ఒడుదొడుకులున్నా ముందుకే

రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సూచీలు లాభాలు కొనసాగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో లోహ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు కళకళలాడాయి.

Published : 18 Mar 2023 01:28 IST

సమీక్ష

రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సూచీలు లాభాలు కొనసాగించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో లోహ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు కళకళలాడాయి. రూపాయి బలపడటం, చమురు ధరలు తగ్గడం సానుకూల ప్రభావం చూపాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 17 పైసలు పెరిగి 82.59 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 75.57 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  
సెన్సెక్స్‌ ఉదయం 58,038.17 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అనంతరం అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఒకదశలో 57,503.90 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. మళ్లీ కోలుకుని లాభాల్లోకి వచ్చిన సెన్సెక్స్‌, చివరకు 355.06 పాయింట్ల లాభంతో 57,989.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 114.45 పాయింట్లు పెరిగి 17,100.05 దగ్గర స్థిరపడింది.

* అదానీ గ్రూప్‌లో 7 షేర్లు శుక్రవారం లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 1.88% పెరిగి రూ.1877.15 వద్ద ముగిసింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌ 5% లాభంతో అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. అదానీ విల్మర్‌ 1.52%, అదానీ టోటల్‌ 1.07%, అదానీ పవర్‌ 0.60%, అదానీ పోర్ట్స్‌ 0.14% లాభపడ్డాయి. ఎన్‌డీటీవీ 1.63%, ఏసీసీ 1.39%, అంబుజా సిమెంట్స్‌ 0.09% నష్టపోయాయి.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 రాణించాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ 3.37%, అల్ట్రాటెక్‌ 2.53%, నెస్లే 2.21%, టాటా స్టీల్‌ 1.90%, కోటక్‌ బ్యాంక్‌ 1.63%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.57%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.54%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.36%, హెచ్‌డీఎఫ్‌సీ 1.14%, ఇన్ఫోసిస్‌ 1.04% చొప్పున లాభపడ్డాయి. ఐటీసీ 1.51%, మారుతీ 1.48%, ఎన్‌టీపీసీ 1.25%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.14% మాత్రం నష్టపోయాయి.

తగ్గిన ఫారెక్స్‌ నిల్వలు: భారత విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు 3 నెలల కనిష్ఠానికి చేరాయి. మార్చి 10తో ముగిసిన వారానికి ఫారెక్స్‌ నిల్వలు 2.397 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.19,650 కోట్లు) తగ్గి 560 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.45.92 లక్షల కోట్ల)కు చేరాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు 2.2 బి.డాలర్లు తగ్గి 494.86 బి.డాలర్లకు పరిమితమయ్యాయి.

* హై-టెక్‌ పైప్స్‌ షేర్లను 1:10 నిష్పత్తిలో విభజించింది. నగదు లభ్యత పెంచేందుకు రూ.10 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరును రూ.1 ముఖవిలువ గల 10 షేర్లుగా విభజించారు.

నాన్‌-కన్వెర్టబుల్‌ డిబెంచర్ల (ఎన్‌సీడీలు) జారీ ద్వారా పలు విడతల్లో రూ.57,000 కోట్ల వరకు సమీకరించే ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ నెల 27న హెచ్‌డీఎఫ్‌సీ బోర్డు సమావేశం కానుంది.

వాల్‌మార్ట్‌ నుంచి ప్రాథమిక మూలధనం కింద అదనంగా 200 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.1,649 కోట్లు) సమీకరించినట్లు ఫోన్‌పే వెల్లడించింది. సంస్థ విలువను 12 బి.డాలర్లు (దాదాపు రూ.98,000 కోట్లు)గా లెక్కకట్టి ఈ నిధులు సమీకరించారు. దీంతో కలిపి అంతర్జాతీయ పెట్టుబడిదార్ల నుంచి మొత్తం 650 మి.డాలర్లు (రూ.5360 కోట్లు) కూడగట్టింది.

విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐలు) నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. ఏడు పనిదినాల్లోపు విధానాలు, ఉమ్మడి యాజమాన్య మార్పుల వివరాలను తెలియజేయాలని ఆదేశించింది.

కొలియర్స్‌ ఇండియా సీఈఓ రమేశ్‌ నాయర్‌ తన పదవికి రాజీనామా చేశారు.

ఇన్వెస్ట్‌ ఇండియా ఎండీ, సీఈఓ పదవి నుంచి దీపక్‌ బగ్లా వ్యక్తిగత కారణాలతో వైదొలిగారు.

హెచ్‌డీఎఫ్‌సీ, అనుబంధ సంస్థలు - హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. ఈ విలీనం 2023-24 రెండు లేదా మూడో త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశం ఉంది.

కంపెనీలో ప్రజా వాటాను పెంచేందుకు ఫాలో-ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)ను పరిశీలించడం లేదని పతంజలి ఫుడ్స్‌ స్పష్టం చేసింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌, క్యూఐపీ వంటి వాటిని చూస్తున్నామని తెలిపింది.

బీపీసీఎల్‌ ఛైర్మన్‌గా జి.కృష్ణ కుమార్‌ బాధ్యతలు శుక్రవారం స్వీకరించారు.

సింటెక్స్‌-బీఏపీఎల్‌ కొనుగోలుకు ప్రోపెల్‌ ప్రోడక్ట్స్‌- ప్లాస్టాట్యూటో వేసిన బిడ్‌కు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. ఇది రూ.1250 కోట్లు ఉండొచ్చని సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు