వాణిజ్య ఒప్పంద పరిధి విస్తరణ చర్చలు వేగవంతం చేస్తాం

ప్రస్తుత స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం పరిధిని విస్తరించే నిమిత్తం ఈ సంవత్సరం చివరి  కల్లా చర్చలను ముగించేందుకు కట్టుబడి ఉన్నామని భారత్‌-ఆస్ట్రేలియాలు తెలిపాయి.

Published : 12 Mar 2023 02:08 IST

 ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బి.డాలర్లకు చేర్చడమే లక్ష్యం
భారత్‌, ఆస్ట్రేలియా వెల్లడి

దిల్లీ: ప్రస్తుత స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం పరిధిని విస్తరించే నిమిత్తం ఈ సంవత్సరం చివరి  కల్లా చర్చలను ముగించేందుకు కట్టుబడి ఉన్నామని భారత్‌-ఆస్ట్రేలియాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్‌ డాలర్లకు పెంచుకోవాలన్నదే లక్ష్యమని పేర్కొన్నాయి. భారత్‌ వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్‌ గోయల్‌, ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్‌ ఫారెల్‌ల మధ్య జరిగిన సమావేశంలో పై అంశం చర్చకు వచ్చింది. ఫారెల్‌తో పాటు అధికారిక ప్రకటన నిమిత్తం భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బానేసే కూడా ఈ సమావేశంలో ఉన్నారు. గతేడాది డిసెంబరు 29న ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందాన్ని (ఈసీటీఏ) భారత్‌, ఆస్ట్రేలియాలు అమల్లోకి తెచ్చాయి. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ) కింద ఈసీటీఏ పరిధిని విస్తరించేందుకు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయి. ‘ఈసీటీఏ.. ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధానికి తొలి దశ. ఇప్పుడు రెండో దశలోకి అడుగుపెట్టేందుకు సంప్రదింపులు చేసుకుంటున్నామ’ని విలేకర్లకు గోయల్‌ తెలిపారు. 2023 కల్లా సీఈసీఏ అమల్లోకి తెచ్చేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయని అల్బానేసే తెలిపారు. మైగ్రేషన్‌ అండ్‌ మొబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌ ఎరేంజ్‌మెంట్‌ను వచ్చే మూడు నెలల్లో పూర్తయ్యేలా సంబంధిత అధికారులకు ఇరు దేశాల ప్రధానులు సూచించినట్లు ఓ సంయుక్త ప్రకటనలో భారత్‌, ఆస్ట్రేలియా వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని