యెస్‌ బ్యాంక్‌ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తొచ్చు!

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విధించిన మూడేళ్ల లాకిన్‌ గడువు నేటితో (సోమవారం) ముగుస్తున్నందున, వ్యక్తిగత మదుపర్లతో పాటు  ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎఫ్‌ల) నుంచి యెస్‌ బ్యాంక్‌ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Updated : 13 Mar 2023 08:56 IST

మూడేళ్ల లాకిన్‌ గడువు ముగుస్తుండటమే కారణం: విశ్లేషకుల

ముంబయి: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విధించిన మూడేళ్ల లాకిన్‌ గడువు నేటితో (సోమవారం) ముగుస్తున్నందున, వ్యక్తిగత మదుపర్లతో పాటు  ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎఫ్‌ల) నుంచి యెస్‌ బ్యాంక్‌ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని 9 బ్యాంకుల కన్సార్షియం 2020 మార్చిలో యెస్‌ బ్యాంక్‌లో సుమారు 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.8 ప్రీమియంతో కలిపి రూ.10కు కొనుగోలు చేసింది. ఆర్‌బీఐ ఉద్దీపన ప్రణాళికలో భాగంగా, ఈ వాటా కొనుగోలుకు ఎస్‌బీఐ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.  ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్లు కూడా ఈ షేర్లను విక్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద రిటైల్‌, హెచ్‌ఎన్‌ఐలు, ఎన్‌ఆర్‌ఐలు వంటి వ్యక్తిగత మదుపర్ల వద్ద 135 కోట్ల యెస్‌ బ్యాంక్‌ షేర్లు లాకిన్‌ గడువులో ఉన్నాయి. మరో 6.7 కోట్ల షేర్లు ఈటీఎఫ్‌ల వద్ద ఉన్నాయి. అందరూ నేటి మార్కెట్‌లో షేర్లను విక్రయించకపోయినా, వచ్చే కొన్ని వారాల్లో యెస్‌ బ్యాంక్‌ షేర్లపై ఒత్తిడి కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

* 2022 డిసెంబరు నాటికి ఎస్‌బీఐ వద్ద యెస్‌ బ్యాంకులో 26.14 శాతం (605 కోట్ల షేర్లు) వాటా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లు వరుసగా తలా 100 కోట్ల షేర్లను కలిగి ఉన్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ వద్ద 60 కోట్ల షేర్లు, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వద్ద 50 కోట్ల షేర్లు, ఫెడరల్‌ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌ల వద్ద చెరో 30 కోట్ల షేర్లు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ వద్ద 25 కోట్ల షేర్లు ఉన్నాయి. ఈ 8 బ్యాంకుల వద్ద సుమారు 1,100 కోట్ల షేర్లు ఉన్నాయి.

* ఎస్‌బీఐ ఏఎంసీ నిర్వహిస్తున్న నిఫ్టీ 50 ఈటీఎఫ్‌లో 2.36 కోట్ల యెస్‌ బ్యాంక్‌ షేర్లు ఉన్నాయి. కోటక్‌ ఏఎంసీ వద్ద 1.19 కోట్ల షేర్లు, నిప్పాన్‌ ఇండియా వద్ద 1.05 కోట్ల షేర్లు, ఎస్‌బీఐ ఈటీఎఫ్‌ లేదా బ్యాంక్‌ నిఫ్టీ వద్ద మరో 67.2 లక్షల షేర్లు, యూటీఐ ఏఎంసీ వద్ద   58.9 లక్షల షేర్లు ఉన్నాయి.

* గత శుక్రవారం ట్రేడింగ్‌లో యెస్‌ బ్యాంక్‌ షేరు బీఎస్‌ఈలో 0.36% నష్టంతో రూ.16.52 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలో   0.30% కోల్పోయి రూ.16.50 వద్ద స్థిరపడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు