సంక్షిప్త వార్తలు (8)

గగనతల విహారంతో సంబంధం లేని (నాన్‌ ఫ్లైయింగ్‌) ఉద్యోగుల కోసం మరో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) పథకాన్ని ఎయిరిండియా ప్రకటించింది.

Published : 18 Mar 2023 04:17 IST

రూ.239కే అపరిమిత డేటా

ఈనాడు, హైదరాబాద్‌: ఎయిర్‌టెల్‌ 5జీ వినియోగదారులకు 4జీ ప్లాన్లలో అపరిమిత డేటా అందించేలా కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.239 నుంచి రీఛార్జీలకు ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్‌ సేవలు దేశ వ్యాప్తంగా 270 నగరాల్లో అందుబాటులో ఉన్నాయని, 2024 చివరికి గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ సేవలను ప్రారంభిస్తామని భారతీ ఎయిర్‌టెల్‌ కన్జూమర్‌ బిజినెస్‌ డైరెక్టర్‌ శాశ్వత్‌ శర్మ తెలిపారు.


ఆన్‌లైన్‌ ఔషధ విక్రయాలపై 31 సంస్థలకు షోకాజ్‌

దిల్లీ: ఆన్‌లైన్‌ లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఔషధ విక్రయాలకు సంబంధించి, అభ్యంతరాలు రేగడంతో 31 సంస్థలకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ మండలి (సీడీఎస్‌సీఓ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు లోక్‌సభకు ఇచ్చిన సమాచారంలో ప్రభుత్వం పేర్కొంది. 1940 ఔషధాలు, కాస్మోటిక్స్‌ చట్టంలోని నిబంధనలను ఈ సంస్థలు ఉల్లంఘించినట్లు తెలిపింది. ఔషధాల నాణ్యతకు సంబంధించిన కేసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్టేట్‌ లైసెన్సింగ్‌ అధారిటీ (ఎస్‌ఎల్‌ఏ)ని ఆదేశించినట్లు కేంద్ర ఔషధ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ వెల్లడించారు. లైసెన్సు నిబంధనల ఉల్లంఘనలపై ఎటువంటి చర్యలైనా తీసుకునే అధికారం ఎస్‌ఎల్‌ఏలకు ఉంది.


బ్లూస్టార్‌ నుంచి డీప్‌ ఫ్రీజర్లు

ఈనాడు, హైదరాబాద్‌: వాణిజ్య అవసరాల కోసం వినియోగించే డీప్‌ ఫ్రీజర్లను బ్లూస్టార్‌ విపణిలోకి విడుదల చేసింది. ఇందులో వైద్య రంగంలో ఉపయోగించేవీ ఉన్నాయి.  మహారాష్ట్రలోని వడ దగ్గర నిర్మించిన ప్లాంటులో వీటిని ఉత్పతి చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.త్యాగరాజన్‌ తెలిపారు. డీప్‌ ఫ్రీజర్ల ధర  రూ.25-35 వేల వరకు ఉంటుందని సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. 2021-22లో బ్లూస్టార్‌ ఆదాయం రూ.6045 కోట్లు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8,200 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో నివాస ఏసీల తయారీ ప్లాంట్‌పై ఇప్పటికే రూ. 350 కోట్లు వెచ్చించామని, మరో రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు తెలిపారు. రూ.500 కోట్లతో నిర్మించబోతున్న వాణిజ్య ఏసీల ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలు 2025లో ప్రారంభమవుతాయని తెలిపారు.


మారుతీ బ్రెజా సీఎన్‌జీ

ప్రారంభ ధర రూ.9.14 లక్షలు

దిల్లీ: మారుతీ సుజుకీ తమ కాంపాక్ట్‌ వినియోగ వాహనం బ్రెజాలో సీఎన్‌జీ రకాన్ని తీసుకొచ్చింది.. దీని ధరల శ్రేణి రూ.9.14-12.05 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌, దిల్లీ). బ్రెజా ఎస్‌-సీఎన్‌జీ మోడల్‌ కేజీకి 25.51 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుంది. మారుతీ తమ ఎరీనా విక్రయశాలల్లో జరిపే అమ్మకాల్లో సీఎన్‌జీ వేరియంట్ల వాటా 24 శాతంగా ఉంది. మొత్తం విక్రయాల్లో ఎర్టిగా, వ్యాగన్‌ఆర్‌ సీఎన్‌జీ వేరియంట్ల వాటా 57%, 41 శాతంగా ఉన్నాయి. నెక్సా షోరూమ్‌ల్లో విక్రయించే గ్రాండ్‌ విటారా, బాలెనో, ఎక్స్‌ఎల్‌6ల్లో సైతం సీఎన్‌జీ వేరియంట్లున్నాయి.


బిస్లరీ కొనుగోలు చర్చలు ఆపేశాం

ఎక్స్ఛేంజీలకు టాటా కన్జూమర్‌ వెల్లడి

దిల్లీ: తాగునీటిని సీసాల్లో విక్రయించే బ్రాండ్‌ బిస్లరీని కొనుగోలు చేసేందుకు, ఆ సంస్థతో జరుపుతున్న సంప్రదింపులను ఆపేశామని ఎక్స్ఛేంజీలకు టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ (టీసీపీఎల్‌) తెలియజేసింది. బిస్లరీని రూ.6,000- 7,000 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకునే దిశగా టాటాలు చర్చలు జరిపినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని, సంప్రదింపులు కూడా ఆపేశామని ఎక్స్ఛేంజీలకు టీసీపీఎల్‌ శుక్రవారం తెలిపింది.  బిస్లరీని కొనుగోలు చేసేందుకు టీసీపీఎల్‌ చర్చలు జరుపుతున్న విషయాన్ని గతేడాది నవంబరులో ఓ ఆంగ్ల వెబ్‌సైట్ వెల్లడించింది. టీసీపీఎల్‌ కూడా హిమాలయన్‌, టాటా కాపర్‌ ప్లస్‌ వాటర్‌, టాటా గ్లూకో+ బ్రాండ్లతో ప్యాకేజ్డ్‌ నీటి వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. బిస్లరీని కొనుగోలు చేయడం ద్వారా ఈ వ్యాపారంలో భారీగా విస్తరించాలని టీసీపీఎల్‌ అప్పట్లో భావించింది. బిస్లరీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తన కుమార్తె జయంతి చౌహాన్‌ ఆసక్తి చూపడం లేదని, అందుకే అమ్మేందుకు యోచిస్తున్నామని సంస్థ ఛైర్మన్‌ రమేశ్‌ చౌహాన్‌ (82) కూడా ఆ సందర్భంలో ప్రకటించారు. థమ్స్‌అప్‌, గోల్డ్‌స్పాట్‌, మజా, లింకా వంటి బ్రాండ్లు కూడా రమేశ్‌ చౌహాన్‌ సృష్టించినవే. వాటిని కోకకోలా 1993లో కొనుగోలు చేసిన సంగతి విదితమే.


స్పెషాలిటీ ఉక్కు కోసం పీఎల్‌ఐ 2.0 పథకం

మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

దిల్లీ: దేశంలో స్పెషాలిటీ ఉక్కు ఉత్పత్తిని పెంచేందుకు, ఈ రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని మరోసారి తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. స్పెషాలిటీ ఉక్కు పీఎల్‌ఐ పథకం ఇకంద అవగాహనా పూర్వక ఒప్పందాన్ని (ఎంఓయూ) కుదుర్చుకునే కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ‘ఉక్కు పరిశ్రమ భవిష్యత్తుకు ఈ రోజు ఎంతో ముఖ్యమైనది. పీఎల్‌ఐ 2.0ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంద’ని తెలిపారు. రూ.6,322 కోట్ల ప్రోత్సాహకాలు పొందే వీలున్న ఈ పథకం కింద పెట్టుబడులు పెట్టేందుకు ఎంపికైన కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. పీఎల్‌ఐ 2.0 పథకం కోసం సూచనలు ఇవ్వాలని, అభిప్రాయాలు పంచుకోవాల్సిందిగా పరిశ్రమ సంఘాలను ఆయన కోరారు. స్పెషాలిటీ ఉక్కు ఉత్పత్తులను తయారు చేసే నిమిత్తం ఉక్కు మంత్రిత్వ శాఖతో సుమారు 27 ఉక్కు కంపెనీలు 57 ఎంఓయూలపై సంతకాలు చేశాయి. దీని వల్ల దేశీయ ఉక్కు రంగంలోకి అదనంగా రూ.30,000 కోట్ల  పెట్టుబడులు రావడంతో పాటు, వార్షిక తయారీ సామర్థ్యం మరో 25 మిలియన్‌ టన్నులు పెరగనుంది. 55,000 కొత్త ఉద్యోగాల సృష్టికీ దోహదం చేయనుంది.


సజావుగానే ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ

దిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ సజావుగానే కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. నిర్దేశించిన వ్యూహాత్మక విక్రయ ప్రక్రియ ప్రకారమే పనులు నడుస్తున్నట్లు పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్‌) వెల్లడించింది. ఐడీబీఐ బ్యాంక్‌ ప్రైవేటీకరణ వాయిదా పడే అవకాశం ఉందంటూ వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. ప్రస్తుతం వాటా విక్రయం ఈఓఐ అనంతర దశలో ఉందని దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ట్వీట్‌ చేశారు. కేంద్రం, ఎల్‌ఐసీ కలిసి ఈ బ్యాంక్‌లో 61 శాతం వాటాను విక్రయిస్తున్నాయి. ఇందు కోసం జనవరిలో పలు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)లనూ పొందింది. వచ్చిన బిడ్లను కేంద్రం, ఆర్‌బీఐ పరిశీలన జరుపుతున్నాయి. వ్యూహాత్మక వాటా అమ్మక అనంతరం కేంద్రం, ఎల్‌ఐసీల వాటా బ్యాంకులో 34 శాతానికి దిగివస్తుంది. 2023-24 ద్వితీయార్థంలో ఈ బ్యాంక్‌ ప్రైవేటీకరణ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు.


చైనాతో సంబంధమున్న భారత కంపెనీల షేర్లపై పరిశీలన

సింగపూర్‌: తమ దేశ కంపెనీలతో ఒప్పందాలున్న భారత నమోదిత కంపెనీల షేర్ల విలువలను చైనా దేశానికి చెందిన మార్కెట్‌ నియంత్రణ సంస్థలు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇరు దేశాలకు చెందిన రెండు కంపెనీలు ఇటీవల తమ వివాదంపై కుదుర్చుకున్న సెటిల్‌మెంట్‌ దీనికి నేపథ్యం. భారత్‌కు చెందిన కిరి ఇండస్ట్రీస్‌, చైనాకు చెందిన సింగపూర్‌ అనుబంధ సంస్థ డైస్టార్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌కు చెందిన కేసులో సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ కమర్షియల్‌ కోర్టు(ఎస్‌ఐసీసీ) ఈ నెలలో జారీ చేసిన తీర్పును ఆ వర్గాలు ఉదహరిస్తున్నాయి. డైస్టార్‌లో కిరికున్న 37.57 శాతం వాటా విలువను 603.8 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.5,000 కోట్లు)గా లెక్కగట్టారు. భారత కంపెనీ వాటా విలువను మరీ అధికంగా లెక్కగట్టారని బీజింగ్‌ నియంత్రణ సంస్థలు భావిస్తున్నాయి.హాంకాంగ్‌కు చెందిన సెండా ఇంటర్నేషనల్‌ క్యాపిటల్‌, కిరి వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు సెండా బ్యాలెన్స్‌ షీట్లో 65 మి. డాలర్లకు మించి లేదని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సెండా మాతృసంస్థ నుంచి ఎటువంటి కార్పొరేట్‌ హామీ లేకుండా ఏ బ్యాంకరూ నిధులు ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు. అద్భుతం జరిగి అడ్డంకులన్నీ తొలగినా, వాటాదార్ల నుంచి అనుమతి, చైనా నియంత్రణ సంస్థల తనిఖీకి చాలా సమయం పట్టొచ్చంటున్నారు. తుది విలువపై ఎస్‌ఐసీసీ తీర్పు నేపథ్యంలో కిరి షేర్లలో వారం కిందట ఎన్‌ఎస్‌ఈలో ర్యాలీ కనిపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని