పన్ను వసూళ్లు.. అంచనాలను చేరకపోవచ్చు

ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో సవరించిన పన్ను వసూళ్ల లక్ష్యం రూ.30.43 లక్షల కోట్లను ప్రభుత్వం చేరుకోలేకపోవచ్చని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

Published : 13 Mar 2023 01:23 IST

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో సవరించిన పన్ను వసూళ్ల లక్ష్యం రూ.30.43 లక్షల కోట్లను ప్రభుత్వం చేరుకోలేకపోవచ్చని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. బడ్జెట్‌తో పోలిస్తే ఏకంగా 10 శాతం మేర పన్ను లక్ష్యాలను పెంచడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. బడ్జెట్‌లో రూ.27.57 లక్షల కోట్ల పన్ను వసూళ్లను అంచనా వేయడం గమనార్హం. ‘ప్రత్యక్ష పన్నులు (ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ పన్నులు కలిపి)  సవరించిన అంచనాలను చేరుకోవడం కష్టమే. నికర పన్ను వసూళ్లు రూ.15-15.5 లక్షల కోట్లకు పరిమితం కావొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 17 శాతం పెరిగి రూ.16.50 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా వేశారు. 2021-22లో ఇవి రూ.14.20 లక్షల కోట్లే. కార్పొరేట్‌ పన్ను రూ.8.35 లక్షల కోట్ల మేర వసూలు కావొచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది 10.4 శాతం పెరిగి రూ.9.22 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8.15 లక్షల కోట్లు వసూలు కావొచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10.4 శాతం పెరిగి రూ.9 లక్షల కోట్లకు చేరొచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్‌ సుంకం వసూళ్లు 11 శాతం పెరిగి రూ.2.33 లక్షల కోట్లకు చేరొచ్చన్నది సవరించిన అంచనాగా సదరు అధికారి వివరించారు.

* పరోక్ష పన్నులకొస్తే జీఎస్‌టీ వసూళ్ల అంచనా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.8.54 లక్షల కోట్లుగా ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 12 శాతం పెరిగి రూ.9.56 లక్షల కోట్లకు చేరొచ్చన్నది అంచనా.

* 2023-24లో ప్రత్యక్ష, పరోక్ష పన్నులు రెండూ కలిపి 10.45 శాతం వృద్ధితో రూ.33.61 లక్షల కోట్లకు చేరొచ్చని అంచనా. నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17 శాతం పెరిగి రూ.13.73 లక్షల కోట్లకు చేరొచ్చని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) గత వారం వెల్లడించింది. స్థూల ప్రాతిపదికన వసూళ్లు 22.58 శాతం పెరిగి రూ.16.68 లక్షల కోట్లకు చేరొచ్చని తెలిపింది.

* 2022 ఏప్రిల్‌ 1 నుంచి 2023 మార్చి 10 వరకు రూ.2.95 లక్షల కోట్ల పన్ను రిఫండ్‌లు చేసినట్లు సీబీడీటీ పేర్కొంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఇది 59.44 శాతం అధికం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని