స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు షాక్‌!

దేశంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్ల డేటా భద్రత, గోప్యతతో పాటు దేశ భద్రత ప్రయోజనాల దృష్ట్యా.. స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు సరికొత్త భద్రతా నిబంధనలను తీసుకొచ్చే పనిలో ప్రభుత్వం ఉంది.

Published : 15 Mar 2023 01:24 IST

సరికొత్త భద్రతా నిబంధనల ప్రణాళికలో భారత్‌
ప్రీ ఇన్‌స్టాల్డ్‌ యాప్‌ల తొలగింపునకూ వీలు

దేశంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్ల డేటా భద్రత, గోప్యతతో పాటు దేశ భద్రత ప్రయోజనాల దృష్ట్యా.. స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు సరికొత్త భద్రతా నిబంధనలను తీసుకొచ్చే పనిలో ప్రభుత్వం ఉంది. దీని వల్ల స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు తాము అనుకున్న సమయం కంటే ఆలస్యంగా కొత్త మోడళ్లను ఆవిష్కరించాల్సి రావొచ్చు. ప్రీ ఇన్‌స్టాల్డ్‌ యాప్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్నీ కోల్పోవాల్సి రావొచ్చని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది.

ప్రతిపాదిత నిబంధనలు ఇవీ

స్మార్ట్‌ఫోన్‌ తయారీదార్లు తమ ఫోన్లలో కొన్ని యాప్‌లను ముందస్తుగా ఇన్‌స్టాల్‌ చేసి వినియోగదార్లకు విక్రయిస్తుంటాయి. వీటిని తీసేయడానికి వీలుండదు. కొన్ని థర్డ్‌పార్టీ యాప్‌లను ఇలా ఇన్‌స్టాల్‌ చేసినందుకు, సెల్‌ కంపెనీలు వారి నుంచి డబ్బులు తీసుకుంటాయి. ఒక్కో ఫోన్‌పై రూ.500-1,000 వరకు  కూడా ఇలా వచ్చే వీలుంటుందని ఒక కంపెనీ ఉన్నతాధికారి తెలిపారు. ఇలా ముందస్తుగా ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌లనూ వినియోగదారులు తొలగించుకునే వీలు కల్పించే నిబంధనను తీసుకురానుందని సమాచారం.

* ఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌(ఓఎస్‌) అప్‌డేట్‌లకు తప్పనిసరిగా తనిఖీలు (స్క్రీనింగ్‌) ఉండాలనీ యోచిస్తోంది.

ఇదీ ప్రభావం: ఒక స్మార్ట్‌ఫోన్‌, వాటి విడిభాగాలను ప్రభుత్వ ఏజెన్సీ తనిఖీ చేయడానికి ప్రస్తుతం 21 వారాలు పడుతోంది. మరిన్ని పరీక్షలకు ఇంకా అధిక సమయం పట్టొచ్చు. శాంసంగ్‌, షియోమీ, వివో వంటి కంపెనీలు ప్రీ-ఇన్‌స్టాల్డ్‌ యాప్‌ల ద్వారా పొందుతున్న వ్యాపారాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

విదేశీ నిఘా లేకుండా

2020లో చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచీ, ఆ దేశ వ్యాపార సంస్థల విధానాలపై మన ప్రభుత్వం గట్టి నిఘా ఉంచింది. టిక్‌ టాక్‌ వంటి 300 చైనా యాప్‌లను నిషేధించింది కూడా. అంతర్జాతీయంగానూ చాలా దేశాలు చైనా సంస్థలైన హువావే, హక్‌విజన్‌ వంటి టెక్‌ కంపెనీల సాంకేతికతను వినియోగించకుండా ఆంక్షలు విధిస్తున్న విషయం విదితమే. తమ సాంకేతికత ద్వారా విదేశీ పౌరులపై చైనా నిఘా ఉంచుతోందన్నది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే మన ప్రభుత్వమూ కఠిన చర్యలకు దిగుతోంది.

* మన స్మార్ట్‌ఫోన్‌ విపణిలో చైనా కంపెనీలైన షియోమీ, వివో, ఒప్పోలదే  సగం వరకు వాటా ఉంది. దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌కు 20%, యాపిల్‌కు 3% వాటా  ఉన్నాయి. 

బీఐఎస్‌ ల్యాబ్‌లో..

షియోమీ యాప్‌ స్టోర్‌ గెట్‌యాప్స్‌ కానీ శాంసంగ్‌కు చెందిన శాంసంగ్‌ మినీ కానీ.. ఐఫోన్‌లో యాపిల్‌ బ్రౌజర్‌ అయిన సఫారీ కానీ ప్రీ-ఇన్‌స్టాల్డ్‌వే. వీటిని తొలగించడానికి వీలుండదు. ఇకపై అన్‌ఇన్‌స్టాల్‌ ఆప్షన్‌ను అవి పొందుపరచాలి. కొత్త మోడళ్లను బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) అధీకృత ల్యాబ్‌లో తనిఖీ చేసే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని