగా ట్విటర్‌కు ఉన్న ప్రజాదరణతోపాటు.. ఇప్పుడు ఆ సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని సిద్ధం చేస్తోంది. ఉద్యోగుల తొలగింపుతో అప్రతిష్ఠ పాలైన ట్విటర్‌కు ప్రత్యామ్నాయం కోసం వినియోగదార్లు వెతుకున్నారు. ఇదే సరైన సమయంగా భావిస్తున్న మెటా.. ట్విటర్‌కు పోటీ ఇచ్చేందుకు ఓ యాప్‌ను తయారు చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ యాప్‌ వివరాలపై మెటా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. ఇది అభివృద్ధి దశలోనే ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు కొన్ని తెలిపాయి. ఈ ప్రాజెక్టుకు పీ-92 అనే కోడ్‌నేమ్‌ పెట్టినట్లు వివరించాయి. సరికొత్త సామాజిక మాధ్యమాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ బ్రాండ్‌ పేరుతో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఉన్న యూజర్లు పీ-92లో నమోదు చేసుకోవచ్చనీ లేదా స్వతంత్రంగా కొత్త ఖాతాలను తెరవవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఖాతా తెరిచే యూజర్లు వేరే సామాజిక మాధ్యమాల్లోని పోస్టులు పంచుకోవచ్చని తెలిపాయి. యూజర్‌ బయో, బ్యాడ్జెస్‌ వంటి అన్ని ఫీచర్‌లు ఇందులో ఉంటాయని వివరించాయి. ట్విటర్‌లో ఉన్నట్లు రీషేర్‌ ఫీచర్‌ ఇందులో ఉంటుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని తెలిపాయి. ఇది ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే పూర్తి వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని పేర్కొన్నాయి.

ఫేస్‌బుక్‌లో మరో 11,000 మందికి ఉద్వాసన

ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. వచ్చే కొన్ని నెలల వ్యవధిలో దఫాల వారీగా వేల మందిపై వేటు వేయనున్నట్లు సమాచారం. గతేడాది మెటా సుమారు 11,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. అది అప్పుడు ఆ సంస్థ ఉద్యోగుల్లో 13 శాతానికి సమానం. ఈ సారి కూడా దాదాపు 11,000 మంది వరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు. ఉద్యోగులపై వేటుకు సంబంధించి మెటా సంస్థ వచ్చే వారం తొలి ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం. నాన్‌- ఇంజినీరింగ్‌ ఉద్యోగులను అధికంగా తొలగించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాజెక్టులను సైతం ఆపివేయనున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. వీటితో పాటు కొన్ని బృందాలను సైతం రద్దు చేయనుందని తెలిపింది. వాల్‌స్ట్రీట్‌ కథనం ప్రకారం.. మెటాకు సంబంధించిన హార్డ్‌వేర్‌, మెటావర్స్‌ డివిజన్‌ అయిన రియల్టీ ల్యాబ్స్‌లో పని చేస్తున్న ఉద్యోగులను సైతం తీసేయనున్నారు. ఉద్యోగుల పని తీరు ఆధారంగా తొలగింపులు ఉంటాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ తదితర కంపెనీలు భారీగా ఉద్యోగులపై వేటు వేశాయి. 2022 నుంచి ఇప్పటి వరకు మొత్తం తొలగించిన ఉద్యోగుల సంఖ్య 3 లక్షలు దాటిందని లేఆఫ్స్‌.ఎఫ్‌వైఐ అనే వెబ్‌సైట్‌ అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని