Adani-LIC: అదానీ కంపెనీలకు ఎల్‌ఐసీ రుణాలు రూ.6,183 కోట్లు

అదానీ గ్రూప్‌ కంపెనీలకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) ఇచ్చిన రుణాలు మార్చి 5 నాటికి రూ.6,183 కోట్ల మేర ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపారు.

Updated : 14 Mar 2023 09:52 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ కంపెనీలకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) ఇచ్చిన రుణాలు మార్చి 5 నాటికి రూ.6,183 కోట్ల మేర ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపారు. ఈ రుణాలు 2022 డిసెంబరు 31న రూ.6,347 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌లో ఏఏ సంస్థ ఎల్‌ఐసీ నుంచి ఎంత మేర రుణాలు తీసుకుందంటే..


* అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజెడ్‌ - రూ.5,388.60 కోట్లు
* అదానీ పవర్‌ (ముంద్రా) - రూ.266.00 కోట్లు
* అదానీ పవర్‌ (మహారాష్ట్ర-ఫేజ్‌1)- రూ.81.60 కోట్లు
* అదానీ పవర్‌ (మహారాష్ట్ర-ఫేజ్‌3)- రూ.254.87 కోట్లు
* రాయ్‌గఢ్‌ ఎనర్జీ జనరేషన్‌ - రూ.45.00 కోట్లు
* రాయ్‌పుర్‌ ఎనర్జెన్‌ - రూ.145.67 కోట్లు


* ప్రభుత్వ రంగంలోని మిగతా 5 సాధారణ బీమా కంపెనీలు అదానీ గ్రూప్‌ కంపెనీలకు ఎలాంటి రుణాలు అందించలేదని తెలిపాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

ప్రభుత్వం కమిటీని నియమించలేదు.. సెబీ విచారిస్తోంది!

అదానీ గ్రూప్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయని, అకౌంటింగ్‌ మోసాలకు ఆ సంస్థ పాల్పడినట్లు యూఎస్‌ షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఏ కమిటీని నియమించలేదని ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి లోక్‌సభకు వెల్లడించారు. అదానీ గ్రూప్‌నకు చెందిన 9 నమోదిత కంపెనీలు (ఎన్‌డీటీవీ మినహా) జనవరి 24 నుంచి మార్చి 1 మధ్య సుమారు 60 శాతం మేర మార్కెట్‌ విలువ కోల్పోయాయని, ఈ నేపథ్యంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణ జరుపుతోందని మంత్రి వివరించారు. ఈ కంపెనీల షేర్ల ధరల్లో ఒడుదొడుకులు నిఫ్టీ 50పై పెద్దగా ప్రభావం చూపలేదని, నిఫ్టీ ఈ సమయంలో 4.5 శాతమే కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు.

* అదానీ కంపెనీ దిగుమతి చేసుకుంటున్న విద్యుదుత్పత్తి, సరఫరా పరికరాల వ్యవహారంపై డీఆర్‌ఐ జరిపిన విచారణ ముగిసిందని మంత్రి తెలిపారు. నివేదికను సంబంధిత న్యాయ అధికారులకు సమర్పించినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని