ఏడాది కనిష్ఠానికి వాణిజ్య లోటు

దేశ ఎగుమతులు వరుసగా మూడో నెలా 8.8% తగ్గి ఫిబ్రవరిలో 33.88 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతర్జాతీయంగా గిరాకీ నెమ్మదించడమే దీనికి కారణం.

Published : 16 Mar 2023 01:55 IST

ఫిబ్రవరిలో 17.43 బి.డాలర్లు

దిల్లీ: దేశ ఎగుమతులు వరుసగా మూడో నెలా 8.8% తగ్గి ఫిబ్రవరిలో 33.88 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతర్జాతీయంగా గిరాకీ నెమ్మదించడమే దీనికి కారణం. దిగుమతులు కూడా 2022 ఫిబ్రవరి నాటి 55.9 బి.డాలర్ల నుంచి 8.21 శాతం తగ్గి 51.31 బి.డాలర్లకు పరిమితమయ్యాయి. ఫలితంగా వాణిజ్య లోటు ఏడాది కనిష్ఠమైన 17.43 బి.డాలర్లకు దిగి వచ్చింది. 2022 జనవరిలో వాణిజ్య లోటు 17.42 బి.డాలర్లుగా నమోదయ్యాక, మళ్లీ ఇదే కనిష్ఠ స్థాయి.

* ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-ఫిబ్రవరి మధ్య దేశ ఎగుమతులు 7.5 శాతం పెరిగి 405.94 బి.డాలర్లకు; దిగుమతులు 18.82 శాతం పెరిగి 653.47 బి.డాలర్లకు చేరాయి. ఫలితంగా ఈ 11 నెలల కాలానికి వాణిజ్య లోటు 247.53 బి.డాలర్లుగా నమోదైంది. ఇదే ధోరణి కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరంలో 750 బి.డార్ల వస్తు, సేవల ఎగుమతులు నమోదు కావొచ్చని వాణిజ్య కార్యదర్శి సునీల్‌ బర్త్‌వాల్‌ వెల్లడించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం..

* ఇంజినీరింగ్‌ వస్తువులు, రత్నాభరణాలు, కాటన్‌ యార్న్‌/ఫ్యాబ్రిక్స్‌/మేడప్స్‌, ప్లాస్టిక్‌, లినోలియంల ఎగుమతులు 11 నెలల్లో ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి.

* ఇంజినీరింగ్‌ ఎగుమతులు ఏప్రిల్‌-ఫిబ్రవరిలో 98.86 బి.డాలర్లకు తగ్గాయి. 2021-22 ఇదే సమయంలో ఇవి 101.15 బి.డాలర్లుగా నమోదయ్యాయి.

* రత్నాభరణాల ఎగుమతులు 35.32 బి.డాలర్ల నుంచి 35.21 బి.డాలర్లకు స్వల్పంగా తగ్గాయి.

* పసిడి దిగుమతులు 45.12 బి.డాలర్ల నుంచి 31.72 బి.డాలర్లకు తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో ముడి చమురు దిగుమతులు 193.47 బి.డాలర్లకు పెరిగాయి. 2021-22 ఇదే సమయంలో ఇవి 140.67 బి.డాలర్లుగా నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని