దేశీయ ఫార్మాకు గడ్డుకాలం

కొవిడ్‌’ మహమ్మారి విస్తరించిన సమయంలో ఎంతో అధిక అమ్మకాలు, ఆదాయాలు ఆర్జించిన దేశీయ ఫార్మా పరిశ్రమకు గత ఏడాది కాలంగా కష్టకాలం  ఎదురవుతోంది.

Updated : 19 Mar 2023 02:52 IST

2023-24లో వృద్ధి రేటు 6-8 శాతమే
కొత్త ఔషధాల ఆవిష్కరణే తగిన పరిష్కారం

ఈనాడు, హైదరాబాద్‌:  ‘కొవిడ్‌’ మహమ్మారి విస్తరించిన సమయంలో ఎంతో అధిక అమ్మకాలు, ఆదాయాలు ఆర్జించిన దేశీయ ఫార్మా పరిశ్రమకు గత ఏడాది కాలంగా కష్టకాలం  ఎదురవుతోంది. ఒక పక్క మందుల అమ్మకాలు తగ్గిపోగా, మరో పక్క ముడిపదార్థాల వ్యయాలు పెరిగి కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. దీంతో గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా ఫార్మా పరిశ్రమలో వృద్ధి మందగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో నామమాత్రపు వృద్ధితో సరిపెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీని నుంచి బయటకు వచ్చి అధిక వృద్ధి సాధించాలంటే, పరిశోధన-అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డీ) కార్యకలాపాలను వేగవంతం చేయడం, కొత్త తరానికి చెందిన కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడమే పరిష్కారమని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి. 2012 నుంచి 2022 మధ్యకాలంలో ఫార్మా పరిశ్రమ 10.9 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేసిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఎన్నో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ గత దశాబ్దకాలంలో సగటు వృద్ధి రెండంకెల స్థాయిలో నమోదవడం ప్రత్యేకత. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో తక్కువ వృద్ధికి పరిమితం కావలసిన పరిస్థితి ఫార్మా పరిశ్రమ ముందు కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో దేశీయ ఫార్మా పరిశ్రమ వృద్ధి 3-4 శాతానికి మించదని అంచనా. 2023-24లో దీని కంటే కొంత మెరుగైన వృద్ధి నమోదు కావచ్చని భావిస్తున్నారు. 2023-24లో ఫార్మా పరిశ్రమ 6 నుంచి 8% వృద్ధి సాధిస్తుందని క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ ‘ఇక్రా లిమిటెడ్‌’ అంచనా వేసింది. ముడి పదార్థాల ధరలు తగ్గడంతో పాటు, సరకు రవాణాకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయితే కొంత మెరుగైన వృద్ధి రేటు సాధ్యమనే అభిప్రాయాన్ని పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

పెరుగుతున్న మందుల వినియోగం

మన దేశంలో గత కొంతకాలంగా ప్రజల సగటు ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో వ్యాధుల సంఖ్య, వ్యాధుల తీవ్రత అధికంగా కనిపిస్తోంది. అంతేగాక ఎన్నో కొత్త ఔషధాలు అందుబాటులోకి వస్తున్నాయి. అదే సమయంలో వైద్యంపై ఖర్చు చేసేందుకు ప్రజలు గతంలో మాదిరిగా వెనకాడటం లేదు. దీని వల్ల మందుల వినియోగం పెరుగుతోంది. మందుల ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి ఫార్మా కంపెనీలకు అనుకూలంగా మారుతుంది. దీనివల్ల ఫార్మా కంపెనీలు అధిక ఆదాయాలు నమోదు చేసే అవకాశం కలుగుతుందని పరిశ్రమ వర్గాల విశ్లేషణ. ఫార్మా కంపెనీలు పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలను అధికం చేసి కొత్త మందులను దేశీయ మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావాలని, తద్వారా అమ్మకాలను ఎంతగానో పెంచుకునే అవకాశం ఉంటుందని ఈ వర్గాలు వివరిస్తున్నాయి. ఈ దిశగా కొన్ని కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు పేర్కొంటున్నాయి. సంక్లిష్టమైన జనరిక్‌ ఔషధాలు, బయోసిమిలర్స్‌, టీకాలు ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇ-ఫార్మసీల దూకుడు...

ఇటీవల కాలంలో మందుల అమ్మకాల తీరుతెన్నుల్లో మార్పులు వస్తున్నాయి. కేవలం మెడికల్‌ స్టోర్ల ద్వారా మాత్రమే కాకుండా ఆన్‌లైన్లో ఇ-ఫార్మసీల నుంచి మందుల కొనుగోలు చేసేందుకు వినియోగదార్లు ఆసక్తి చూపుతున్నారు. ఆకర్షణీయమైన డిస్కౌంట్లు లభించటంతో పాటు ఇంటికే మందులు తెచ్చి ఇచ్చే సదుపాయం ఉండటంతో ఇ-ఫార్మసీల వైపు మొగ్గుచూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రిటైల్‌ మందుల విక్రయాల్లో నెమ్మదిగా ఇ-ఫార్మసీల వాటా పెరుగుతోంది. ఇప్పటికే ఇ-ఫార్మసీలు 10- 15 శాతం వాటా సొంతం చేసుకున్నాయి. మన దేశంలో మందులను ఆన్‌లైన్లో విక్రయించడానికి వీలు కల్పించే నిబంధనలు స్పష్టంగా లేవు. దీన్ని ఆధారంగా చేసుకొని రిటైల్‌ మందుల విక్రయదార్ల సంఘాలు ప్రభుత్వానికి గత కొంత కాలంగా ఆన్‌లైన్‌ ఫార్మసీలపై ఫిర్యాదులు చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ ఫార్మసీలను నియంత్రించాలని ఈ సంఘాలు కోరుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు కనిపించటం లేదు. ఆన్‌లైన్‌ ఫార్మసీలతో ఉన్న సదుపాయాలను పరిగణనలోకి తీసుకొని, దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తే, మందుల విక్రయాల్లో ఇ-ఫార్మసీల వాటా ఇంకా పెరిగే అవకాశం ఏర్పడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు